సీఎం పర్యటన.. కాల్పుల కలకలం!
ఇంఫాల్: సీఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ పర్యటన నేపథ్యంలో మణిపూర్ లోని చందేల్ జిల్లాలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. లోక్ చావ్(టెంగ్నోపాల్) లో ఉగ్రవాదులు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పాట్రోలింగ్ లో ఉన్న పోలీసులపై ఒక్కసారిగా కాల్పులు జరిపడంతో నలుగురు భద్రతా సిబ్బంది మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల్లో ఓ పోలీస్ అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. కొత్తగా ప్రకటించిన లోక్ చావ్(టెంగ్నోపాల్) జిల్లాను ప్రారంభించడానికి సీఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ ఆ మార్గంలో వెళ్లనున్న నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.
లోక్ చావ్(టెంగ్నోపాల్) లో మొదట కాల్పులు జరిపిన టెర్రరిస్టులు, ఆ వెంటనే బాంగ్ యాంగ్ లో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మృతిచెందిన వారిలో ఇద్దరు పోలీసులు మహ్మద్ ఆయుబ్ ఖాన్, హెచ్.సి. నగరేయ్ మర్రింగ్ ఉన్నారని అధికారులు తెలిపారు. నాగాల డామినేషన్ ఎక్కువగా ఉన్న చందేల్ జిల్లా నుంచి లోక్ చావ్ జిల్లాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.