ముంబై : బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మటోండ్కర్‌పై ముంబై నార్త్ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ గోపాల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇక్కడ గోవిందా ఎంపీగా గెలిచినంత మాత్రాన మళ్లీ అలాగే జరుగుతుందని ఆమె భ్రమ పడ్డారని చురకలంటించారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని ఊర్మిళాను కాంగ్రెస్ పోటీకి దించిందని ఎద్దేవా చేశారు. ఊర్మిళా రాజకీయంగా ‘భోలీ భోలీ లడ్‌కీ’ (అమాయకురాలు) అని అభివర్ణించారు. ‘కేవలం ఊర్మిళ సినిమా తార కాబట్టే ఆమె ప్రచారంలో జనం కనిపిస్తున్నారు. కానీ, ఎవరికి ఓటు వేయాలో జనానికి తెలుసు’ అన్నారు.
గత 5 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నాని, ఈ సారి కూడా విజయం తనదేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, 2009లో ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీచేసిన సంజయ్ నిరుపమ్ బీజేపీ అభ్యర్థి రామ్‌నాయక్‌పై విజయం సాధించారు. అయితే, 2014 ఎన్నికల్లో బీజేపీ గోపాల్ శెట్టిని బరిలో నిలిపింది. ఆయన సంజయ్‌పై తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా సంజయ్‌కి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. కానీ, ఆయన అక్కడ నుంచి పోటీకి విముఖత చూపించారు. వాయువ్య ముంబై నుంచి బరిలోకి దిగుతున్నారు. 2004 ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ తరపున గోవిందా విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment