కారులో పోలీసు, మహిళ అనుమానాస్పద మృతి!
కారులో పోలీసు, మహిళ అనుమానాస్పద మృతి!
Published Fri, Dec 23 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
రాజస్థాన్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)లోని ఓ ఉన్నతాధికారి, మరో మహిళ అనుమానాస్పద స్థితిలో ఓ కారులో మరణించారు. వాళ్లిద్దరి మృతదేహాలు కారులో కనిపించాయి. రాష్ట్ర రాజధాని జైపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివదాస్‌పురా ప్రాంతంలో రోడ్డుపక్కన పార్కింగ్ చేసి ఉన్న కారులో అదనపు ఎస్పీ ఆశిష్ ప్రభాకర్, మరో గుర్తుతెలియని మహిళ మరణించి ఉన్నారు. ఆ మహిళ ఎవరన్న విషయం ఇంతవరకు తెలియలేదు. ప్రభాకర్ సర్వీస్ రివాల్వర్ నుంచి వచ్చిన తూటాల కాల్పులతోనే ఇద్దరూ మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా చెప్పారు.
ఒక మహిళ కారులో మరణించి పడి ఉందని గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రభాకర్ ఫోను నుంచి పోలీసు కంట్రోల్‌రూంకు ఫోన్ వచ్చింది. పోలీసులు అక్కడకు వెళ్లి చూసేసరికి ప్రభాకర్ మృతదేహం ఆ ఎస్‌యూవీ డ్రైవింగ్ సీటులో ఉంది. ఆ మహిళ మృతదేహం ప్రభాకర్ ఒళ్లో పడి ఉంది. కారులో కొన్ని ఖాళీ బీరు క్యాన్లు కనిపించాయి. పోలీసులు అక్కడకు వెళ్లేసరికి కారు లోపలి నుంచి తాళం వేసి ఉందని డీసీపీ మనీష్ అగర్వాల్ తెలిపారు. ప్రభాకర్ సర్వీసు రివాల్వర్ నుంచి రెండు రౌండ్ల్ కాల్పులు జరిగాయని, ఇది ఆత్మహత్యా.. లేక మరేమైనా అయి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ప్రభాకర్‌కు గతంలో ఒక సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంస్థ ఉండేదని, ఆ మహిళ అక్కడ చదువుకుందని, బహుశా ఇద్దరి మధ్య అప్పటినుంచి సంబంధం ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలం పాటు చదువుకోసం సెలవు తీసుకున్న తర్వాత ప్రభాకర్ ఇటీవలే ఏటీఎస్‌లో చేరారు. ఆయనకు ఇప్పటికే పెళ్లయింది.
Advertisement
Advertisement