
ఇద్దరు మంత్రులకు ఉద్వాసన?
తన మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. కనీసం ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలకాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.
తన మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఈనెలాఖరుతో ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి కాబట్టి, ఆ తర్వాత కనీసం ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలకాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా లాంటివాళ్లు తప్ప మిగిలినవారి విషయంలో భారీ మార్పులే ఉంటాయని, కొనసాగించే మంత్రుల శాఖల్లో కూడా మార్పులు తప్పకపోవచ్చని అంటున్నారు. ప్రభుత్వంలో ఏకైక మహిళ, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న వందనా కుమారిని మారుస్తారని, అలాగే స్పీకర్ రామ్ నివాస్ గోయల్‌కు మంత్రిపదవి ఇస్తారని చెబుతున్నారు.
మంత్రివర్గంలో మార్పుచేర్పులు ఎటూ తప్పవని, అయితే ఇప్పటివరకు శాఖల మార్పుపై తుది నిర్ణయం ఏమీ తీసుకోలేదని పార్టీ సీనియర్ సభ్యుడొకరు చెప్పారు. గత ఏడాది కాలంలో మంత్రుల పనితీరును పార్టీ మదింపు చేసిందని, వాళ్లలో కొంతమంది అటు మంత్రులుగాను, ఇటు రాజకీయంగాను కూడా పెద్దగా ప్రభావం ఏమీ చూపించలేకపోతున్నట్లు తెలిసిందని అన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ మీద వేటు పడటం దాదాపు ఖాయమని తెలుస్తోంది. శిలాఫలకం మీద తన భార్య పేరు లేదన్న కారణంతో ఒక స్కూలు ప్రిన్సిపాల్‌ను తీవ్రంగా అవమానించిన ఆరోపణలు ఆయనపై ఇటీవల గట్టిగా వచ్చాయి. ఇలాంటి ఒకరిద్దరికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.