న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంపై మరోసారి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులు నిర్వహించింది. ఢిల్లీతో పాటు చెన్నైలోని కార్తీ చిదంబరం నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా వ్యవహారం కేసులో ఈడీ మళ్లీ సోదాలు చేపట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం కార్తీ చిదంబరం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన గైర్హాజరు అయ్యారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.
కాగా 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియాకు కేటాయింపుల విషయంలో అవకతవకలు వెలుగులోకి రాగా, పెద్ద స్కాం బయటపడింది. దీంతో కార్తీపై ఈడీ... మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా పదేళ్ల తర్వాత కార్తీ పాత్ర వెలుగు చూడటంతో ఉందంటూ గత యేడాది మే 16న కార్తీ నివాసంతోపాటు ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, ఛండీగఢ్ లలో మొత్తం 13 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. కార్తీతోపాటు ఐఎన్‌ఎక్స్ మీడియా అధిపతులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీయాలకు చెందిన ఐఎన్‌ఎక్స్ మీడియాకు దొడ్డిదారిలో అనుమతులు మంజూరు చేయించినట్టు కార్తీపై ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment