కరోనా రక్కసి విలయ తాండవం చేస్తున్న ఈ టైమ్‌లో ఎన్95 మాస్క్ అన్నది దాన్నుంచి రక్షించే ఓ ఆయుధంలా మారింది. అన్ని మాస్కు లు వైరస్ నుంచి రక్షించవని చెబుతున్న నేపథ్యంలో దీని డిమాండ్ ఆకాశాన్నంటింది. అందుకే ఓసారి అసలు ఈ ఎన్95 మాస్కు వంశ వృక్షంతోపాటు దీని తాత ముత్తాతల గురించి ఓసారి తెలుసుకుందామా..
1340ల్లో..
ఏంది.. పెంగ్విన్‌కు డాక్టర్ డ్రస్ వేశారు అని అనుకుంటున్నారా.. ఇక్కడ వైద్యుడే అలా తయారయ్యాడు.. ఎందుకంటే.. అప్పట్లో ప్లేగు వ్యాధి విజృంభణ మొదలైంది. రోగుల దగ్గర నుంచి దుర్వాసన కూడా వచ్చేది. పైగా దుర్వాసన వంటి వాటిలో వ్యాధులు దాగి ఉండేవని భావించేవారు. దీంతో ఇలాంటి వింత మాస్కులు తయారయ్యాయి. కంపు వాసన రాకుండా పక్షి ఆకారంలో ఉన్న పొడుగాటి ముక్కు భాగంలో సువాసనలు వెదజల్లేలా ఎండిన పువ్వులు, కొన్ని రకాల మూలికలు ఉండేవి. ఈ మాస్కులను చూసి.. మీరే కాదు.. అప్పట్లో రోగులు కూడా భయపడ్డారట.
1600ల్లో..
ముక్కులను కప్పుకోవడానికి జేబు రుమాళ్ల వాడకం మొదలైంది.
1800ల్లో..
మైక్రో బయాలజీ కొత్త పుంతలు తొక్కింది. శాస్త్రవేత్తలు బ్యాక్టీరియా గురించి విరి విగా పరిశోధనలు చేశారు.
1897..
ఇవి జేబు రుమాళ్లను కొంచెం మార్చి రూపొందించిన తొలితరం సర్జికల్ మాస్కులు.. వైద్యులు వీటిని వాడటం ప్రారంభించారు.
1905–10ల్లో..
వ్యాధుల నుంచి కాపాడటానికి మాస్కుల వినియోగం ముఖ్యమని గుర్తించారు.
1910..
ఉత్తర చైనాలోని మంచూరియాలో ప్లేగు వ్యాధి విజృంభించింది. లియన్ తెహ్‌వూ అనే చైనా వైద్యుడు దెబ్బ తగిలితే కట్టు కడతామే అలాంటి కాటన్ వస్త్రంతో పలు లేయర్లతో మాస్కును రూపొందించాడు. అప్పట్లో ఇదే ఎన్95 అన్నమాట.
1918..
స్పానిష్ ఫ్లూ విలయం ప్రారంభమైంది. మాస్కులు ధరించడం అన్నది ఆధునిక మెడికల్ సైన్స్‌కు సింబల్‌లా మారింది.
1930–40ల్లో..
రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన ఈ సమయంలో విషపూరిత వాయువుల నుంచి రక్షించే గ్యాస్ మాస్కులు తయారయ్యాయి. ఫైబర్ గ్లాస్ ఫిల్టర్లతో కూడిన మాస్కుల వినియోగం మైనింగ్ పరిశ్రమలో మొదలైంది.
1961..
ఎన్ 95 మాస్కులకు ప్రసిద్ధి చెందిన 3ఎం కంపెనీ బబుల్ పేరిట సర్జి కల్ మాస్కును తయారుచేసింది.
1972..
తొలి ఎన్95 డస్ట్ రెస్పిరేటర్‌ను 3ఎం కంపెనీ రూపొందించింది.. ఇది సింగిల్ యూజ్.
1990ల్లో..
గాలి ద్వారా వ్యాపించే టీబీ నుంచి రక్షించుకోవడానికి ఆరోగ్య సిబ్బంది ఎన్ 95 మాస్కులు వాడటం మొదలుపెట్టారు.. ఈ మాస్కుల తయారీ ప్రమాణాలను కూడా పెంచారు.
2002–04..
చైనాలో సార్స్ ప్రబలింది. జనం కూడా ఎన్95 మాస్కులు వాడటం మొదలుపెట్టారు.
2005 నుంచి..
వాయు కాలుష్యం నుంచి రక్షించుకోవడానికి దీన్ని వాడటం ప్రారంభించారు.
2020..
కోవిడ్ 19 విలయం నేపథ్యంలో ఇప్పుడిది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయి కూర్చుంది.
Comments
Please login to add a commentAdd a comment