సాక్షి, అమరావతి: ప్రమాదకర వైరస్‌లు సోకకుండా ధరించే మాస్క్‌లకు ఇప్పుడు మార్కెట్‌లో భారీ గిరాకీ ఏర్పడింది. కేవలం రూ.40 విలువైన మాస్క్‌ను ఏకంగా రూ.200 దాకా విక్రయిస్తుండడం గమనార్హం. గతంలో ఎప్పుడూ లేనంతగా ధరను 150 రెట్లు పెంచేశారు. చైనాలో కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో భారత్‌లో ఎన్95 మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. గతంలో మనదేశంలో హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్‌ఫ్లూ) వ్యాప్తి చెందినప్పుడు కూడా ఎన్95 మాస్క్‌లకు ఇంతగా డిమాండ్ లేదని, ఇప్పుడు వైరస్ దెబ్బకు ఈ మాస్క్‌లు దొరకడం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు
గతంలో సాధారణ మందుల దుకాణాల్లోనూ లభించిన ఎన్95 మాస్క్‌లు ప్రస్తుతం కనిపించడం లేదు. నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఈ మాస్క్‌లను చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్లు. ఇవి ఇప్పుడు చైనా అవసరాలకే చాలడం లేదు. మాస్క్‌ల ఎగుమతిపై రెండు నెలలుగా చైనా నిషేధం విధించింది. దీంతో ఇండియాలో ఎన్95 మాస్క్‌ల లభ్యత పడిపోయింది. ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఎన్95 మాస్కులు దొరక్క సాధారణ మాస్క్‌లే ఉపయోగిస్తున్నారు. ఎన్95 మాస్కుల కోసం కొందరు అమెజాన్, ఫ్లిప్‌కార్టు వంటి ఈ–కామర్స్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినా అవి అందడానికి కనీసం 4 రోజుల సమయం పడుతోందని చెబుతున్నారు.
మనకు అత్యవసరమేం కాదు
‘‘ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. ఎన్95 మాస్కులు వాడడం మనకు అత్యవసరం కాదు. ఈ మాస్క్‌లు శరీరంలోకి వైరస్ వెళ్లకుండా నిరోధించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ప్రస్తుతానికి వీటి అవసరం మనకు ఇంకా రాలేదు. మేము ఇప్పటికీ సాధారణ మాస్క్‌లే ధరించి సర్జరీకి వెళుతున్నాం’’
– డా.కె.బాబ్జీ, ప్రిన్సిపల్, రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాల, కాకినాడ
ఎన్95 మాస్క్ ప్రత్యేకతలు
- వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో బాగా ఉపకరిస్తాయి.
- ఈ మాస్క్‌ను ఐదు పొరలతో తయారు చేస్తారు.
- అత్యంత సూక్ష్మమైన ధూళి కణాలు సైతం ముక్కులో నుంచి వెళ్లకుండా నిరోధిస్తుంది.
- గాలి పీల్చినప్పుడు వైరస్ లోనికి వెళ్లకుండా కాపాడగలిగే శక్తి ఈ మాస్క్‌కు ఉంటుంది
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్(ఎన్‌ఐఓఎస్‌హెచ్) గుర్తింపు పొందింది.
- సాధారణ మాస్క్‌ల కంటే వంద రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment