భారత్-నేపాల్ మధ్య బస్సు
కఠ్మాండులో మోదీ, కోయిరాలా, ఢిల్లీలో గడ్కారీ చేతుల మీదుగా ప్రారంభం
కఠ్మాండు/న్యూఢిల్లీ: భారత్-నేపాల్ మధ్య తొలిసారిగా బస్ సర్వీసులు మంగళవారం ప్రారంభమయ్యాయి. నేపాల్ రాజధాని కఠ్మాండులో బుధ, గురువారాల్లో జరగనున్న దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) శిఖరాగ్ర సదస్సును పురస్కరించుకుని ఉభయదేశాల మధ్య ప్రయాణ సదుపాయంగా ఈ బస్సులు మొదలయ్యాయి. కఠ్మాండులో కన్నుల పండుగా అలంకరించిన బస్ సర్వీసును భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా ప్రారంభించారు. ‘పశుపతినాథ్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో ఈ బస్సును నడుపుతారు. బస్ సర్వీసును ప్రారంభించే ముందు మోదీ, కోయిరాలా స్వయంగా బస్సులోకి వెళ్లి ప్రయాణికులను సాదరంగా పలకరించారు.
న్యూఢిల్లీ-కఠ్మాండు బస్ సర్వీసును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఢిల్లీలో ప్రారంభించారు. బస్సు సర్వీసులతో ఉభయదేశాల మధ్య వాణిజ్య, పర్యాటకరంగాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. సార్క్ లోని మిగతా సభ్యదేశాలకు కూడా ఇలాంటి బస్ సర్వీసును ప్రారంభిస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది. న్యూఢిల్లీ, కఠ్మాండూ మధ్య మొదలైన ఈ లగ్జరీ బస్ డైలీ సర్వీసును ఢిల్లీ రవాణా సంస్థ నిర్వహిస్తుందని, న్యూఢిల్లీనుంచి 30గంటల వ్యవధిలో కఠ్మాండు చేరుతుందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. ఈ అంతర్జాతీయ బస్ సర్వీసులో ఒక్కొక్కరికి రూ. 2,300 చార్జీ వసూలు చేస్తారు.