
దేశానికి వాళ్ళే హీరోలు..
ముంబైః దేశంకోసం ప్రాణత్యాగం చేయగలిగే సైనికులే అసలైన హీరోలన్నారు విలక్షణ నటుడు నానా పటేకర్. దేశరక్షణ విషయంలో జవాన్లముందు తామెందుకూ పనికిరామని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి సైనికులే సిసలైన హీరోలన్న పటేకర్.. పాకిస్థాన్ విషయంలో బాలీవుడ్ తారల మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో బాలీవుడ్ లో పాకిస్థాన్ తారల పరిస్థితి సందిగ్ధంగా మారింది. కళాకారులు పాకిస్థాన్ కు తిరిగి వెళ్ళాలా అన్న ప్రశ్నకు స్పందించిన నానా పటేకర్ దేశ భద్రత విషయంలో సైనికులే హీరోలని, యుద్ధ వాతావరణం ఉన్నపుడు కళాకారులు వేరుగా ఉండటం మంచిదేనని అన్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే రాజకీయ నిర్ణయమే కీలకమని తెలిపారు. దేశభద్రతకు సంబంధించిన నిర్ణయాల విషయంలో దేశం, సైనికులదే తుది నిర్ణయమని, కళాకారుల సమస్య బోర్డర్ సమస్యల కు మించింది కాదని చెప్పారు. పాకిస్థానీ యాక్టర్లను బాలీవుడ్ నుంచి నిషేధించాలన్న విషయంపై చర్చలో భాగంగా స్పందించిన పటేకర్.. తాను దేశానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని, ఆ తర్వాతే ఎవరైనా అన్నారు.
దేశం ముందు కళాకారులు నల్లులవంటి వారని, దేశ రక్షణ ముందు తమ మాటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని పాటేకర్ మీడియాకు తెలిపారు. ఉడీ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థానీ కళాకారులు ఫవాద్, మహీరా ఖాన్ వంటి వారు దేశం విడిచి వెళ్ళాలని, వారు నటించిన సినిమాల ప్రమోషన్లను అడ్డుకోవాలని మహరాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) నుంచి డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, హన్సల్ మెహతా, ఓం పురి, నగేష్ కుకునూర్, రణదీప్ హుడా, సోనాలి బింద్రే వంటి ప్రముఖులు నిషేధాన్ని వ్యతిరేకించిన వారిలో ఉన్నారు. ఇదే విషయంపై పటేకర్ ను ప్రశ్నించగా దేశానికి సైనికులే పెద్ద హీరోలని, వారి ముందు మిగిలిన ఎవరైనా సాధారణ ప్రజలేనని చెప్పారు. తమ మాటలకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఒకవేళ తాము సూచించినా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం పెద్దగా లేదని అభిప్రాయపడ్డారు.