Bombay HC
-
జనం రోడ్డెక్కనిదే స్పందించరా?
ముంబై: మహారాష్ట్రలో థానే జిల్లాలోని బద్లాపూర్ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు దిగ్భ్రాంతికరమని బాంబే హైకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. దారుణం జరిగిన నాలుగైదు రోజులకు ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగితే గానీ పోలీసులు స్పందించలేదంటూ మండిపడింది. ‘‘పసిబిడ్డలపై అఘాయిత్యం జరిగితే తేలిగ్గా తీసుకోవడమేమిటి? జనం ఆగ్రహంతో వీధుల్లోకి వస్తే తప్ప ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదలదా? అంటూ ఆగ్రహించింది.ఈ కేసులో బద్లాపూర్ పోలీసుల దర్యాప్తు సక్రమంగా లేదంటూ ఆక్షేపించింది. ‘‘బాధితులు ఫిర్యాదు చేశారు గనుక ఈ వ్యవహారం బయటకొచి్చంది. బయటకు రాని కేసులు ఎన్నో ఉండొచ్చు’’ అని అభిప్రాయపడింది. ‘‘పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి రాకూడదు. వారు న్యాయం కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండకూడదు’’ అని పేర్కొంది.‘‘పిల్లలకు స్కూళ్లలో కూడా భద్రత లేకపోతే ఏం చేయాలి? ఇక విద్యా హక్కు చట్టానికి అర్థమేమిటి?’’ అంటూ నిలదీసింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకు జాప్యం జరిగిందని పోలీసులను ప్రశ్నించింది. ‘‘బాలికల భద్రతపై రాజీపడడానికి వీల్లేదు. వేధింపుల గురించి తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయని స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోండి’’ అని ఆదేశించింది. 27లోగా నివేదిక సమర్పించండిబద్లాపూర్ పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై జరిగిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. స్కూల్ వాష్ రూమ్‌లో అటెండర్ వారిని లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. ఈ నెల 12, 13న దారుణం జరిగితే పోలీసులు 16న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 17న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జస్టిస్ రేవతి మొహితే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌తో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తుచేసింది. బాలికలకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలని, మరింత బాధకు గురిచేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో 27వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. -
స్నేహంలో శారీరకంగా లోబర్చుకునే హక్కేం లేదు!
ముంబై: స్నేహంలో ఒక పురుషుడు, ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నంత మాత్రానా.. అది ఆమె నుంచి లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కాదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా.. జస్టిస్ భారతీ డాంగ్రే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఓ వ్యక్తి తన స్నేహితురాలిని పలుమార్లు లొంగదీసుకున్నాడు. తీరా గర్భం దాల్చాక.. మాట మార్చాడు. ఈ వ్యవహారంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ముందస్తు బెయిల్ కోసం అతను దాఖలు చేసిన అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని, ఆ మహిళను బలవంతంగా లొంగదీసుకున్నాడో లేదో తేల్చాల్సిన అవసరం ఉందని బెంచ్ ఆదేశించింది. ఒక అమ్మాయి అబ్బాయితో స్నేహంగా ఉంటే.. అది ఆమెతో లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఆమె ఇచ్చిన సమ్మతిగా భావించడానికి వీల్లేదు అని జస్టిస్ భారతి అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో.. స్నేహం అనేది ఆడా-మగా అనే తేడాలను బట్టి ఉండడం లేదు. ఒకే తరహా అభిప్రాయాలు, ఆలోచనలు లేదంటే కంఫర్ట్ జోన్లో ఉండడం లాంటి అంశాలను బట్టే స్నేహాలు చేస్తున్నారు. ముఖ్యంగా పని చేసే చోట కలిసి మెలిసి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగని.. స్నేహం అనేది బలవంతంగా వాళ్లను(మహిళలను) లొంగదీసుకునేందుకు మగవాళ్లకు దొరికే హక్కే ఎంత మాత్రం కాదు అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కేసులో ఆమె అతని పట్ల ఆకర్షితురాలైందని, కానీ, పెళ్లి ప్రస్తావనతో అతనికి లొంగిపోయిందా? లేదంటే బెదిరింపులకు, బలవంతం చేశాడా? అనేది నిర్ధారణ కావాల్సి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
చందా కొచర్‌కు మరిన్ని చిక్కులు
సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణంలో ఐసీఐసీఐ బ్యాంకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈస్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎండీ చందా కొచర్ నుంచి తామిచ్చిన బోనస్‌ను రికవరీ చేయాలని కోరింది. అలాగే తన తొలగింపు అక్రమమంటూ చందా కొచర్ గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. తన తొలగింపు ద్వారా ఆర్బిఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొనడం, బ్యాంకు విలువైన స్టాక్ ఆప్షన్‌ను పొందేందుకు, తప్పు దారి పట్టించే ప్రయత్నమని ఐసీఐసీఐ బ్యాంకు తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ మేరకు జనవరి 10 న దావా వేసింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా పడింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీగా ఆమెను తొలగించిన తరువాత ఏప్రిల్ 2006- మార్చి 2018 వరకు ఆమెకిచ్చిన బోనస్ క్లాబ్యాక్ చేయాలని కోరుతోంది. (క్లాబ్యాక్ అంటే ఏదైనా దుష్ప్రవర్తన లేదా క్షీణించిన లాభాల విషయంలో ఒక ఉద్యోగి నుండి బోనస్ తదితర ప్రోత్సాహక-ఆధారిత వేతనాన్ని కంపెనీ తిరిగి తీసుకోవచ్చు) బ్యాంకు వ్యాపార ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి బ్యాంకుతోపాటు వాటాదారులందరికీ తీవ్రమైన ఇబ్బందిని కలిగించిందనీ, బ్యాంకుకు ప్రతిష్టకు తీరని నష్టం కలిగిందని ఆరోపించింది. తన భర్త దీపక్ కొచర్‌కు లబ్ధి చేకూర్చడం కోసమే వీడియోకాన్ గ్రూపునకు రూ .2,250 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్ పాత్ర ఉందని బ్యాంకు ఆరోపించింది. కాగా చందా కొచర్ తన పదవీకాంలో వీడియోకాన్‌కు క్విడ్ ప్రో కో ద్వారా చట్టవిరుద్ధంగా రూ.3250 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. అయితే మొదట్లో చందా కొచర్‌కు బాసటగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు జస్టిస్ (రిటైర్డ్) బిఎన్ శ్రీకృష్ణ కమిటీని 2019 జనవరిలో ఏర్పాటు చేసింది. ఈ కమిటి నివేదిక ఆధారంగా ఆమెను పదవినుంచి తొలగించడంతోపాటు ఏప్రిల్ 2009- మార్చి 2018 మధ్య ఆమెకు చెల్లించిన అన్ని బోనస్, స్టాక్ ఆప్షన్లను తిరిగి తీసుకోవాలని బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. మరోవైపు తన తొలగింపు చట్టవిరుద్ధమని పేర్కొంటూ బ్యాంకు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ (నవంబర్ 30, 2019న)చందా కొచర్ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
తాడ్వి ఆత్మహత్య కేసు; ముగ్గురికి బెయిల్
ముంబై: జూనియర్ డాక్టర్ పాయల్ తాడ్వి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితురాళ్లు హేమ అహుజ, భక్తి మెహరే, అంకిత ఖండేల్‌వాల్‌లకు బాంబే హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల రూపాయల బాండు సమర్పించాలని, రోజు విడిచి రోజు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం షరతులు విధించింది. వీరిని బీవైఎల్ చారిటబుల్ నాయర్ ఆస్పత్రి లోపలికి అనుమతించరాదని ఆదేశించింది. బెయిల్ ఇచ్చేందుకు స్పెషల్ కోర్టు నిరాకరించడంతో నిందితురాళ్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బీవైఎల్ చారిటబుల్ నాయర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల పాయల్ తాడ్వి ఈ ఏడాది మే 22న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పాయల్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మహారాష్ట్రలోని తాడ్వి భిల్ ముస్లిం తెగ(ఎస్టీ)కు చెందిన ఆదివాసీ యువతి అయిన పాయల్ సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పాయల్ రాసిన సూసైడ్ నోట్‌ను జూలై 6న ఫోరెన్సిక్ అధికారులు కనుగొన్నారు. ఈ కేసులో 1200 పేజీల చార్జిషీటును కోర్టుకు ముంబై పోలీసులు గత నెల కోర్టుకు సమర్పించారు. (చదవండి: ఈ పాపం ఎవరిది?) -
సంజయ్ దత్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురు
ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్రా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పెరోల్ పై సంజయ్ దత్ విడుదలను తప్పుపట్టింది. 8 నెలల ముందే జైలు నుంచి ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. సంజయ్ ముందస్తు విడుదలపై సమాధానం చెప్పాలని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. కాగా, 1993 ముంబై బాంబుపేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నారన్న నేరంపై కోర్టు సంజయ్ దత్‌కు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. సత్ర్పవర్తన కారణంగా ఎనిమిది నెలల శిక్ష మిగిలి ఉండగానే జైలు నుంచి విడుదల చేశారు. -
‘ఆ మహిళల మైండ్‌సెట్ మారాలి’
ముంబై: నగరంలోని హజీ అలీ దర్గాలోకి వెళ్లి సూఫీ ముస్లిం గురువు సమాధిని సందర్శించుకునేందుకు మహిళలకు కూడా హక్కుందని ముంబై హైకోర్టు శుక్రవారం ఉదయం ఇచ్చిన తీర్పు పట్ల మహిళల స్పందనలు భిన్నంగా ఉన్నాయి. ఇతర మతాల మహిళలు దీన్ని ఎక్కువగా హర్షిస్తూ వారు దీన్ని మహిళల విజయంగా పేర్కొంటుండగా, ముస్లిం మహిళల్లోనే ఎక్కువ మంది భిన్నంగా స్పందిస్తున్నారు. కోర్టు తీర్పుతో తమకు సంబంధం లేదని, తాము మాత్రం గర్భగుడి, సూఫీ సమాధి వద్దకు వెళ్లమని, ఎప్పటిలాగే దూరం నుంచి దర్శించుకొని పోతామని చెబుతున్నారు. 600 సంవత్సరాల క్రితానికి చెందిన సూఫీ గురువు సయ్యద్ పీర్ హజీ అలీ షా బుఖారి సమాధిని దర్శించుకునేందుకు 2011 సంవత్సరం వరకు దర్గా నిర్వాహకులు మహిళలను లోపలికి అనుమతించారు. అప్పటి వరకు అనుమతించిన వారు ఎందుకు హఠాత్తుగా మహిళలపై నిషేధం విధించారు? అప్పటి వరకు ఎలాంటి సందేహం లేకుండా సూఫీ సమాధిని సందర్శించుకున్న ముస్లిం మహిళలు ఇప్పుడు ఎందుకు సమాధి వద్దకు వెళ్లడానికి సందేహిస్తున్నారు? వారి వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది? ఇప్పుడైనా మహిళల మైండ్‌సెట్ మారాలని మహిళల నిషేధాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ‘భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ‘కోర్టు తీర్పు ఆసక్తిదాయకంగానే ఉంది. ఇతర మహిళలు దర్గా లోపలికి వెళితే వెళ్లనీయండి. ముస్లిం మహిళలు లోపలికి వెళ్లకుండా దూరం నుంచే సమాధిని సందర్శించుకుంటే మంచిదన్నది నా అభిప్రాయం’ అని శుక్రవారం దర్గాను సందర్శించిన 30 ఏళ్ల ఇల్లాలు నసీం బానో మీడియాతో వ్యాఖ్యానించారు. ‘కోర్టు తీర్పు ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు. మేము దర్గా లోపలికి వెళ్లం. అది మగవాళ్ల హక్కు మాత్రమే’ అని షరీఫ్ పఠాన్ అనే మరో మహిళ వ్యాఖ్యానించారు. అడవాళ్లకు రుతుస్రావం లాంటి సమస్యలుంటాయి కనుక దర్గా లోపలికి వెళ్లకపోవడమే మంచిదని పఠాన్ వ్యాఖ్యానించారు. మహిళలకు ఉందే సమస్యల కారణంగానే కేరళలోని శబరిమళ ఆలయంలోకి, మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించడం లేదనే విషయం తెల్సిందే. ముస్లిం ఏతర మహిళలు మాత్రం ఇది మహిళల గొప్ప విజయమని అభివర్ణిస్తున్నారు. ముంబై హైకోర్టు తీర్పు వెలువడిన రోజునే తాను దర్గాకు రావడం తన అదృష్టమని ఢిల్లీ నుంచి వచ్చిన భక్తురాలు మృణాలిని మెహతా లాంటి వారు వ్యాఖ్యానించారు. అయితే తీర్పు వెలువడిన వెంటనే దర్గాలోని సమాధిని సందర్శించే అవకాశం మాత్రం ఇంకా మహిళలకు దక్కలేదు. దర్గా నిర్వాహకులు తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలుపై హైకోర్టు స్టే మంజూరు చేసిన విషయం తెల్సిందే. -
సినిమా వివాదంపై ప్రశ్నలు సంధించిన హైకోర్టు
ముంబై: హిందీ సినిమా 'ఉడ్తా పంజాబ్' వివాదంపై సెన్సార్ బోర్డుకు, చిత్ర రూపకర్తలకు బాంబే హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఈ సినిమా టైటిల్ మార్చమనడం ద్వారా పంజాబ్ డ్రగ్స్ కు మాత్రమే ప్రసిద్ధిగాంచిందని చెప్పదలుచుకున్నారా అని సెన్సార్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎలక్షన్ వంటి పదాలను తొలగించాలని ఎలా చెబుతారని నిలదీసింది. సెన్సార్ బోర్డు సూచించిన 13 సలహాలు చెడ్డవని భావిస్తున్నారా అని పిటిషనర్లను ప్రశ్నించింది. దీనిపై విచారణను రేపటికి(శుక్రవారానికి) వాయిదా వేసింది. 'ఉడ్తా పంజాబ్' సినిమాకు సెన్సార్ బోర్డు 89 కట్ లు చెప్పడంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
'పురుషులు వెళ్లే ప్రతి చోటికి.. మహిళలు వెళ్లొచ్చు'
ముంబై : మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్‌లో ఉన్న శనిదేవునిఆలయంలో మహిళల ప్రవేశంపై బాంబే హైకోర్టులో బుధవారం విచారణ కొనసాగింది. పురుషులు వెళ్లే ప్రతిచోటికి మహిళలు వెళ్లొచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. మహిళలను ఆలయాల్లో ప్రవేశించకూడదని చట్టంలో ఎక్కడాలేదని తెలిపింది. ఏప్రిల్ 1న శని సింగ్నాపూర్ విషయమై మరోసారి విచారణ చేపట్టనుంది. అదే రోజు మహారాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా తెలపాలని ఆదేశించింది. విద్యా బాల్, నీలిమా వార్త అనే ఇద్దరు సామాజిక కార్యకర్తలు మహిళల ఆలయ ప్రవేశ నిరాకరణపై కోర్టులో పిల్ దాఖలు చేశారు. మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించకపోవడం చట్ట విరుద్ధమని, ఇలా చేయడం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని తమ పిటిషన్లో పేర్కొన్నారు. అయిదొందల ఏళ్లకు పైగా చరిత్రగల ఈ ఆలయంలో శనిదేవునికి మహిళలు పూజలు చేయడం నిషేధం. దీన్ని ఇటీవల ఒక మహిళ ఉల్లంఘించి పూజలు చేయడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. -
'ప్రైవేటు స్థలాల్లో అసభ్యత నేరం కాదు'
ముంబయి: బహిరంగ ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో అసభ్యకర చేష్టలకు పాల్పడటం భారతీయ చట్టం ప్రకారం నేరం కాబోదని బొంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన 13మందికి విముక్తి కల్పించింది. గత ఏడాది డిసెంబర్ 12న ముంబయిలోని అంధేరి పరిధిలోని ఓ ఫ్లాట్ లో చుట్టుపక్కలవారికి ఇబ్బంది కలిగేలా కొందరు వ్యవహరించారు. అశ్లీలాన్ని తలపించేలా దుస్తులు ధరించి ఆరుగురు మహిళలు, పీకల దాకా మద్యం తాగి 13 మంది వ్యక్తులు గట్టిగా మ్యూజిక్ పెట్టుకొని నానారచ్చ చేశారని ఓ పాత్రికేయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దృశ్యాలు కిటికీలో నుంచి అందరికీ కనిపించి ఇబ్బందిని కలిగించాయంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు. అయితే, దీనిని బాధితులు కోర్టులో సవాల్ చేయగా ఈ సెక్షన్ కింద కేవలం బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని మాత్రమే శిక్షించగలం తప్ప ప్రైవేటు ప్లేస్ లలో వ్యక్తిగత స్థలాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని శిక్షించే వెసులుబాటు లేదని కోర్టు తెలిపింది. -
జియా ఖాన్ మృతి కేసులో కొత్త మలుపు
మూడేళ్ల క్రితం బాలీవుడ్ వర్థమాన తార జియాఖాన్ ఆత్మహత్య సంచలనం రేపిన విషయం విదితమే. జియా రాసిన సూసైడ్ నోట్ ద్వారా సూరజ్ పంచోలీతో ప్రేమకు సంబంధించి పలు కీలక వివరాలు వెల్లడయ్యాయి. అయితే జియాది ఆత్మహత్య కాదని, ప్రియుడు సూరజ్ పంచోలీనే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. అప్పట్లో పంచోలీని అరెస్ట్ చేసినా, కొన్ని రోజుల విచారణ అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యాడు. ముంబై హై కోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. కాగా రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం జియా ఖాన్ ది హత్య కాదు, ఆత్మహత్యేనంటూ సీబీఐ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జియా తల్లి రబియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ ఆర్ వి మోరే, జస్టిస్ వి ఎల్ అచిలియాలు సభ్యులుగా ఉన్న బెంచ్ గురువారం ఈ కేసుకు సంబంధించి మధ్యంతర స్టే విధించింది. రెండు వారాల్లో పిటిషనర్ కు సమాధానంగా అఫడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. జియా తల్లి రబియా తన పిటిషన్ లో.. ప్రత్యేక విచారణ బృందానికి(ఎస్ఐటి) అప్పగించాలని, విచారణను ఎప్పటికప్పుడు హైకోర్టు పరిశీలిస్తుండాలని కోరారు. జియా అమెరికా పౌరురాలైనందున కేసు విచారణలో ఎఫ్బిఐ ను కూడా భాగం చేయాలని ఆమె విన్నవించారు. కొంతమంది పోలీసు అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జియా మృతి కేసులో సీబీఐ నిజాయితీగా విచారించలేదని, ఒత్తిడులకు తలొగ్గి వీలైనంత త్వరగా కేసును మూసివేయాలని చూస్తున్నారని రబియా ఆరోపించారు. అమెరికా కాన్సులేట్ ను కూడా సీబీఐ తప్పుడు విచారణతో తప్పు దోవ పట్టించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. -
తల్లిదండ్రుల అంగీకారం లేని పెళ్లిళ్లకు నో..ముంబై హైకోర్టు సంచలన తీర్పు
మదురై: తల్లిదండ్రుల సంఘీభావం లేకుండా, వారి సమక్షంలో జరగని పెళ్లిళ్లు చెల్లవని మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది. వాలంటైన్స్ డేకి వారం రోజుల ముందు ఈ తీర్పు రావడం ఓ విశేషం. వరుని, వధువు తల్లిదండ్రులు లేకుండా పోలీస్ స్టేషన్లలో గానీ, రిజిస్ట్రార్ ఆఫీసుల్లోగానీ పెళ్లి నమోదు చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసు ఒక కొత్త చట్టానికి నాంది పలుకుతోందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ తమిళ్ వన్నన్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే మేజర్లైన అమ్మాయి, అబ్బాయికి తమ భాగస్వాములను ఎన్నుకునే స్వేచ్ఛ ఉందన్నారు. ముంబై హైకోర్టుదీ అదే తీర్పు... అయితే ఇదే కేసులో ముంబై హైకోర్టూ ఇదే తీర్పును వెలువరించింది. తల్లిదండ్రుల సమక్షంలో జరగని పెళ్లిళ్లు చెల్లవని కోర్టు తెలిపింది. ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో ఆత్మహత్యలు, విడాకుల కేసులు, కిడ్నాప్ లు, కుల గొడవలు ఎక్కువవుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వివాహాల సమయంలో తల్లిదండ్రులు వారివెంటే ఉన్నట్లైతే ఇలాంటి ఘటనలను సాధ్యమైనంత వరకు నిరోధించవచ్చని కోర్టు అభిప్రాయపడింది.