అహ్మదాబాద్ : బీజేపీకి కంచుకోటగా 1991 నుంచి ఆ పార్టీకే పట్టంకడుతున్న బారుచ్ స్ధానం నుంచి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌ను లోక్‌సభ ఎన్నికల బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. పటేల్ ఇదే స్ధానం నుంచి 1977, 1980, 1984లో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. మరోవైపు భారతీయ ట్రైబల్ పార్టీతో (బీటీపీ) పొత్తు నేపథ్యంలో సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్, బీటీపీలు చర్చల్లో మునిగితేలుతుండగా బరూచ్ స్ధానంపై చిక్కుముడి వీడలేదు.
బీటీపీ నేత చోటుభాయ్ వసవా హస్తం గుర్తుతో పోటీచేయాలని కాంగ్రెస్ కోరుతుండగా అందుకు ఆయన నిరాకరించారు. దీంతో వసావకు సన్నిహితుడైన అహ్మద్ పటేల్ పేరును కాంగ్రెస్ తెరపైకి తీసుకువచ్చింది. పటేల్ అభ్యర్థిత్వానికి బీటీపీ సహకరిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. గిరిజన ప్రాబల్య ప్రాంతమైన బరూచ్‌లో ప్రతిసారీ గిరిజన నేతకే అక్కడి ఓటర్లు పట్టం కడుతుండటంతో బీటీపీతో పొత్తు తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా, తమ ప్రాబల్యం నిలుపుకునేందుకు బీజేపీ చెమటోడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment