
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 బారినపడి కోలుకుని గత నెలలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బీజేపీ నేత సంబిట్ పాత్ర సోమవారం గురుగ్రామ్ ఆస్పత్రిలో ప్లాస్మా దానం చేశారు. గురుగ్రామ్‌లోని మెదాంత ఆస్ప్రత్రిలో ఆయన ప్లాస్మా దానం చేశారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఉధృతమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 2500 తాజా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. వ్యాక్సిన్ వచ్చే వరకూ మహమ్మారికి సరైన చికిత్స కొరవడిన నేపథ్యంలో అందరి దృష్టి ప్లాస్మా థెరఫీపై కేంద్రీకృతమైంది.
ఈ క్రమంలో ఢిల్లీలో తొలి ప్లాస్మా బ్యాంక్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాల్సిందిగా కేజ్రీవాల్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు, కరోనా వైరస్ చికిత్స కోసం ప్లాస్మా పొందడంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ఇప్పుడు కొంత ఉపశమనం లభిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్లాస్మాను దానం చేయడానికి ఇప్పుడు ఎక్కువ మంది ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను’ అన్నారు. ఐఎల్‌బీఎస్ ఆస్పత్రిలో ఈ ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించినట్లు ఆప్ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment