గవర్నర్ చేతిలో సీఎం కీలుబొమ్మ
ఈటానగర్: గవర్నర్ జేపీ రాజ్ ఖోవా చేతిలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కలిఖో పల్ కీలుబొమ్మ అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్ పక్షనేత నబాం టుకీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీ అరుణాచల్ పీపుల్స్ పార్టీకి గవర్నర్ బంగ్లా రాజ్ భవన్ కేంద్ర కార్యాలయంగా మారిందని ఆరోపించారు. కేంద్రం ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను గవర్నర్ రాజ్ ఖోవా చక్కగా నిర్వర్తిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బమాంగ్ ఫెలిక్స్ ఎద్దేవా చేశారు. గవర్నర్ చేప్పిన విషయాలకు మాత్రమే సీఎం స్పందిస్తున్నారని, ఆయన సాధించింది ఏం లేదన్నారు.
అసత్య ప్రచారం, వాస్తవరూపం దాల్చలేని హామీలిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలను నిర్వహించడంలో కూడా పీపీఏ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతూ వాటికి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను బాధ్యులను చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యంపై త్వరలోనే గవర్నర్ వద్దకు వెళ్లి పిర్యాదు చేయనున్నట్లు పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు.