
పెళ్లికి ఆహ్వానించి తరిమికొట్టారు
పెళ్లి దుస్తులతో కలెక్టర్‌కు వినతి
న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకున్న యువతి
తిరువళ్లూరు:
ప్రేమించి, రిజిస్టర్ వివాహం చేసుకున్న యువకుడితో సంప్రదాయబద్దంగా చెంగాళమ్మ ఆలయంలో పెళ్లి చేస్తామని యువతి, బంధువులను పిలిపించి చితకబాదారనీ ఆరోపిస్తూ ఓ యువతి కలెక్టర్ వీరరాఘవరావును కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ సంఘటన తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలో కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా కొత్తగుమ్మిడిపూండిలోనీ కాళహస్తిగుడి వీధికి చెందిన సంపత్‌కుమార్ ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె సంగీత (20). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం రాశీకండ్రిగకు చెందిన చంద్రశేఖర్ కుమారుడు వివేక్(22). ఇతను ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని ఇంజినీరంగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆ సమయంలో సంగీతతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఇద్దరు ఐదు సంవత్సరాల నుంచి ప్రేమాయాణం కొనసాగించారు. ఈ నేపథ్యంలో సంగీత, వివేక్ గత ఆగస్టు 30న ఇంటి నుంచి వెళ్లిపోయి కొడెకైనాల్‌లో తలదాచుకున్నారు. వీరిని సెప్టెంబర్ 17న గుర్తించి తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. ఆగస్టు 18న గుమ్మడిపూండిలోనీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. అనంతరం అక్టోబర్ 26న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించాలనీ నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం సంగీత, ఆమె తరఫు బంధువులు వివాహం కోసం ఆలయం వద్దకు వెళ్లారు.
అక్కడ పెళ్లి ఏర్పాట్లు కనిపించకపోవడంతో అనుమానం కలిగిన సంగీత బంధువులు వివేక్‌ను, అతని బంధువులను నిలదీశారు. రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం పెరిగి, తమపై విచక్షాణారహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ సంగీత తన బంధువులు, మహిళా సంఘాల ప్రతినిధులతో వచ్చి కలెక్టర్ వీరరాఘవరావుకు వినతి పత్రం సమర్పించారు. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరకంగా వాడుకున్నారని, తీరా వివాహం చేసుకోవాలని నిలదీస్తే దాడులు చేస్తున్నారని కలెక్టర్ ఎదుట బోరున విలపించింది. మోసం చేసిన వివేక్‌తో తన పెళ్లి జరిపించడంతోపాటు తన బంధువులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుని భద్రత కల్పించాలని కలెక్టర్‌కు విన్నవించుకుంది. గ్రీవెన్స్‌హల్‌లో బోరున రోదించడంతో చలించిపోయిన కలెక్టర్ యువతికి తక్షణం సాయం చేయాలని గుమ్మిడిపూండి డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖా అధికారులను ఆదేశించారు.