గయ : బిహార్‌లోని గయ జిల్లాలో భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన జమాతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాది ఇజాజ్ అహ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు జరిపిన దాడుల్లో టైమర్ బాంబు తయారీకి ఉపయోగించే ఆయుధ, పేలుడు సామాగ్రి, పరికరాలను ఎస్‌టీఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేఎంబీ టెర్రరిస్టు ఇజాజ్ అహ్మద్ 2012లో జరిగిన వర్ధమాన్ పేలుళ్లు, 2013లో బోధ్‌గయ పేలుళ్లలో చురుకుగా వ్యవహరించినట్టు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఇటీవల బెంగాల్‌కు వచ్చిన ఇజాజ్‌ను గయ జిల్లాలోని పఠాన్‌తోలిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్‌లో నిషేధిత ఉగ్ర సంస్థ కార్యకలాపాల కోసం ఉత్తర బెంగాల్‌ను కేంద్రంగా ఎంచుకున్నానని ఇజాజ్ దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు. గత ఏడాదిగా ఇజాజ్ ఉత్తర బెంగాల్‌లో పర్యటించి స్ధానిక యువతను తమ సంస్థలోకి ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. స్ధానిక యువతను ఉగ్ర కార్యకలాపాలకు ఆకర్షించే క్రమంలో ఇజాజ్ మతపరమైన కార్యక్రమాలకు భారీ విందులు ఏర్పాటు చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment