బద్లాపూర్ ఘోరంపై బాంబే హైకోర్టు
చిన్నారులపై లైంగిక వేధింపులు దారుణం
స్కూళ్లలోనే భద్రత లేకుంటే చట్టమెందుకు?
వ్యవస్థపై నమ్మకం కోల్పోయే స్థితి రావద్దు
నిర్లక్ష్యం రుజువైతే అధికారులపై కఠిన చర్యలు
ముంబై: మహారాష్ట్రలో థానే జిల్లాలోని బద్లాపూర్ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు దిగ్భ్రాంతికరమని బాంబే హైకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. దారుణం జరిగిన నాలుగైదు రోజులకు ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగితే గానీ పోలీసులు స్పందించలేదంటూ మండిపడింది. ‘‘పసిబిడ్డలపై అఘాయిత్యం జరిగితే తేలిగ్గా తీసుకోవడమేమిటి? జనం ఆగ్రహంతో వీధుల్లోకి వస్తే తప్ప ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదలదా? అంటూ ఆగ్రహించింది.
ఈ కేసులో బద్లాపూర్ పోలీసుల దర్యాప్తు సక్రమంగా లేదంటూ ఆక్షేపించింది. ‘‘బాధితులు ఫిర్యాదు చేశారు గనుక ఈ వ్యవహారం బయటకొచి్చంది. బయటకు రాని కేసులు ఎన్నో ఉండొచ్చు’’ అని అభిప్రాయపడింది. ‘‘పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి రాకూడదు. వారు న్యాయం కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండకూడదు’’ అని పేర్కొంది.
‘‘పిల్లలకు స్కూళ్లలో కూడా భద్రత లేకపోతే ఏం చేయాలి? ఇక విద్యా హక్కు చట్టానికి అర్థమేమిటి?’’ అంటూ నిలదీసింది. ఎఫ్‌ఐఆర్ నమోదులో ఎందుకు జాప్యం జరిగిందని పోలీసులను ప్రశ్నించింది. ‘‘బాలికల భద్రతపై రాజీపడడానికి వీల్లేదు. వేధింపుల గురించి తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయని స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోండి’’ అని ఆదేశించింది.
27లోగా నివేదిక సమర్పించండి
బద్లాపూర్ పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై జరిగిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. స్కూల్ వాష్ రూమ్‌లో అటెండర్ వారిని లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. ఈ నెల 12, 13న దారుణం జరిగితే పోలీసులు 16న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 17న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జస్టిస్ రేవతి మొహితే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌తో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తుచేసింది. బాలికలకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలని, మరింత బాధకు గురిచేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో 27వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment