
జైపూర్ : భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఓ జంట పెళ్లి ఆగిపోయింది. రాజస్తాన్‌లోని బర్మార్ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్‌కు, పాకిస్తాన్, సింధ్ ప్రావిన్స్‌లోని అమర్ కోట్ జిల్లాకు చెందిన చగన్ కర్వార్‌కు ఈ నెల 8న పెళ్లి జరగాల్సింది. కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఆత్మహుతి దాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందడంతో ఇరుదేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాతనే వివాహం జరిపిస్తామని తెలిపారు.
‘గత నెలనే మా పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వివాహ ఆహ్వాన పత్రికలు కూడా పంచాం. పాకిస్తాన్ నుంచి వీసాలు కూడా తీసుకున్నాం. అక్కడికి వెళ్లడానికి థార్ ఎక్స్‌ప్రెస్ టికెట్లు కూడా బుక్ చేశాం. కానీ ఇప్పుడు మా పెళ్లిని వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాతే పెళ్లి చేసుకుంటాం’ అని వరుడు మహేంద్ర మీడియాకు తెలిపారు. ఇక సరిహద్దుల్లో సీమాంతర వివాహలు సర్వసాధారణం. రాజ్‌పుత్, మెగవాల్, బీల్, సింధి, కాత్రి కమ్యూనిటీలు ఈ తరహా పెళ్లిలు చేసుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment