
మాజీ దళపతి కేవీ కన్నుమూత
గుండెపోటుతో జనరల్ కృష్ణారావు మృతి
♦ విజయవాడలో జన్మించిన కేవీ
♦ సిపాయిగా చేరి సైన్యం చీఫ్ దాకా..
♦ సైన్యం ఆధునీకరణకు కృషి.. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కీలక పాత్ర
♦ జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్‌గా సేవలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కీలకపాత్ర పోషించిన ఆర్మీ మాజీ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్.. జనరల్ కేవీ కృష్ణారావు(92) శనివారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ సైనిక ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. కొటికలపూడి వెంకటకృష్ణారావు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో 1923 జనవరి 16న జన్మించారు. నారాయణరావు, లక్ష్మి ఆయన తల్లిదండ్రులు. సైన్యంలో సాధారణ సిపాయిగా చేరిన కేవీ అంచెలంచెలుగా ఎదిగారు. 1981-83 మధ్య ఆర్మీ 14వ చీఫ్‌గా పనిచేశారు.
నాలుగు దశాబ్దాలపాటు సేవలు.. నాలుగు దశాబ్దాల పాటు ఆర్మీకి సేవలందించిన కేవీ స్వాతంత్య్రానికి ముందే 1942 ఆగస్టు 9న సైన్యంలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా, బెలూచిస్తాన్‌లలో పనిచేశారు. దేశ విభజన సమయంలో తూర్పు, పశ్చిమ పంజాబ్‌ల్లో విధులు నిర్వర్తించారు. 1947-48లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపక శిక్షకులలో కృష్ణారావు ఒకరు. 1949-51 మధ్య ఆయన డిఫెన్స్ అకాడమీలో పనిచేశారు. 1965-66లో లడఖ్‌లో ఒక దళానికి, 1969-70లో జమ్మూ ప్రాంతంలో ఇన్‌ఫాంట్రీ విభాగానికి కమాండర్‌గా వ్యవహరించారు. 1970-72 మధ్య నాగాలాండ్, మణిపూర్‌లలో తిరుగుబాట్ల అణచివేత దళాలకు నేతృత్వం వహించారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించారు. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, ఈశాన్య బంగ్లాదేశ్ ప్రాంతాలకు విముక్తి కల్పించడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ యుద్ధంలో కృష్ణారావు చూపిన ధైర్యం, సాహసోపేత నిర్ణయాలు, నాయకత్వ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించింది.
గవర్నర్‌గా విశిష్ట సేవలు.. కృష్ణారావు సేవలను గుర్తించిన కేంద్రం ఆర్మీ చీఫ్‌గా రిటైరైన అనంతరం ఆయనకు గవర్నర్‌గా అవకాశం కల్పించింది. 1984-89 మధ్య నాగాలాండ్, మణిపూర్, త్రిపుర గవర్నర్‌గా ఆయన పనిచేశారు. మధ్యలో 1988లో కొంతకాలం పాటు మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. 1989-90 మధ్య, 1993-1998 మధ్య జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేశారు. ఉగ్రవాదం, తిరుగుబాట్లతో అట్టుడికిన కశ్మీర్‌లో తిరిగి శాంతి నెలకొనేందుకు కృషి చేశారు.
ప్రముఖుల సంతాపం..కేవీ మృతి పట్ల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సైన్యాధిపతిగా కేవీ సేవలు చిరస్మరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. కేవీ సైన్యంలోఎందరికో మార్గదర్శకంగా నిలిచారని రక్షణమంత్రి పరీకర్ అన్నారు.
వైఎస్ జగన్ సంతాపం
కృష్ణారావు మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సైన్యాధిపతిగా కృష్ణారావు ఎనలేని సేవలందించారని, పదవీ విరమణ తర్వాతా గవర్నర్‌గా మెప్పించారని ఒక ప్రకటనలో గుర్తు చేసుకున్నారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారతమాత గొప్ప ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు.
బలగాల ఆధునీకరణలో.. భారత సైన్య ఆధునీకరణలో కేవీది ప్రధాన పాత్ర. 1975లో ప్రభుత్వం కేవీ అధ్యక్షతనే సైన్యం పునర్వ్యవస్థీకరణ, ఆధునీకరణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. దీని సిఫార్సుల ను కేంద్రం అమలు చేసింది కూడా. 1978-79 మధ్య ఆర్మీ ప్రధాన కార్యాలయం సిబ్బందికి డిప్యూటీ చీఫ్‌గా, 1979-81 మధ్య పశ్చిమ కమాండ్‌కు అధిపతిగా పనిచేశారు. 1981 జూన్ 1న 14వ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. 1983 జూలై దాకా ఆ పదవిలో ఉన్నారు.