
ఫోన్ ఆర్డర్ చేస్తే.. బట్టల సబ్బులొచ్చాయి..!
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్ వెబ్‌సైట్ నుంచి బ్రాండెడ్ ఫోన్ ఆర్డర్ చేసిన ఓ ఉద్యోగి పార్సిల్ తెరచి చూసి అవాక్కయ్యారు. వేల రూపాయలు పోసి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే.. డిటర్జెంట్ సబ్బులు పార్శిల్‌లో వచ్చాయని సోషల్‌మీడియా వేదికగా తనకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు. దేశ రాజధానిలో ఉద్యోగం చేసే చిరాగ్ ధావన్ కొద్ది రోజుల క్రితం అమెజాన్ వెబ్‌సైట్ నుంచి ఓ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశారు.
సోమవారం పార్శిల్ ఆఫీస్‌కు వచ్చినా.. దాన్ని ఓపెన్ చేయకుండా అలానే ఉంచి ఇంటికి వచ్చిన తర్వాత తెరచి చూశారు. బాక్సులో బట్టల సోప్స్ ఉండటంతో నివ్వెరపోయిన ఆయన ఫేస్‌బుక్‌లో జరిగిన ఉదంతాన్ని షేర్ చేశారు. ధావన్ పోస్టుకు భారీ స్పందన వచ్చింది. వేలాది మంది ఆ పోస్టును లైక్ చేయడంతో పాటు షేర్ చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన అమెజాన్ తన ఆర్డర్‌ను రీ ప్లేస్ చేస్తామని హామీ ఇచ్చినట్లు ధావన్ బుధవారం తన ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్టు చేశారు.