
48 కిలోల బంగారం చోరీ
చెన్నై : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కుందారపల్లి రోడ్డు రామాపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నుంచి శనివారం తెల్లవారుజామున దుండగులు 48 కిలోల బంగారు ఆభరణాలు లూటీ చేశారు. ఈ ఆభరణాల విలువ 12 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. బ్యాంకు వెనుక ఉన్న తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు లాకర్‌లను బద్ధలుగొట్టి నగలు దొంగిలించారు. శనివారం ఉదయం ఉద్యోగులు బ్యాంకుకు వచ్చిన తరువాత విషయం తెలిసింది.
సమాచారం అందుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం హుటాహుటిన అక్కడకు చేరుకుని విచారణ చేపట్టింది. దాదాపు 1500 మంది ఖాతాదారులు ఈ బ్యాంకులో విలువైన బంగారు నగలను తాకట్టు పెట్టారు. ఇక్కడ మేనేజర్‌గా పని చేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉదయ భాస్కర్ శుక్రవారం సాయంత్రం బ్యాంకు సమయం ముగిసిన తర్వాత తాళాలు వేసుకొని వెళ్లారు. శనివారం ఉదయం వచ్చి చూస్తే బ్యాంకు లోపల వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే కురుబరపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బ్యాంకు వెనుక ఖాళీ ప్రదేశం ఉంది. బ్యాంకు చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. దొంగలు ముళ్లకంచెను తొలగించుకొని బ్యాంకు వెనుక భాగంలో తలుపులు పగులగొట్టి, అత్యవసర సైరన్ వైర్లను కత్తిరించి లోనికెళ్లారు. బ్యాంకులో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాల వైర్లను కూడా కత్తిరించారు. ఒక సీసీ కెమెరాలో వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు లాకర్‌ను పగులగొడుతున్న దశ్యం రికార్డు అయిందని పోలీసులు తెలిపారు. వారిని ఉత్తర భారతదేశానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు.