ఎయిర్‌పోర్ట్‌లో బాంబు కలకలం
న్యూఢిల్లీ: బాంబు ఉందన్న అనుమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బంది.. అవి ఆటోమొబైల్ విడిభాగాలని తేల్చటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపిన వివరాలివీ.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో ఏరియాలో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఓ పార్సిల్ పడి ఉండటం గమనించిన సిబ్బంది భద్రతా విభాగానికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భద‍్రతా సిబ్బందిని అలెర్ట్ చేశారు.
బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తోపాటు ఎక్స్‌రే ఇమేజ్ యంత్రాన్ని తెప్పించారు. క్షుణ్నంగా పరిశీలించగా అందులో మారుతి కార్ల విడి భాగాలు ఉన్నట్లు తేలింది. ఈ ఘటనతో ఉదయం 9గంటల వరకు ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం ఆ పార్సిల్‌ను అందులో ఉన్న చిరునామా ప్రకారం విస్తారా ఫ్లయిట్‌లో గోవాకు పంపించారు. ఈ విమానాశ‍్రయంలో భద్రతా బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలు పర్యవేక్షిస్తుండగా అత్యవసర సమయాల్లో సీఐఎస్‌ఎఫ్ రంగంలోకి దిగుతుంది.