వాషింగ్టన్: కోవిడ్–19 వ్యాప్తిని చాలావరకు తగ్గించడమే కాదు, తనతో కాంటాక్టు అయిన సార్స్–కోవ్–2 వైరస్‌ను చంపేసే సరికొత్త ఎన్95 మాస్క్‌ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ మాస్క్‌ను ఎక్కువ కాలం ధరించవచ్చని, తరచుగా మార్చాల్సిన అవసరం లేదని, దీనితో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా తక్కువేనని పరిశోధకులు తెలియజేశారు. తనంతట తాను స్టెరిలైజ్ చేసుకొనే వ్యక్తిగత రక్షణ పరికరం తయారీలో ఇదొక మొదటి అడుగు అని భావిస్తున్నామని అమెరికాకు చెందిన రెన్‌సెలార్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి ఎడ్మండ్ పాలెర్మో చెప్పారు.
ఈ ఎన్95 మాస్క్‌ను ధరిస్తే గాలిద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని అన్నారు. తాజా పరిశోధన వివరాలను ఇటీవలే ‘అప్లయిడ్ ఏసీఎస్ మెటీరియల్స్, ఇంటర్‌ఫేసేస్’ పత్రికలో ప్రచురించారు. కరోనా వైరస్‌ను అంతం చేసే ఎన్95 మాస్క్ తయారీ కోసం యాంటీమైక్రోబియల్ పాలిమర్స్, పాలిప్రొపైలీన్ పిల్టర్లు ఉపయోగించారు. ఒకదానిపై ఒకటి పొరలుగా అమర్చారు. ఈ పరిశోధనలో ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) పరిశోధకులు కూడా భాగస్వాములయ్యారు. మాస్క్ పైభాగంలో వైరస్‌లను, బ్యాక్టీరియాను చంపేపే నాన్–లీచింగ్ పాలిమర్ కోటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం అతినీలలోహిత కాంతి, అసిటోన్ కూడా ఉపయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment