‘ఇస్రో’ ప్రయోగాలు పైకి.. జీతాలు కిందకు | This is The Fate Of ISRO Staff | Sakshi
Sakshi News home page

‘ఇస్రో’ ప్రయోగాలు పైకి.. జీతాలు కిందకు

Published Thu, Sep 12 2019 6:02 PM | Last Updated on Thu, Sep 12 2019 6:52 PM

This is The Fate Of ISRO Staff - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చంద్రమండలం ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహించడం కోసం ఇటీవల అక్కడికి విక్రమ్‌ ల్యాండర్‌ను పంపించడం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించిన ‘చంద్రయాన్‌-2’ ప్రయోగాన్ని అటు ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇస్రో సిబ్బంది, ఇటు దేశ ప్రజలు ఎంతో ఉద్విగ్న భరితంగా వీక్షించిన విషయం తెల్సిందే. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి దాదాపు 28 కిలోమీటర్లు చొచ్చుకుపోయి చంద్రుడి ఉపరితలంకు కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్‌ ల్యాండర్‌ అదృశ్యమవడం అందరి హృదయాలను కాస్త కలచి వేసింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయినందుకు కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో చైర్మన్‌ కే. శివన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అక్కున చేర్చుకొని సముదాయించారు. అంతిమ లక్ష్యం చేజారిన రోదసిలో 3,84,400 కిలోమీటర్ల దూరం వరకు విక్రమ్‌ ల్యాండర్‌ను తీసుకెళ్లడం సాధారణ విషయం కాదని, ఇదీ విజయమేనని పలువురు అంతర్జాతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు కూడా మన ఇస్రో సిబ్బందిని ప్రశంసించారు. 

అంతటి ప్రాధాన్యత గల ఇస్రో సిబ్బందిని వేతనాల విషయంలో భారత ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఇందులో పనిచేసే సిబ్బందికి ఏడాదికి 1.5 లక్షల రూపాయల నుంచి 6.12 లక్షల రూపాయల వరకు మాత్రమే వేతనాలుగా చెల్లిస్తోంది. డ్రాయింగ్‌లను విశ్లేషించి మ్యాప్‌లను రూపొందించే ఓ సివిల్‌ ఇంజనీర్‌కు ఏడాదికి 2.20 లక్షల నుంచి 6.12 లక్షల రూపాయల వరకు,  టెక్నికల్‌ అసిస్టెంట్‌కు ఏడాదికి 2.36 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు వస్తున్నాయి. ఎక్కువ పని ఉండే ఫిట్టర్‌కు ఏడాదికి 1.53 లక్షల నుంచి 4,08 లక్షల రూపాయల వరకు వస్తున్నాయి. దేశంలోని ఐఐటీల్లో చదువుకున్న ఇంజనీర్లకు ఏడాదికి 9 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు వేతనాలు వస్తుంటే భారత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇస్రోలో వేతనాలు ఇంత తక్కువగా ఉండడం పట్ల ఆశ్చర్యం కలుగుతోంది. 

అదే విధంగా పెనం మీది నుంచి పొయ్యిలో పడేసినట్లు గత జూన్‌ 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇస్రో సిబ్బందికి ఓ సర్కులర్‌ను పంపించింది. ఇస్రో సిబ్బందిని ప్రోత్సహించడం కోసం ‘డబుల్‌ హైక్‌’ కింద 1996 నుంచి అదనంగా ఇస్తున్న పది వేల రూపాయలను జూలై ఒకటవ తేదీ నుంచి కోత విధించడమే ఆ సర్కులర్‌ సారాంశం. ఆ మేరకు జూలై ఒకటవ తేదీన ఇస్రో సిబ్బందికి రావాల్సిన జీతంలో పదివేల రూపాయల కోత పడింది. జూలై 15వ తేదీన ‘‘చంద్రయాన్‌-2’ ప్రయోగం జరుగనున్న నేపథ్యంలో ఈ చర్య వారి మనుసులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇస్రోకు చెందిన ‘స్పేస్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌’ రాయతీల విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించగా, వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయడానికి అదనంగా పదివేల రూపాయల ప్రోత్సాహక ఇంక్రిమెంట్‌ను ఇవ్వాల్సిందిగా 1996 ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంవత్సరం నుంచి కేంద్రం అదనపు ఇంక్రిమెంట్‌ కింద పది వేల రూపాయలను చెల్లిస్తూ వచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా ఆ ఇంక్రిమెంట్‌ను కట్‌ చేయడం పట్ల ఇస్రో సిబ్బంది హతాశులయ్యారు. వారు ఈ విషయమై చైర్మన్‌ కే. శివన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ కోత ఆగకపోవడంతో వారు అన్యమనస్కంగా పనిచేయడం వల్ల కూడా ‘‘చంద్రయాన్‌-2’  ఆశించిన లక్ష్యాన్ని సాధించడంలో విఫలం అయ్యిందేమో!

అస్తమానం దేశభక్తి గురించి నీతులు చెప్పే కేంద్ర ప్రభుత్వం నిజమైన దేశభక్తి కలిగిన ఇస్రో సిబ్బంది పట్ల చూపించాల్సిన ఆదరణ ఇదేనా? దేశంలో ఉద్యోగాలు లేక ఓ పక్క నిరుద్యోగులు చస్తుంటే ఇస్రోలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న 86 పోస్టులను ఎందుకు భర్తీ చేయరన్నది మరో ప్రశ్న. చంద్రమండలానికి మానవ యాత్రకు రంగం సిద్ధం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇస్రో సిబ్బంది వేతన వెతలు తీర్చకుండా వారి నుంచి అద్భుతాలు ఆశించడం తప్పే అవుతుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement