వారణాసిలో నరమాంస భక్షకులు!
న..ర..మాం..స.. భ..క్ష..కు..లు..
ఈ నవ నాగరిక సమాజంలో కూడా ఇప్పటికీ ఈ మాట వినిపిస్తుందని మీకు తెలుసా? ఉన్నా.. ఏ అమెజాన్ అడవుల్లోనో, అండమాన్ దీవుల్లోనో ఉండొచ్చని అనుకుంటాం. కానీ, మన దేశంలోనే.. అదీ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వారణాసిలో.. మనమధ్యనే వారు తిరుగుతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. జడలు, జడలుగా జుట్టూ, గెడ్డం పెంచి, దేహమంతా విభూతి పూసుకొని సంచార జీవితం గడిపే ‘అఘోరి’ తెగకు చెందిన సాధువులు నరమాంస భక్షకులు. అయితే అప్పులవాళ్లలాగా వారు బతికున్న మనుషులను పీక్కుతినరు. చనిపోయిన వారి మాంసాన్ని మాత్రమే ఆరగిస్తారు. మానవ కపాలాల్లో ద్రవ పదార్థాలు పోసుకొని తాగుతారు. వారు పగలంతా వారణాసి పట్టణంలో తిరుగుతూ, ధ్యానం చేసుకుంటూ మనకు కనిపిస్తారు. రాత్రిళ్లు మాత్రం శ్మశానాల్లో భోంచేసి అక్కడే పడుకుంటారు. సగం కాలీకాలని మృతదేహాలను, ఖననం చేయకుండా నదిలో పడేసిన మృతదేహాల నుంచి మాంసాన్ని స్వీకరిస్తారు.
మానవ దేహాన్ని తుచ్ఛమైనదీ, నీచమైనదని భావించే వీరు స్వర్గలోక ప్రాప్తి కోసం కాళికాదేవిని, శివనామాన్ని స్మరిస్తారు. ఆ దేవతలు రాత్రిపూట శ్మశానాల్లో సంచరిస్తారనే నమ్మకంతోనే వారు శ్మశానాల్లో నిద్రిస్తారు. శరీరాన్ని తుచ్ఛమైనదిగా భావించే వీరు అప్పుడప్పుడు నడి వీధుల్లోనూ నగ్నంగా తిరుగుతుంటారు. ఇటలీకి చెందిన ఫొటోగ్రాఫర్ క్రిస్టియానో ఓస్టినెల్లీ వారి జీవన విధానాన్ని అధ్యయనం చేయడానికి కొంతకాలం వారితోనే గడిపారు. వారి ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. వీరి మూలాలు 17వ శతాబ్దంలోనే ఉన్నాయి. వీరు బాబా కినారమ్‌ను తమ గురువుగా భావిస్తారు. ఆయన 170 సంవత్సరాలు బతికినట్టు చెబుతారు.