వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనాకు మంచి మందు మాస్క్ వినియోగమే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు వచ్చినప్పుడు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్ ఏదైనా ధరించవచ్చు. డిస్పోజబుల్ మాస్కులు మంచివే అయినప్పటికీ వాటిని కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని.
అందువల్ల పొరలతో కూడిన క్లాత్ మాస్కులను క్రమం తప్పకుండా ఉతుకుతూ పలుమార్లు వినియోగించుకోవచ్చు. అయితే ఇంట్లో తయారు చేసుకున్న మాస్క్/ క్లాత్/ సర్జికల్ మాస్క్ ధరించడంతో కరోనా వైరస్ నుంచి 51.4 శాతం నుంచి గరిష్టంగా 56.1శాతం మాత్రమే రక్షణ లభిస్తోందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది.
సర్జికల్ మాస్క్ లేదా క్లాత్ మాస్క్ రెండేసి ధరిస్తే వైరస్ నుంచి 95 శాతం తప్పించుకున్నట్లేనని పేర్కొంది. అయితే ఎన్–95 మాస్కును సింగిల్‌గానే వాడాలి. ఏదైనా క్రమ పద్ధతిలో ధరించాలి. నోరు, ముక్కు పూర్తిగా కవర్ చేస్తూ పెట్టుకోవాలి. డబుల్ మాస్కులు ఒకదానిపై ఒకటి పెట్టి ధరించాలి. శ్వాస కోసం ముక్కు దగ్గర, చెవుల వైపు వదులుగా ఉంటే, గాలి లీకేజీతో వైరస్ వ్యాప్తికి మార్గం ఏర్పడుతుంది.
-పి.విజయ నరసింహారెడ్డి,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
రిమ్స్, కడప
Comments
Please login to add a commentAdd a comment