బోర్డర్లో గ్రామస్తులకు తొలి కాంక్రీట్ బాంబ్ షెల్టర్
జమ్మూ: సరిహద్దు ప్రాంతాల్లో నివసించే గ్రామీణ ప్రజలకు భారత ఆర్మీ పెద్ద ఊరటను కలిగించింది. వారికి తొలిసారి కాంక్రీట్తో నిర్మించిన అండర్ గ్రౌండ్ బాంబు దాడి నివారణ షెల్టర్ను అప్పగించింది. ఈ షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారీ మొత్తంలో సమీప గ్రామస్తులు, ఆర్మీ అధికారులు హాజరయ్యారు. పూంచ్ జిల్లాలోని గాలి మైదాన్ ప్రాంతం వద్ద ఈ షెల్టర్ను ఆర్మీ నిర్మించింది.
'పాకిస్థాన్తో సరిహద్దు కలిగిన ఈ ప్రాంతంలో ఆర్మీ కమాండర్స్ను, గ్రామస్తులను లక్ష్యంగా చేసుకొని నిత్యం పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆ దాడులవల్ల జరిగే నష్ట నివారణ చర్యల్లో భాగంగా అండర్ గ్రౌండ్ లో ఈ షెల్టర్ నిర్మించి గ్రామస్తులకు అందించాం. ఈ కాంక్రీట్ షెల్టర్ గ్రామస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వారిని దాడుల నుంచి రక్షిస్తుంది' అని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ఈ షెల్టర్ లో ప్రత్యేక టాయిలెట్లతోపాటు, సోలార్ పవర్ కూడా ఏర్పాటుచేశారు.