రథాలతో నిండిపోతున్న రోడ్లు | BJP to come with mini charriots in up elections | Sakshi
Sakshi News home page

రథాలతో నిండిపోతున్న రోడ్లు

Published Mon, Nov 7 2016 11:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

రథాలతో నిండిపోతున్న రోడ్లు - Sakshi

రథాలతో నిండిపోతున్న రోడ్లు

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. రోడ్లన్నీ రథాలతో నిండిపోతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన భారీ హైటెక్ బస్సుతో ప్రచారం ప్రారంభిస్తే, బీజేపీ కూడా ఇప్పటికే పరివర్తన్ యాత్ర పేరుతో ప్రచారపర్వంలో ఉంది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా కూడా చిన్న చిన్న రథాలతో ప్రచారాన్ని వేడెక్కించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం 400 మినీ రథాలను సిద్ధం చేసింది. ఇంతకుముందు ఎన్నికల రథాలంటే బస్సులనే ఉపయోగించేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లోను, కాలనీల్లో కూడా ప్రచారం చేయడానికి వీలుగా చిన్న కార్లనే కొద్దిగా మార్పుచేర్పులు చేసి, వాటిలో డిజిటల్ ప్రచార పరికరాలను ఏర్పాటుచేసి ప్రచార రంగంలోకి దించారు. బీఎస్పీ, సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల ప్రత్యర్థులను తలదన్నేలా ఓటర్లను ఆకట్టుకోడానికి భారీ సంఖ్యలో ఉన్న ఈ మినీ రథాలు ఉపయోగపడతాయని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అయితే.. పెద్ద రథాల్లో ఉన్నట్లుగా వీటిలో నాయకులు ఉండరు. కేవలం డిజిటల్ ప్రచార పరికరాలు మాత్రమే ఉంటాయి. 
 
ఇవి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, గ్రామాలలోని కాలనీల్లో తిరుగుతూ పార్టీ విధానాలను ప్రచారం చేస్తుంటాయి. తొలి దశ ప్రచారంలో ఒక్కోటి 7-8 నిమిషాల చొప్పున ఉండే రెండు పాటలను ప్లే చేస్తారు. వీటిలో ప్రధానంగా మహిళల మీద పెరుగుతున్న నేరాలు, నిరుద్యోగం కారణంగా యువత వలసలు, అధికార పార్టీవాళ్ల భూ ఆక్రమణలు.. తదితర అంశాలుంటాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఆయన ఇక్కడి ఎన్నికలో కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల మధ్య సమన్వయం చేస్తున్నారు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్‌తో ఈ పాటలు పాడించారు. 'న గూండారాజ్‌.. న భ్రష్టాచార్.. అబ్‌కీ బార్ బీజేపీ సర్కార్' అనే నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు 'పూర్ణ బహుమత్, సంపూర్ణ వికాస్, భాజపా పర్ హై విశ్వాస్' అనే మరో నినాదం కూడా ప్రచారంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement