N95 masks
-
కరోనా వైరస్‌ను ఖతం చేసే ఎన్95 మాస్క్
వాషింగ్టన్: కోవిడ్–19 వ్యాప్తిని చాలావరకు తగ్గించడమే కాదు, తనతో కాంటాక్టు అయిన సార్స్–కోవ్–2 వైరస్‌ను చంపేసే సరికొత్త ఎన్95 మాస్క్‌ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ మాస్క్‌ను ఎక్కువ కాలం ధరించవచ్చని, తరచుగా మార్చాల్సిన అవసరం లేదని, దీనితో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా తక్కువేనని పరిశోధకులు తెలియజేశారు. తనంతట తాను స్టెరిలైజ్ చేసుకొనే వ్యక్తిగత రక్షణ పరికరం తయారీలో ఇదొక మొదటి అడుగు అని భావిస్తున్నామని అమెరికాకు చెందిన రెన్సెలార్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి ఎడ్మండ్ పాలెర్మో చెప్పారు. ఈ ఎన్95 మాస్క్‌ను ధరిస్తే గాలిద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని అన్నారు. తాజా పరిశోధన వివరాలను ఇటీవలే ‘అప్లయిడ్ ఏసీఎస్ మెటీరియల్స్, ఇంటర్ఫేసేస్’ పత్రికలో ప్రచురించారు. కరోనా వైరస్‌ను అంతం చేసే ఎన్95 మాస్క్ తయారీ కోసం యాంటీమైక్రోబియల్ పాలిమర్స్, పాలిప్రొపైలీన్ పిల్టర్లు ఉపయోగించారు. ఒకదానిపై ఒకటి పొరలుగా అమర్చారు. ఈ పరిశోధనలో ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) పరిశోధకులు కూడా భాగస్వాములయ్యారు. మాస్క్ పైభాగంలో వైరస్‌లను, బ్యాక్టీరియాను చంపేపే నాన్–లీచింగ్ పాలిమర్ కోటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం అతినీలలోహిత కాంతి, అసిటోన్ కూడా ఉపయోగించారు. -
కరోనా: ఎలాంటి మాస్క్ ధరించాలి? ఏది బెస్ట్?
వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనాకు మంచి మందు మాస్క్ వినియోగమే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు వచ్చినప్పుడు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్ ఏదైనా ధరించవచ్చు. డిస్పోజబుల్ మాస్కులు మంచివే అయినప్పటికీ వాటిని కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల పొరలతో కూడిన క్లాత్ మాస్కులను క్రమం తప్పకుండా ఉతుకుతూ పలుమార్లు వినియోగించుకోవచ్చు. అయితే ఇంట్లో తయారు చేసుకున్న మాస్క్/ క్లాత్/ సర్జికల్ మాస్క్ ధరించడంతో కరోనా వైరస్ నుంచి 51.4 శాతం నుంచి గరిష్టంగా 56.1శాతం మాత్రమే రక్షణ లభిస్తోందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది. సర్జికల్ మాస్క్ లేదా క్లాత్ మాస్క్ రెండేసి ధరిస్తే వైరస్ నుంచి 95 శాతం తప్పించుకున్నట్లేనని పేర్కొంది. అయితే ఎన్–95 మాస్కును సింగిల్‌గానే వాడాలి. ఏదైనా క్రమ పద్ధతిలో ధరించాలి. నోరు, ముక్కు పూర్తిగా కవర్ చేస్తూ పెట్టుకోవాలి. డబుల్ మాస్కులు ఒకదానిపై ఒకటి పెట్టి ధరించాలి. శ్వాస కోసం ముక్కు దగ్గర, చెవుల వైపు వదులుగా ఉంటే, గాలి లీకేజీతో వైరస్ వ్యాప్తికి మార్గం ఏర్పడుతుంది. -పి.విజయ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్, కడప -
రాష్ట్రంలో 7.73 లక్షల ఎన్–95 మాస్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు కావాల్సిన అత్యవసర వస్తువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్న నిల్వలకు అదనంగా మరిన్ని వస్తువులను సమకూరుస్తోంది. 8.14 లక్షల హోం ఐసోలేషన్ కిట్ల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వగా.. ఇందులో ఇప్పటికే 4.29 లక్షల కిట్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు, నర్సులు వినియోగించే ఎన్–95 మాస్కులతోపాటు పీపీఈ కిట్లను కూడా పెద్ద ఎత్తునే నిల్వ ఉంచింది. ఎటువంటి కొరత లేకుండా కోవిడ్ నియంత్రణకు అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర వస్తువులన్నీ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో తగినన్ని ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లు, సర్జికల్ మాస్కులు, గ్లౌజులు, వైరల్ ట్రాన్స్మిషన్ మీడియం (వీటీఎం), హోం ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచారు. -
మధ్య వయస్కులూ.. తస్మాత్ జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: మధ్య వయస్కులూ.. తస్మాత్ జాగ్రత్త! గతంలో భయపడిన దానికి భిన్నంగా ఇప్పుడు జరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దశలో పదేళ్లలోపు పిల్లలు, వృద్ధులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే మనదేశంలో ఇప్పుడు పిల్లలు, వృద్ధులపై కోవిడ్ ప్రభావం తగ్గి, 35–60 ఏళ్లలోపున్న వారిపై, ముఖ్యంగా పురుషులపై దీని ప్రభావం ఎక్కువని కిమ్స్ కన్సల్టింగ్ పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ డా. వీవీ రమణ ప్రసాద్ చెప్తున్నారు. దీనికి తోడు ఊబకాయం, అధిక బరువు ఉన్నవారిలో మగ, ఆడ అనే తేడా లేకుండా ఎక్కువమందికి కరోనా వైరస్ సోకుతోందన్నారు. వైరస్ సోకిన తర్వాత అధిక బరువు, షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ తదితర తీవ్ర సమస్యలున్న వారిలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. కొంతకాలంగా కోవిడ్ పేషెంట్లకు చికిత్స చేస్తున్న డా.రమణ ప్రసాద్ ప్రాధాన్యత సంతరించుకున్న పలు అంశాలపై సాక్షితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ అంశాలు.. ఆయన మాటల్లోనే... ఆలస్యం చేయొద్దు... 2, 3 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోతే మామూలే అని చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు. టెస్ట్ చేయించుకోవడం లేదు. మళ్లీ జ్వరమో ఇతర లక్షణాలో కనిపించి అది న్యూమోనియాగా మారుతోంది. ఆ తర్వాత ఆసుపత్రిలో చేర్చి ఆక్సిజన్ ఇవ్వడం, ఐసీయూలో చేర్చడం, వెంటిలేటర్ అమర్చే పరిస్థితి వచ్చి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు. మొదట నిర్లక్ష్యం చేసి, తర్వాత అది తీవ్ర రూపం దాల్చేదాక వేచి చూడొద్దు. ప్లాస్మా థెరపీ ప్రయోజనకరమే... ప్లాస్మా థెరపీలో ప్లాస్మా ఎవరి దగ్గర తీసుకున్నారనేది ప్రధానం. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఎక్కువ యాంటీబాడీస్ ఉన్న ప్లాస్మా మంచి ఫలితాలిస్తోంది. వైరస్ తీవ్రత ఎక్కువై వెంటిలేటర్ పెట్టాల్సిన రోగులకు ఇది బాగా పనిచేస్తోంది. ఎన్–95 మాస్క్‌లు నిషేధించాలి... రెస్పిరేటరీ వాల్వులున్న ఎన్–95 మాస్క్‌లను వెంటనే నిషేధించాలి. వైరస్ సోకినా లక్షణాలు కనిపించని అసింప్టోమేటిక్, స్వల్ప లక్షణాలున్న వారు ఈ మాస్క్‌లను వాడితే.. గుంపుల్లోకి వెళ్లి మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా తుంపర్ల ద్వారా కచ్చితంగా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది. వ్యాక్సిన్ వల్ల 50, 60 శాతం రక్షణ! ఈ డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. వచ్చినా దాని వల్ల 50, 60 శాతం రక్షణ ఉండొచ్చు. వ్యాక్సిన్ ఒక నివారణగా మాత్రమే పనిచేస్తుంది. వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే... ఏ వైరస్ అయినా ఒకసారి వచ్చి తగ్గిపోయాక పర్యావరణంలో ఉండిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినవారికి ఇది మళ్లీ సోకే అవకాశాలుంటాయి. అందువల్ల కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే. 2008లో తీవ్రంగా వచ్చిన స్వైన్‌ఫ్లూ వల్ల మరణాలు ఎక్కువగా నమోదయ్యాక, తర్వాతి సంవత్సరాల్లో కూడా ఆ కేసులు తక్కువగానైనా బయటపడుతున్నాయి. రీఇన్ఫెక్షన్లపై ఆందోళనొద్దు... కరోనా ఒకసారి వచ్చి తగ్గిపోయాక మళ్లీ ఇన్ఫెక్ట్ అవుతామేమోననే ఆందోళనలు వద్దు. అలాగని నిర్లక్ష్యంగా కూడా ఉండొద్దు. సరైన జాగ్రత్తలు పాటించాలి. తగ్గినా వేరే లక్షణాలతో వస్తున్నారు కోవిడ్ వచ్చి తగ్గిన 2, 3 నెలల తర్వాత గుండె సమస్యలు, పక్షవాతం, ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో కొందరు మళ్లీ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ పరిస్థితిని డాక్టర్లు ‘లాంగ్ కోవిడ్’గా అభివర్ణిస్తున్నారు. వైరస్ పూర్తిగా నిర్వీర్యం కాకపోవడం, ఆలస్యంగా చికిత్స తీసుకోవడం దీనికి ప్రధాన కారణం. వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నవారిలో ‘లంగ్ ఫైబ్రోసిస్’ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. -
వాల్వ్‌ల్లేని ‘ఎన్–95’లే బెస్ట్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రజల రోజువారీ అలవాట్లను, జీవనశైలిని ఒక్కసారిగా మార్చేసింది. మాస్క్ ధరించడం అందరి జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుందని తెలిశాక మాస్క్‌లకు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి ఎలాంటి మాస్క్‌లు ధరించాలన్న అంశంపై మాత్రం ఆరు నెలలు గడిచినా ఇంకా నిర్దిష్టమైన పరిష్కారమేదీ లభించలేదు. దీంతో ప్రజలు తమకు తోచినట్లుగా వివిధ రకాల మాస్క్‌లను ధరిస్తున్నారు. వైద్యులు మొదలుకొని నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ‘సర్జికల్ మాస్క్’లు ఉపయోగిస్తుండగా ఇప్పుడు రకరకాల మాస్క్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవి ఏ మేరకు ఒకరి నుంచి మరొకరికి తుంపర్లు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి? ఏ మాస్క్‌లు ఉపయోగిస్తే మంచిది? దీనికి తాజాగా సమాధానం లభించింది. శాస్త్రవేత్తల పరిశోధన... ఈ అంశంపై పరిశోధన చేసిన అమెరికా డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరోనా వ్యాప్తికారక తుంపర్లను నిరోధించడం లేదా తగ్గించడంలో వాల్వ్‌లు లేని ఎన్–95 మాస్క్‌లు అత్యుత్తమమైనవని తేల్చారు. దీని తర్వాతి స్థానంలో ‘త్రీ లేయర్ మాస్క్‌లు’(మూడు పొరలవి) నిలిచాయి. కాటన్–పాలిప్రోలిన్–కాటన్ మాస్క్ మూడోస్థానంలో నిలవగా టూ లేయర్ పాలిప్రోపిలిన్ ఏప్రాన్ మాస్క్ నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు వదులుగా బట్టతో చేసిన మాస్క్‌లు, ఫేస్ కవరింగ్స్ వంటివి పెట్టుకున్నప్పటికీ అవి మాస్క్‌లు ధరించకుండా ఉన్న దానితో సమానమని వెల్లడైంది. వాల్వ్‌లున్న ఎన్–95 మాస్క్‌లు కూడా సమర్థంగా తుంపర్ల వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్నాయని ఈ అధ్యయనంలో తెలిసింది. ఈ మాస్క్‌లు ఏడో ర్యాంక్‌లో నిలిచాయి. ప్రయోగం సాగిందిలా... డ్యూక్ వర్సిటీ పరిశోధకులు తక్కువ ఖర్చుతో రూపొందించిన ‘లేజర్ సెన్సర్ డివైజ్’తో 14 రకాల మాస్క్‌లు, ఫేస్ కవరింగ్స్‌ను పోల్చి చూశారు. ఈ మాస్క్‌లు ధరించిన వారు మాట్లాడినప్పుడు వారి నుంచి తుంపర్లు ఏ దిశలో ప్రయాణించాయి? వాటిని అడ్డుకోవడంలో మాస్క్‌లు ఏ మేరకు సమర్థంగా పనిచేశాయన్న దానిని లేజర్ బీమ్, లెన్స్, మొబైల్ ఫోన్ కెమెరాతో పరిశీలించారు. మాట్లాడేటప్పుడు, గాలిని బయటకు వదిలినప్పుడు ఎన్–95 మాస్క్‌కున్న వాల్వ్‌లు తెరుచుకోవడం వల్ల పరిసరాల్లోని వ్యక్తులకు తుంపర్ల నుంచి రక్షణ తగ్గుతోందని ఈ పరిశీలనలో వెల్లడైంది. అయితే ఈ పరిశోధనకున్న పరిమితులతోపాటు ఇతర రూపాల్లోని మాస్క్‌లు, వెర్షన్లను పరిశీలించకపోవడం వంటి అంశాల ప్రాతిపదికన దీనిపై మరింతగా పరిశోధించాల్సిన అవసరముందని డ్యూక్ వర్సిటీ పరిశోధకుడు ఎమ్మా ఫిషర్ పేర్కొన్నారు. -
మాస్కుల భద్రత ఎంత!
సాక్షి, అమరావతి: మాస్కులు ధరిస్తే కరోనా సోకకుండా ఉంటుందనేది ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతోనే చాలామంది చాలా రకాల మాస్కులు వాడుతున్నారు. కొందరైతే.. ఖరీదైన ఎన్–95 మాస్కుల్ని వాడుతున్నారు. ఇవి ఎదుటి వ్యక్తి నుంచి ధరించిన వారికి ఎంతమేరకు భద్రత ఇస్తున్నాయనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. నిపుణులు ఏమంటున్నారంటే.. ► ఐదారు మంది జనం ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాత్రమే మాస్కు వాడితే ఉపయోగం లేదు. ► అందరూ వాడితేనే నూరు శాతం ఫలితాలుంటాయి. లేదంటే 50 శాతం ఫలితాలు మాత్రమే. ► ఇరువురికి మాస్కు ఉంది కదా అని ముఖంలో ముఖం పెట్టి మాట్లాడటం మంచిది కాదు. ► అంత దగ్గర నుంచి మాట్లాడితే 5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న తుంపర్లు నేరుగా నోరు లేదా ముక్కు ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది. ► ఇలాంటి అత్యంత సూక్ష్మ పరిమాణంలో ఉన్న తుంపర్లను ఎన్–95 మాస్కులు నియంత్రించగలవని వైద్యుల అభిప్రాయం. ► మాస్కులు ఉన్నప్పటికీ ఎలాంటి ఉపరితలంపై అయినా చేయి తగలగానే శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ► పదే పదే మాస్కులు ఎక్కడంటే అక్కడ తగలడం వల్ల వాటి ఉపయోగం కన్నా ప్రమాదం ఎక్కువ. మాస్కు ఉంది కదాని.. మాస్కు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడకూడదు. అత్యంత జాగ్రత్తగా వాడాలి. మాస్కు ఉన్నా ఆరు అడుగుల దూరం తప్పనిసరి. మనవల్ల ఎదుటి వారికి ఎంత ప్రమాదమో.. వారినుంచి మనకూ అంతే ప్రమాదం అని గుర్తించాలి. ఏ వస్తువును తగిలినా అనంతరం శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. – డాక్టర్ నీలిమ, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్, కమాండ్ కంట్రోల్ సెంటర్ -
2 కోట్లకు పైగా ఎన్95 మాస్కులు ఉచితం
న్యూఢిల్లీ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు కలిపి 2 కోట్లకు పైగా ఎన్95 మాస్కులు, 1.18 కోట్ల పీపీఈ కిట్లు, 11,000 వెంటిలేటర్లను ఉచితంగా సరఫరా చేసినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనికి అదనంగా 11,300 'మేక్ ఇన్ ఇండియా' వెంటిలేటర్లను 6,154 ఆసుపత్రులకు సరఫరా చేసినట్లు తెలిపింది. కరోనా నియంత్రణకు అనుసరించాల్సిన చర్యలపై కేంద్రం అన్ని రాష్ర్ట ప్రభుత్వాలతో సమీక్షిస్తూ అవిశ్రామంగా కృషి చేస్తుందని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా వివిధ ఆసుపత్రుల్లో కోవిడ్ కట్టడి కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలను పెంచడంతో పాటు అనుబంధంగా వైద్ర సామాగ్రిని కేంద్రం ఉచితంగా అందిస్తోందని తెలిపింది. ఇప్పటికే 1.02 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు, 6.12కోట్లకు పైగా హెచ్‌సిక్యూ టాబ్లెట్లను సరఫరా చేసినట్లు వెల్లడించింది. (వ్యాక్సిన్‌పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన ) ‘దేశంలో కరోనా వెలుగు చూసిన కొత్తలో పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కుల కోసం విదేశీ మార్కెట్‌పై ఆధారపడాల్సి వచ్చింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో వీటికి కొరత కూడా ఉండేది. అయితే అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డిపిఐఐటి), రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ), సహా మరికొన్ని శాఖల సమన్వయంతో పిపీఈ కిట్లు, ఎన్95 కిట్లు, వెంటిలేటర్లు సహా అత్యవసర సామాగ్రిని దేశీయంగానే తయారుచేశాం. ఫలితంగా 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' లకు బలం చేకూర్చేలా మన దేశంలోనే వైద్య పరికరాలను తయారుచేశాం'’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. (మాస్క్ ఉన్నా 4 నిమిషాల్లోపైతేనే ‘లో రిస్క్’! ) -
ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం
జార్జియా: కరోనా వైరస్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తరుణంలో కొత్త రకాల మోసాలు బయటపడుతున్నాయి. ఓ వ్యక్తి ఫేస్ మాస్క్‌లు విక్రయిస్తానంటూ విదేశీ సంస్థతో $317 మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకొని మోసం చేసిన ఘటన జార్జియాలో జరిగింది. కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో మాస్క్‌లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్‌ని ఆసరాగా చేసుకొని కొందరు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. సవన్నాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయవాదులు దాఖలు చేసిన పత్రాల ప్రకారం.. జార్జియాకు చెందిన పౌల్ పెన్ మరో ఇద్దరు కలిసి 50 మిలియన్ ఎన్-95 మాస్క్‌లను ఓ విదేశీ ప్రభుత్వానికి విక్రయించడానికి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రభుత్వ ప్రమేయం లేకుండానే జరిగింది. అయితే పౌల్ పెన్ బృందం ప్రస్తుతం తమ వద్ద మాస్క్‌లు లేవని, ఒప్పందం ప్రకారం డబ్బులు వెంటనే చెల్లిస్తే మాస్క్‌లు త్వరలో ఇస్తామని సదరు విదేశీ సంస్థను ఒప్పించారు. మాస్క్‌ల ధర కూడా ప్రస్తుత మార్కెట్ ధర కన్నా ఐదు రెట్లు ఎక్కువ ఉన్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చదవండి: హాంకాంగ్‌పై మరింత పట్టు అయితే ఈ విషయాన్ని గుర్తించిన యూఎస్ సీక్రెట్ ఏజెన్సీ ఒప్పందానికి సంబంధించిన లావాదేవీలు పూర్తికావడానికి ముందే ఆపేసింది. సంఘటనపై జార్జీయాలోని యూఎస్ అటార్నీ బాబీ క్రిస్టిన్ మాట్లాడుతూ.. మాస్క్‌ల డిమాండ్ దృష్ట్యా కొందరు ఆగంతకులు వాటిని తమకు అవకాశాలుగా మలచుకొని ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. ఈ చర్య క్షమించరానిది' అంటూ క్రిస్టిన్ ఓ ప్రకటనలో తెలిపారు. పెన్‌తో పాటు ఈ ఘటనకు సంబంధమున్న మరో ఇద్దరిని గుర్తించే పనిలో ఉన్నారు. స్పెక్ట్రమ్ గ్లోబల్ హోల్డింగ్స్ ఎల్ఎల్సీ ద్వారా పెన్ ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరిపినట్లు న్యాయవాదులు తెలిపారు. 2018లో అట్లాంటా శివారు ప్రాంతాల్లో నోర్క్రాస్లో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. సవన్నాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయవాదులు దాఖలు చేసిన పత్రాల ప్రకారం.. పాల్పెన్పై నేర నిరూపణ అయితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. చదవండి: ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్ -
ఆరోగ్య సిబ్బందికి ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరులో భాగంగా వైద్య సిబ్బందికి కీలకమైన ఎన్–95 మాస్కులు, పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్ల ఉత్పత్తి పెరిగింది. గత మార్చికి, ఇప్పటికి దేశీయంగా తయారవుతున్న ఈ ఉత్పత్తులు మూడింతలు పెరిగాయి. ఈ విషయాన్ని కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘దేశం లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రోగులకు చికిత్స అందించడానికి ఎన్–95 మాస్కులు, పీపీఈ అవసరం పెరిగింది. దీనిపై పలు రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళన కూడా వ్యక్తంచేశారు. మార్చి 30వ తేదీన అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఒక రోజుకు 68,350 ఎన్–95 మాస్కులు, 3,312 పీపీఈ కిట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగేవాళ్లం. కానీ, ఏప్రిల్ 30నాటికి పరిస్థితి పూర్తిగా మారింది. ఇపుడు రోజుకు 2,30,500 ఎన్–95 మాస్కులు, 1,86,472 పీపీఈ కిట్లు ఉత్పత్తి చేస్తున్నాం’ అని వివరించారు. వీటిని కరోనా విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బందికి అందజేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఎన్ ‘95’ వంశ వృక్షం ఇదే...
కరోనా రక్కసి విలయ తాండవం చేస్తున్న ఈ టైమ్‌లో ఎన్95 మాస్క్ అన్నది దాన్నుంచి రక్షించే ఓ ఆయుధంలా మారింది. అన్ని మాస్కు లు వైరస్ నుంచి రక్షించవని చెబుతున్న నేపథ్యంలో దీని డిమాండ్ ఆకాశాన్నంటింది. అందుకే ఓసారి అసలు ఈ ఎన్95 మాస్కు వంశ వృక్షంతోపాటు దీని తాత ముత్తాతల గురించి ఓసారి తెలుసుకుందామా.. 1340ల్లో.. ఏంది.. పెంగ్విన్‌కు డాక్టర్ డ్రస్ వేశారు అని అనుకుంటున్నారా.. ఇక్కడ వైద్యుడే అలా తయారయ్యాడు.. ఎందుకంటే.. అప్పట్లో ప్లేగు వ్యాధి విజృంభణ మొదలైంది. రోగుల దగ్గర నుంచి దుర్వాసన కూడా వచ్చేది. పైగా దుర్వాసన వంటి వాటిలో వ్యాధులు దాగి ఉండేవని భావించేవారు. దీంతో ఇలాంటి వింత మాస్కులు తయారయ్యాయి. కంపు వాసన రాకుండా పక్షి ఆకారంలో ఉన్న పొడుగాటి ముక్కు భాగంలో సువాసనలు వెదజల్లేలా ఎండిన పువ్వులు, కొన్ని రకాల మూలికలు ఉండేవి. ఈ మాస్కులను చూసి.. మీరే కాదు.. అప్పట్లో రోగులు కూడా భయపడ్డారట. 1600ల్లో.. ముక్కులను కప్పుకోవడానికి జేబు రుమాళ్ల వాడకం మొదలైంది. 1800ల్లో.. మైక్రో బయాలజీ కొత్త పుంతలు తొక్కింది. శాస్త్రవేత్తలు బ్యాక్టీరియా గురించి విరి విగా పరిశోధనలు చేశారు. 1897.. ఇవి జేబు రుమాళ్లను కొంచెం మార్చి రూపొందించిన తొలితరం సర్జికల్ మాస్కులు.. వైద్యులు వీటిని వాడటం ప్రారంభించారు. 1905–10ల్లో.. వ్యాధుల నుంచి కాపాడటానికి మాస్కుల వినియోగం ముఖ్యమని గుర్తించారు. 1910.. ఉత్తర చైనాలోని మంచూరియాలో ప్లేగు వ్యాధి విజృంభించింది. లియన్ తెహ్వూ అనే చైనా వైద్యుడు దెబ్బ తగిలితే కట్టు కడతామే అలాంటి కాటన్ వస్త్రంతో పలు లేయర్లతో మాస్కును రూపొందించాడు. అప్పట్లో ఇదే ఎన్95 అన్నమాట. 1918.. స్పానిష్ ఫ్లూ విలయం ప్రారంభమైంది. మాస్కులు ధరించడం అన్నది ఆధునిక మెడికల్ సైన్స్‌కు సింబల్‌లా మారింది. 1930–40ల్లో.. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన ఈ సమయంలో విషపూరిత వాయువుల నుంచి రక్షించే గ్యాస్ మాస్కులు తయారయ్యాయి. ఫైబర్ గ్లాస్ ఫిల్టర్లతో కూడిన మాస్కుల వినియోగం మైనింగ్ పరిశ్రమలో మొదలైంది. 1961.. ఎన్ 95 మాస్కులకు ప్రసిద్ధి చెందిన 3ఎం కంపెనీ బబుల్ పేరిట సర్జి కల్ మాస్కును తయారుచేసింది. 1972.. తొలి ఎన్95 డస్ట్ రెస్పిరేటర్ను 3ఎం కంపెనీ రూపొందించింది.. ఇది సింగిల్ యూజ్. 1990ల్లో.. గాలి ద్వారా వ్యాపించే టీబీ నుంచి రక్షించుకోవడానికి ఆరోగ్య సిబ్బంది ఎన్ 95 మాస్కులు వాడటం మొదలుపెట్టారు.. ఈ మాస్కుల తయారీ ప్రమాణాలను కూడా పెంచారు. 2002–04.. చైనాలో సార్స్ ప్రబలింది. జనం కూడా ఎన్95 మాస్కులు వాడటం మొదలుపెట్టారు. 2005 నుంచి.. వాయు కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి దీన్ని వాడటం ప్రారంభించారు. 2020.. కోవిడ్ 19 విలయం నేపథ్యంలో ఇప్పుడిది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయి కూర్చుంది. -
బాబుకు ఆ వైరస్ సోకింది: మంత్రి
సాక్షి, హైదరాబాద్: ‘చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. కరోనాపై కాకుండా మా ప్రభుత్వంపై, మాపై పోరాటం చేస్తున్నారు అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రపంచానికి కోవిడ్ సోకితే బాబుకు నీచ రాజకీయ వైరస్ సోకింద’ని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి మాట్లాడుతూ.. కోవిడ్-19 నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటుంటే మాస్కులు, కిట్లు లేవని నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ డాక్టర్ వికటించడంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. లోకేష్, అయ్యన్నపాత్రుడు డైరెక్షన్లో డాక్టర్ సుధాకర్ కూడా N95 మాస్కులు లేవంటూ అసత్య ప్రచారానికి దిగాడని మండిపడ్డారు. (హలో.. జర సునో!) ఒక డాక్టర్ అయి ఉండి, ఇలాంటి దురాలోచన ఎందుకు వచ్చిందో తెలియట్లేదని ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ ఆపత్కాలంలో డాక్టర్ల సేవలను కొనియాడాల్సింది పోయి ఒక వైద్యుడిగా ఇలా నిందలు వేయడం సరి కాదని హితవు పలికారు. పీపీఈ కిట్లు, N95 మాస్కుల కొరత లేదని స్పష్టం చేశారు. N95 మాస్కులు 20 నుంచి 25 రోజులపాటు వాడవచ్చని ప్రోటోకాల్ చెప్తోందన్న విషయాన్ని ప్రస్తావించారు. కరోనా వ్యతిరేక పోరాటం కోసం రూ.3000 కోట్ల నిధులు విడుదల చేశామని, రూ.1000, బియ్యం, చక్కెర ఉచితంగా పేదలకు ఇస్తున్నామన్నారు. దేశంలోనే మెచ్చుకునే విధంగా గ్రామ వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. (అయ్యన్నకు కుట్ర రాజకీయాలు అలవాటే : సన్యాసిపాత్రుడు) -
షావోమి ‘ఎన్95’ మాస్కుల పంపిణీ
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’.. భారత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు, పోలీసులకు అత్యంత నాణ్యత కలిగిన ఎన్95 మాస్కులను పంపిణీ చేస్తోంది. వైరస్ కారణంగా వీటి ధర 18 రెట్లు వరకు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో ఈ మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తూ కంపెనీ తన దాతృత్వాన్ని చాటుకుందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు సోమవారం మీడి యాకు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వాలకు ఈ వారంలో మాస్కులు, రక్షణ జాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ ఉద్యోగులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. -
'కరోనా ఎఫెక్ట్' మాస్క్‌లకు డిమాండ్
సాక్షి, అమరావతి: ప్రమాదకర వైరస్లు సోకకుండా ధరించే మాస్క్‌లకు ఇప్పుడు మార్కెట్లో భారీ గిరాకీ ఏర్పడింది. కేవలం రూ.40 విలువైన మాస్క్‌ను ఏకంగా రూ.200 దాకా విక్రయిస్తుండడం గమనార్హం. గతంలో ఎప్పుడూ లేనంతగా ధరను 150 రెట్లు పెంచేశారు. చైనాలో కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో భారత్‌లో ఎన్95 మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. గతంలో మనదేశంలో హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్‌ఫ్లూ) వ్యాప్తి చెందినప్పుడు కూడా ఎన్95 మాస్క్‌లకు ఇంతగా డిమాండ్ లేదని, ఇప్పుడు వైరస్ దెబ్బకు ఈ మాస్క్‌లు దొరకడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఆన్లైన్లో కొనుగోళ్లు గతంలో సాధారణ మందుల దుకాణాల్లోనూ లభించిన ఎన్95 మాస్క్‌లు ప్రస్తుతం కనిపించడం లేదు. నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఈ మాస్క్‌లను చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్లు. ఇవి ఇప్పుడు చైనా అవసరాలకే చాలడం లేదు. మాస్క్‌ల ఎగుమతిపై రెండు నెలలుగా చైనా నిషేధం విధించింది. దీంతో ఇండియాలో ఎన్95 మాస్క్‌ల లభ్యత పడిపోయింది. ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఎన్95 మాస్కులు దొరక్క సాధారణ మాస్క్‌లే ఉపయోగిస్తున్నారు. ఎన్95 మాస్కుల కోసం కొందరు అమెజాన్, ఫ్లిప్‌కార్టు వంటి ఈ–కామర్స్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్లో కొనుగోలు చేసినా అవి అందడానికి కనీసం 4 రోజుల సమయం పడుతోందని చెబుతున్నారు. మనకు అత్యవసరమేం కాదు ‘‘ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. ఎన్95 మాస్కులు వాడడం మనకు అత్యవసరం కాదు. ఈ మాస్క్‌లు శరీరంలోకి వైరస్ వెళ్లకుండా నిరోధించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ప్రస్తుతానికి వీటి అవసరం మనకు ఇంకా రాలేదు. మేము ఇప్పటికీ సాధారణ మాస్క్‌లే ధరించి సర్జరీకి వెళుతున్నాం’’ – డా.కె.బాబ్జీ, ప్రిన్సిపల్, రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాల, కాకినాడ ఎన్95 మాస్క్ ప్రత్యేకతలు - వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో బాగా ఉపకరిస్తాయి. - ఈ మాస్క్‌ను ఐదు పొరలతో తయారు చేస్తారు. - అత్యంత సూక్ష్మమైన ధూళి కణాలు సైతం ముక్కులో నుంచి వెళ్లకుండా నిరోధిస్తుంది. - గాలి పీల్చినప్పుడు వైరస్ లోనికి వెళ్లకుండా కాపాడగలిగే శక్తి ఈ మాస్క్‌కు ఉంటుంది - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్(ఎన్ఐఓఎస్హెచ్) గుర్తింపు పొందింది. - సాధారణ మాస్క్‌ల కంటే వంద రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేస్తాయి. -
ఢిల్లీ కాలుష్యానికి చెక్ చెప్పే మాస్క్ లు
న్యూఢిల్లీ : రోజురోజుకి పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో గాలిపీల్చుకోవడమే కష్టంగా మారుతోంది. ఎన్నో అనారోగ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే కాలుష్యం గురించి చెప్పనక్కరలేదు. సరి-బేసి విధానం తీసుకొచ్చిన వాతావరణంలో కాలుష్యం తగ్గలేదని నిపుణులంటున్నారు. సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనోక్సైడ్ వంటి కెమికల్స్ తో కాలుష్యమైన గాలి నుంచి బయటపడాలంటే ఎయిర్ మాస్క్ లను వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. బయటికి వెళ్తున్న ప్రతిసారి మాస్క్ లను ధరించాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే ఇప్పటికే అందుబాటులో సర్జికల్, ఇండస్ట్రియల్ ఎయిర్, ఎన్95 మాస్క్ ల్లో మూడోది వాతావరణ కాలుష్య ముప్పునుంచి ఎక్కువగా కాపాడుతుందని చెప్పారు. సర్జికల్, ఇండస్ట్రియల్ ఎయిర్ మాస్క్ ల్లో ఉన్న లోటు పాట్లు ఈ ఎన్95 మాస్క్ లో లేవని తెలిపారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న మాస్క్ లో ఎన్95 మాస్క్ లకు ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందని, ఈ మాస్క్ లు ధరించడం వల్ల హానికరమైన గ్యాస్ ల బారినుంచి బయటపడొచ్చని తెలిపారు. ఈ మాస్క్ లు ధరించడం వల్ల గాలి పీల్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. కాలుష్య వాతావరణంలో బయటికి వెళ్లే వారికి ఈ మాస్క్ లు బెస్ట్ ఆప్షన్ గా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.