బ్యాంకులు, ఓఎంసీలదే భారం | Consumers, petrol pumps will not pay any extra charge for digital transactions, says Oil Minister Dharmendra Pradhan | Sakshi
Sakshi News home page

బ్యాంకులు, ఓఎంసీలదే భారం

Published Fri, Jan 13 2017 2:37 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

బ్యాంకులు, ఓఎంసీలదే భారం - Sakshi

బ్యాంకులు, ఓఎంసీలదే భారం

పెట్రోల్‌ బంకుల్లో కార్డు చార్జీలపై కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పెట్రోల్‌ బంకుల్లో కార్డు లావాదేవీలు నిర్వహించేవారికి శుభవార్త. బంకుల్లో క్రెడిట్, డెబిట్‌ కార్డుల ద్వారా పెట్రోలు, డీజిల్‌ కొనుగోలు చేసేవారిపై చార్జీల భారం ఉండదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మరోసారి స్పష్టం చేశారు. కార్డుల లావాదేవీలపై పడే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌) చార్జీలను బ్యాంకులు, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలే(ఓఎంసీలు) భరించాలని చెప్పారు. ధర్మేంద్ర  గురువారం కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎండీఆర్‌ భారం వినియోగదారులపై పడే ప్రసక్తే లేదు. ఇది సుస్పష్టం. పెట్రోలు బంకులు ఈ చార్జీలు చెల్లించనవసరం లేదు.

ఇక వీటిని చెల్లించాల్సింది బ్యాంకులు, ఓఎంసీలేనని తర్వాత మీడియాతో అన్నారు. ఇది వాణిజ్య పర నిర్ణయం కాబట్టి లావాదేవీల చార్జీలను ఏవి ఏ మేరకు భరించాలన్నది ఈ రెండూ కలసి కూర్చొని, పరస్పరం చర్చించుకుని నిర్ణయించుకోవాలి’ అని వివరించారు. ఎండీఆర్‌ చార్జీలు కిందటేడాది డిసెంబర్‌ 16న రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఉంటాయని చెప్పారు. ఆ చార్జీలు బ్యాంకులు, ఓఎంసీలు ఏ నిష్పత్తిలో చెల్లించాలన్నది నిర్ణయించలేదన్నారు. రెండు మూడు రోజుల్లో  సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందని.. అనంతరం 16 నుంచి ఎండీఆర్‌ చార్జీలు వసూలు చేస్తారని అన్నారు. ఎండీఆర్‌ చార్జీలు అన్ని క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై ఒక శాతం, డెబిట్‌ కార్డుల లావాదేవీలపై 0.25 శాతం నుంచి ఒక శాతం వరకు విధిస్తారన్నారు. క్యాష్‌లెస్‌ లావాదేవీలు చేసే వారికి ఇంధన ధరలపై 0.75 శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం కొనసాగుతుందన్నారు.

క్రెడిట్, డెబిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలను అంగీకరించినందుకు వారి నుంచి బ్యాంకులు వసూలు చేసే చార్జీలను ఎండీఆర్‌ అంటారు. దీనిని వినియోగదారుల నుంచి వసూలు చేసేవారు. పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ చార్జీలను డిసెంబర్‌ 30 వరకు  రద్దు చేసింది. తర్వాత ఈ చార్జీలను బంకు యజమానులే చెల్లించాలని బ్యాంకులు కోరాయి. ప్రభుత్వం వినియోగదారులపై చార్జీల భారం పడనివ్వరాదని చెప్పడంతో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోలు బంకుల యజమానులు కార్డు లావాదేవీలను అంగీకరించమని ఆందోళన చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement