
రోహ్‌తక్ అక్కాచెల్లెళ్లకు కోర్టులో చుక్కెదురు
చండీగఢ్:
హర్యానాలో ఓ ఆర్టీసీ బస్సులో తమను వేధించారంటూ ముగ్గురు యువకుల భరతంపట్టి, వీరనారులుగా అందరి ప్రశంసలు అందుకున్న రోహ్‌తక్ అక్కాచెల్లెళ్లకు కోర్టులో చుక్కెదురయ్యింది. బస్సులో ఇద్దరు యువతులు ముగ్గురు యువకులు మోహిత్, దీపక్, కుల్‌దీప్‌లపై దాడి చేసిన ఓ వీడియో రెండేళ్ల కిందట వార్తా ప్రసారమాధ్యమాల్లో తెగ చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
అయితే యువకులపై యువతులు పెట్టిన వేధింపుల కేసుకు సంబంధించి సాక్ష్యాలను సమర్పించలేకపోవడంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. మోహిత్, దీపక్, కుల్‌దీప్‌పై పెట్టిన కేసును కొట్టివేస్తూ అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ హరిశ్ గోయల్ తీర్పు వెలువరించారు. నింధితులు వేధింపులకు పాల్పడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. రోహ్‌తక్ అక్కాచెల్లెళ్లపై పరువు నష్టం దావా వేస్తామని యువకుల తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు కిందికోర్టు తీర్పును హైకోర్టులో సవాలుచేయనున్నట్టు యువతుల తరఫు న్యాయవాది చెప్పారు.
తాము యువతులను వేధించలేదని, కేవలం సీటు విషయంలో జరిగిన వాగ్వాదాన్ని రాద్దాంతం చేశారని యువకులు అన్నారు. ఓ వృద్ధమహిళ కోసం తాము ఇచ్చిన సీటు కోసం యువతులు ఘర్షణకుదిగారని తెలిపారు. ఈ కేసులో 40 మంది ప్రత్యేక్ష సాక్షులను పోలీసులు విచారించారు. యువతులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు తప్పని సాక్షులు పోలీసులకు తెలిపారు. పాలిగ్రాఫ్ టెస్టులో కూడా యువకులకు క్లీన్ చీట్ వచ్చింది.
ఆసన్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను అక్కడి గ్రామస్తులంతా వెనకేసుకొచ్చారు. యువకులను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. సంఘటన జరిగిన సమయంలోనే ఈ ఉదంతంపై సమావేశమైన వారు ఆ యువకులకు మద్దతు పలకాలని నిర్ణయించారు. బస్సులో సీటు విషయమై అక్కచెల్లెళ్లు, ముగ్గురు యువకుల మధ్య గొడవ తలెత్తిందంటూ వారు మీడియాకు తెలిపారు. ఆ యువతులు ఇది వరకు కూడా ఇలాగే తప్పుడు కేసులతో యువకులను బెదిరించి, డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. కావాలంటే పోలీసు స్టేషన్‌కు వెళ్లి వారుపెట్టిన కేసులను చూసుకోవొచ్చు అని తెలిపారు.
కుల్‌దీప్,తాను ఆర్మీలో పనిచేయాలనుకున్నామని దీపక్ తెలిపారు. మెడికల్, ఫిజికల్ టెస్టులు కూడా పూర్తి చేశామని చెప్పారు. కానీ ఈ కేసు కారణంగా పరీక్షలకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం ఇప్పుడు దరఖాస్తు చేసుకుందామనుకుంటే వయస్సు పెరిగిపోయిందని పేర్కొన్నారు.