సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశవ్యాప్తంగా దళితులపై, ముస్లింలపై దాడులు విపరీతంగా పెరిగాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 2019 ఇంటర్‌నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ రిపోర్టు (అంతర్జాతీయ మతస్వేచ్ఛ నివేదిక) అనే యూఎస్ సంస్థ చేపట్టిన ఓ సర్వేలో పలు అంశాలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ.. తన నివేదికలో పలు విషయాలను పొందుపరిచింది. హిందుమత వ్యాప్తి కోసం ఇతర మతాలపై హిందుత్వ సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొంది.
ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మైనార్టీల మత స్వేచ్ఛకు తీవ్ర భంగం ఏర్పడిందని తెలిపింది. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు, అన్ని మతాలకు ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా కొన్ని సంస్థలు వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మైనార్టీలపై దాడులకు అరికట్టడంలో తీవ్రంగా విఫలమైందని, మూక దాడుల పేరుతో ఓ వర్గాన్ని తీవ్రంగా హింసిస్తున్నారని నివేదికలో పేర్కొంది. దక్షిణ భారతదేశంతో పోలిస్తే.. ఉత్తరంలో మూకదాడులు విపరీతంగా పెరిగాయని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దాడులు ఎక్కువగా ఉన్నాయని ఇంటర్‌నేషనల్ రిలీజియన్ ప్రీడమ్ రిపోర్టు తెలిపింది.
దీనితో పాటు అగ్రరాజ్యం అమెరికాకు పలు సూచనలు కూడా చేసింది. అమెరికాతో పోలిస్తే భారత్‌తో మతస్వేచ్ఛను మరింత విస్తరించాలని పేర్కొంది. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 18 ఘటనలు జరగగా.. వీటిలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సర్వే రిపోర్టు తెలిపింది. మతస్వేచ్ఛపై ప్రచారం కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని వెల్లడించింది. హిందుత్వ సంస్థలు, గోసంరక్షణ దళాలు దళితులు, మైనార్టీలపై దాడులకు మూలకారణం అవుతున్నాయని పేర్కొంది.
దాడులను అరికట్టడంలో బీజేపీ విఫలం: యూఎస్ రిపోర్టు
Published Sat, Jun 22 2019 3:52 PM | Last Updated on Sat, Jun 22 2019 4:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment