సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి ముఖర్జి అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ కోర్టు గురువారం అంగీకరించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీ ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇక ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి ముఖర్జి అప్రూవర్‌గా మారితే తమకు అభ్యంతరం లేదని, ఇది కేసులో తమ వాదనను మరింత బలోపేతం చేస్తుందని సీబీఐ అంతకుముందు కోర్టుకు నివేదించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణి ముఖర్జీ ఈ కేసులో సాక్షిగా మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియాకు 2007లో తన తండ్రి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కార్తీ చిదంబరం రూ 305 కోట్ల విదేశీ పెట్టుబడులకు ఆమోద ముద్ర వేయించారని సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్నాయి. ఇదే కేసులో గత ఏడాది ఫిబ్రవరి 28న కార్తీ చిదంబరంను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment