'పురుషులు వెళ్లే ప్రతి చోటికి.. మహిళలు వెళ్లొచ్చు'
ముంబై : మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్‌లో ఉన్న శనిదేవునిఆలయంలో మహిళల ప్రవేశంపై బాంబే హైకోర్టులో బుధవారం విచారణ కొనసాగింది. పురుషులు వెళ్లే ప్రతిచోటికి మహిళలు వెళ్లొచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. మహిళలను ఆలయాల్లో ప్రవేశించకూడదని చట్టంలో ఎక్కడాలేదని తెలిపింది.
ఏప్రిల్ 1న శని సింగ్నాపూర్ విషయమై మరోసారి విచారణ చేపట్టనుంది. అదే రోజు మహారాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా తెలపాలని ఆదేశించింది. విద్యా బాల్, నీలిమా వార్త అనే ఇద్దరు సామాజిక కార్యకర్తలు మహిళల ఆలయ ప్రవేశ నిరాకరణపై కోర్టులో పిల్ దాఖలు చేశారు. మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించకపోవడం చట్ట విరుద్ధమని, ఇలా చేయడం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయిదొందల ఏళ్లకు పైగా చరిత్రగల ఈ ఆలయంలో శనిదేవునికి మహిళలు పూజలు చేయడం నిషేధం. దీన్ని ఇటీవల ఒక మహిళ ఉల్లంఘించి పూజలు చేయడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.