సినిమా వివాదంపై ప్రశ్నలు సంధించిన హైకోర్టు
ముంబై: హిందీ సినిమా 'ఉడ్తా పంజాబ్' వివాదంపై సెన్సార్ బోర్డుకు, చిత్ర రూపకర్తలకు బాంబే హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఈ సినిమా టైటిల్ మార్చమనడం ద్వారా పంజాబ్ డ్రగ్స్ కు మాత్రమే ప్రసిద్ధిగాంచిందని చెప్పదలుచుకున్నారా అని సెన్సార్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎలక్షన్ వంటి పదాలను తొలగించాలని ఎలా చెబుతారని నిలదీసింది.
సెన్సార్ బోర్డు సూచించిన 13 సలహాలు చెడ్డవని భావిస్తున్నారా అని పిటిషనర్లను ప్రశ్నించింది. దీనిపై విచారణను రేపటికి(శుక్రవారానికి) వాయిదా వేసింది. 'ఉడ్తా పంజాబ్' సినిమాకు సెన్సార్ బోర్డు 89 కట్ లు చెప్పడంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.