మరాఠా గడ్డపై తెలుగు బిడ్డలు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఏర్పాటైన ప్రారంభంలో తెలుగువారు అసెంబ్లీ ఎన్నికలతోపాటు స్థానిక ఎన్నికల్లోనూ ప్రభావం చూపారు. అయితే కాలానుగుణంగా తెలుగు వారి ప్రభావం తగ్గిపోతోంది. రాజకీయంగా ఎదిగేందుకు తెలుగువారు చేస్తున్న ప్రయత్నాలు కొంతకాలంగా ఫలించడంలేదు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో షోలాపూర్, జాల్నా, చంద్రాపూర్, యావత్మల్ తదితర జిల్లాల్లో ప్రధాన పార్టీల నుంచి తొమ్మిది మంది తెలుగు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
షోలాపూర్‌లో...
జిల్లా కేంద్రమైన షోలాపూర్‌లో ఇప్పటికీ తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా ఇద్దరు తెలుగు అభ్యర్థుల మధ్యే జరగనుంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ఆడెం నర్సయ్య సీపీఎం నుంచి బరిలోకి దిగగా శివసేన నుంచి మహేశ్ కోటే పోటీ చేస్తున్నారు. వీరితోపాటు జక్కని నాగమణి, కోడం మహేష్‌లు బరిలో ఉన్నా ప్రధానంగా పోటీ మాత్రం నర్సయ్య, మహేశ్ ల మధ్యే జరగనుంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన సుశీల్‌కుమార్ షిండే తనయ, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రణతి షిండే కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ తరఫున విద్యా లోల్గే, బీజేపీ నుంచి మోహినీ పట్కి, ఎంఐఎం నుంచి షేఖ్‌తౌఫిక్ తదితరులు పోటీ చేస్తున్నారు. మొత్తం 26 మంది పోటీ చేస్తున్నా బరిలో ఉన్న తెలుగువారిపైనే ఓటర్లు దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
కార్మికనాయకుడు నర్సయ్య...
సీపీఎం అభ్యర్థి ఆడెం నర్సయ్య ఇప్పటిదాకా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో పోటీ చేసినాఆయనకు విజయం దక్కలేదు. అయినప్పటికీ సీపీఎం ఈ సారి కూడా నర్సయ్యనే బరిలోకి దింపింది. పార్టీ అభ్యర్థిగా పేరు ఖరారు అయిన తర్వాత వినూత్న పద్ధతిలో ఎన్నికల ప్రచారానికి నిధులు సమకూర్చుకున్నారు. ‘ఓటు వేయండి.. నోటు ఇవ్వండి...’ అనే నినాదంతో రెండు నెలలుగా ప్రజల మధ్య తిరిగిన ఆయనకు ప్రజల నుంచి... ప్రత్యేకించి కార్మికుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటిదాకా ప్రజలు ఇచ్చిన విరాళాలు రూ. 30 లక్షలదాకా పోగయ్యాయని నర్సయ్య ప్రకటించారు. ఆయనకు ఎంతటి ప్రజాదరణ ఉందో చెప్పేందుకు ఇదో మంచి ఉదాహరణ. కార్మికుల నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన షోలాపూర్ వాసుల సంక్షేమం కోసం ఆందోళనలు చేశారు. పట్టణంలోని బీడీ కార్మికుల సొంతింటి కల నెరవేరిందంటే అందులో నర్సయ్య పాత్ర ఎంతో ఉంది.
తిరుగుబాటు నేతగా బరిలో కోటే..
రాజకీయవారసత్వం ఉన్న మహేష్ కోటే శివసేన తరఫున షోలాపూర్ సిటీ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. సుశీల్‌కుమార్ షిండేకు అత్యంత సన్నిహితులుగా కోటే కుటుంబానికి గుర్తింపు ఉంది. షిండే రాజకీయంగా ఎదగడానికి మహేష్ తండ్రి విష్ణు కోటే కీలకపాత్ర పోషించారని కూడా చెబుతారు. తండ్రికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి లభిస్తుందని ఆశించి, భంగపడిన మహేశ్ కోటే కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేస్తూ శివసేనలో చేరారు. తండ్రి విష్ణు కోటే కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో శివసేన మహేశ్ కోటేకు టికెట్ ఇచ్చింది. మహేష్ కోటే గురించి చెప్పాలంటే... ఇప్పటి వరకు షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్, మేయర్‌తోపాటు పలు కీలకపదవులు చేపట్టారు. నగరంలో పలు అభివృద్ధి, సంక్షేమ పనులు చేసి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆయనకు ఆడెం నర్సయ్య వంటి బలమైన ప్రత్యర్థిని ఢీకొనాల్సిన పరిస్థితి ఏర్పడడం కొంత కష్టమే అయినా గెలుపు అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఓట్లు చీల్చనున్న స్వంతంత్రులు
షోలాపూర్ సిటీ సెంట్రల అసెంబ్లీ నుంచి ఆడెం నర్సయ్య, మహేష్ కోటేలతోపాటు నాగమణి జక్కన్, కోడం మహేష్, సోమశేఖర్ పాసికంటి తదితర తెలుగు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో నాగమణి, కోడం మహేష్‌లు షోలాపూర్ సిటీ నార్త్ నుంచి కూడా పోటీ చేస్తుండడం విశేషం. బీడి కార్మికురాలైన నాగమణి జక్కన్ గతంలో నాలుగు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో, అయిదు సార్లు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఇంతవరకు విజయం సాధించలేకపోయిన ఆమె మరోసారి బరిలోకి దిగడం విశేషం. అయితే తెలుగువారైన ఈ ముగ్గురు అభ్యర్థులు ఓట్లు చీల్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.