- జనవరి నుంచి వర్తింపు: కేంద్ర కేబినెట్ నిర్ణయం
ముంబై: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించే కరువు భత్యాన్ని(డీఏ) ఆరు శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో మూల వేతనంపై 113 శాతానికి డీఏ పెరిగినట్లయింది. పెంపు ఈ ఏడాది జనవరి (2015 జనవరి 1) నుంచి వర్తిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా 48 లక్షల మంది ఉద్యోగులు, 55 లక్షల మంది పెన్షనర్లు.. మొత్తం కోటి మందికి పైగా ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై వార్షిక భారం రూ. 6,762.24 కోట్లుగా ఉంటే.. ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపచేయటం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ భారం రూ. 7,889.34 కోట్లుగా ఉంటుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఆరో వేతన సంఘం సిఫారసులు ప్రాతిపదికగా అంగీకరించిన ఫార్ములాకు అనుగుణంగా డీఏ పెంపు నిర్ణయం తీసుకున్నారు. డీఏను గత ఏడాది సెప్టెంబర్‌లో సవరించారు. అప్పుడు మూలవేతనంలో 100 శాతంగా ఉన్న డీఏను 107 శాతానికిపెంచి ఆ ఏడాది జూలై నుంచి వర్తింపచేశారు.