
బంకుల్లో 0.75 శాతం డిస్కౌంట్
న్యూఢిల్లీ:
నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. కార్డుల ద్వారా లావాదేవిలు జరిపే వారికి అదనంగా ఎటువంటి చార్జీలు పడకుండా చూస్తున్నామని లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
బంకుల్లో కార్డు వినియోగదారులకు పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై 0.75 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. ఈ డిస్కౌంట్ సొమ్ము క్యాష్ బ్యాక్ రూపంలో సంబంధిత అకౌంట్లో జమ అవుతుంది. వినియోగదారుల అవగాహన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, సీఎన్జీ ఔట్లెట్లలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
కిందిస్థాయి నుంచి డీలర్లతో సమావేశాలు నిర్వహించామని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. పెద్దమొత్తంలో రీటైల్ ఔట్లెట్లు పోస్ మిషన్లు, ఈ-వ్యాలెట్ సౌకర్యాలను కల్పిస్తున్నాయి. నగదురహిత లావాదేవీలపై స్థానిక భాషల్లో రాసి ఉన్న బ్యానర్లు, కరపత్రాల సహాయంతో వినియోగదారుల్లో అవగాహన కలిగేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు.