న్యూఢిల్లీ: మహిళల పట్ల గౌరవభావం లేని వారితో కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అమర్యాదకరంగా వ్యవహరిస్తే కఠిన శిక్షలుంటాయని అటువంటి వారికి హెచ్చరికలు పంపాలని స్పెషల్ జడ్జి సందీప్ యాదవ్ తెలిపారు. ఓ మహిళతో అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిపై మెజిస్టీరియల్ కోర్టు విధించిన శిక్షను తొలగించటానికి ఆయన నిరాకరించారు.
ఇందుకు సంబంధించిన వివరాలివీ.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ 2015 మే 25న బల్మీకి బస్తీలోని ఎంసీడీ టాయిలెట్‌లోకి వెళ్లింది. అదే సమయంలో కుమార్ అనే వ్యక్తి ప్రవేశించి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు అతని నుంచి తప్పించుకుని భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారించిన మెజిస్టీరియల్ కోర్టు కుమార్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
దీనిపై కుమార్ హైకోర్టును ఆశ్రయించగా స్పెషల్ జడ్జి సందీప్ యాదవ్ గురువారం తీర్పు సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. ఒక వివాహితతో ఎలా మెలగాలో తెలియని వ్యక్తికి ఆ శిక్ష సబబేనని తెలిపారు. లైంగిక వేధింపులు, మహిళ గౌరవ మర్యాదలకు భంగం కలిగించటం ఐపీసీ ప్రకారం శిక్షార్హమైన తీవ్ర నేరాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని చెప్పారు. దీనిపై బాధితుడి తరఫు న్యాయవాది వాదిస్తూ.. సదరు మహిళ తప్పుడు ఉద్దేశంతోనే, పథకం ప్రకారం కావాలనే ఈ కేసులో కుమార్‌ను ఇరికించిందని, విచారణ సందర్భంగా ఆమె భర్తను సరియైన రీతిలో విచారణ జరపలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment