సాక్షి, హైదరాబాద్: మధ్య వయస్కులూ.. తస్మాత్ జాగ్రత్త! గతంలో భయపడిన దానికి భిన్నంగా ఇప్పుడు జరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దశలో పదేళ్లలోపు పిల్లలు, వృద్ధులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే మనదేశంలో ఇప్పుడు పిల్లలు, వృద్ధులపై కోవిడ్ ప్రభావం తగ్గి, 35–60 ఏళ్లలోపున్న వారిపై, ముఖ్యంగా పురుషులపై దీని ప్రభావం ఎక్కువని కిమ్స్ కన్సల్టింగ్ పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ డా. వీవీ రమణ ప్రసాద్ చెప్తున్నారు. దీనికి తోడు ఊబకాయం, అధిక బరువు ఉన్నవారిలో మగ, ఆడ అనే తేడా లేకుండా ఎక్కువమందికి కరోనా వైరస్ సోకుతోందన్నారు. వైరస్ సోకిన తర్వాత అధిక బరువు, షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ తదితర తీవ్ర సమస్యలున్న వారిలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. కొంతకాలంగా కోవిడ్ పేషెంట్లకు చికిత్స చేస్తున్న డా.రమణ ప్రసాద్ ప్రాధాన్యత సంతరించుకున్న పలు అంశాలపై సాక్షితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
ఆ అంశాలు.. ఆయన మాటల్లోనే...
ఆలస్యం చేయొద్దు...
2, 3 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోతే మామూలే అని చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు. టెస్ట్ చేయించుకోవడం లేదు. మళ్లీ జ్వరమో ఇతర లక్షణాలో కనిపించి అది న్యూమోనియాగా మారుతోంది. ఆ తర్వాత ఆసుపత్రిలో చేర్చి ఆక్సిజన్ ఇవ్వడం, ఐసీయూలో చేర్చడం, వెంటిలేటర్ అమర్చే పరిస్థితి వచ్చి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు. మొదట నిర్లక్ష్యం చేసి, తర్వాత అది తీవ్ర రూపం దాల్చేదాక వేచి చూడొద్దు.
ప్లాస్మా థెరపీ ప్రయోజనకరమే...
ప్లాస్మా థెరపీలో ప్లాస్మా ఎవరి దగ్గర తీసుకున్నారనేది ప్రధానం. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఎక్కువ యాంటీబాడీస్ ఉన్న ప్లాస్మా మంచి ఫలితాలిస్తోంది. వైరస్ తీవ్రత ఎక్కువై వెంటిలేటర్ పెట్టాల్సిన రోగులకు ఇది బాగా పనిచేస్తోంది.
ఎన్–95 మాస్క్‌లు నిషేధించాలి...
రెస్పిరేటరీ వాల్వులున్న ఎన్–95 మాస్క్‌లను వెంటనే నిషేధించాలి. వైరస్ సోకినా లక్షణాలు కనిపించని అసింప్టోమేటిక్, స్వల్ప లక్షణాలున్న వారు ఈ మాస్క్‌లను వాడితే.. గుంపుల్లోకి వెళ్లి మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా తుంపర్ల ద్వారా కచ్చితంగా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది.
వ్యాక్సిన్ వల్ల 50, 60 శాతం రక్షణ!
ఈ డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. వచ్చినా దాని వల్ల 50, 60 శాతం రక్షణ ఉండొచ్చు. వ్యాక్సిన్ ఒక నివారణగా మాత్రమే పనిచేస్తుంది.
వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే...
ఏ వైరస్ అయినా ఒకసారి వచ్చి తగ్గిపోయాక పర్యావరణంలో ఉండిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినవారికి ఇది మళ్లీ సోకే అవకాశాలుంటాయి. అందువల్ల కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే. 2008లో తీవ్రంగా వచ్చిన స్వైన్‌ఫ్లూ వల్ల మరణాలు ఎక్కువగా నమోదయ్యాక, తర్వాతి సంవత్సరాల్లో కూడా ఆ కేసులు తక్కువగానైనా బయటపడుతున్నాయి.
రీఇన్ఫెక్షన్లపై ఆందోళనొద్దు...
కరోనా ఒకసారి వచ్చి తగ్గిపోయాక మళ్లీ ఇన్ఫెక్ట్ అవుతామేమోననే ఆందోళనలు వద్దు. అలాగని నిర్లక్ష్యంగా కూడా ఉండొద్దు. సరైన జాగ్రత్తలు పాటించాలి.
తగ్గినా వేరే లక్షణాలతో వస్తున్నారు
కోవిడ్ వచ్చి తగ్గిన 2, 3 నెలల తర్వాత గుండె సమస్యలు, పక్షవాతం, ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో కొందరు మళ్లీ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ పరిస్థితిని డాక్టర్లు ‘లాంగ్ కోవిడ్’గా అభివర్ణిస్తున్నారు. వైరస్ పూర్తిగా నిర్వీర్యం కాకపోవడం, ఆలస్యంగా చికిత్స తీసుకోవడం దీనికి ప్రధాన కారణం. వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నవారిలో ‘లంగ్ ఫైబ్రోసిస్’ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment