నింగిలోకి మరో సమాచార ఉపగ్రహం
ఫ్రెంచిగయానా నుంచి జీశాట్-16 ప్రయోగం
ఉపగ్రహ సమాచార సేవలు ఇక మరింత విస్తృతం
సూళ్లూరుపేట/బెంగళూరు: భారత్‌లో ఉపగ్రహ సమాచార సేవలు విస్తృతం కానున్నాయి. కొత్త సమాచార ఉపగ్రహం జీశాట్-16ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా నింగికి పంపింది. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం తెల్లవారుజామున 2.10 గంటలకు ‘ఏరియన్-5 వీఏ-221’ రాకెట్ ద్వారా జీశాట్-16ను విజయవంతంగా ప్రయోగించింది. ఆదివారం 32.20 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేసి జీశాట్-16ను భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 2.41 గంటలకు బెంగళూరు హసన్‌లోని ఇస్రో ఉపగ్ర హ నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అధీనంలోకి తీసుకుంది. ఉపగ్రహంలోని అపోజీ మోటార్లను మండించి 36 వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెడతామని, తొలిదశ కక్ష్య పెంపును సోమవారం చేపడతామని ఇస్రో తెలిపింది.
డీటీహెచ్ ప్రసారాల్లో నాణ్యత...
దేశంలో ట్రాన్స్‌పాండర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని జీశాట్-16లో 48 ట్రాన్స్‌పాండర్లను అమర్చినట్లు ఇస్రో పేర్కొంది. వీటిలో 12 కేయూ ట్రాన్స్‌పాండర్లు, 24 సీ బ్యాండ్, 12 ఎక్స్‌టెండెడ్ సీ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయని, డీటీహెచ్ వీడియో ప్రసారాల్లో నాణ్యతను పెంచేందుకు ఇవి ఉపయోగపడతాయంది. ఒక జీశాట్ ఉపగ్రహంలో ఇంత పెద్ద సంఖ్యలో ట్రాన్స్‌పాండర్లను ఇస్రో అమర్చి పంపడం ఇదే తొలిసారి. 3,181.6 కిలోల బరువైన జీశాట్-16 ఉపగ్రహ ప్రయోగానికి రూ. 865 కోట్లు ఖర్చయింది. ఈ ఉపగ్రహం 12 ఏళ్లు సేవలు అందించనుంది. జీశాట్-16 ప్రయోగం విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ అభినందించారు.