
సీఎం పక్క సీటు కోసం నేతలు రచ్చరచ్చ!
చెన్నై: సీఎం సీటు కోసం నేతలు గొడవపడటం చూస్తుంటాం. కానీ సీఎం పక్క సీట్లో కూర్చునేందుకు నేతలు గొడవపడి మాటల యుద్ధానికి తెరతీశారు. తమిళనాడులోని తరిప్పూర్ నగరంలో ఆదివారం ఇలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పక్క సీట్లో నేనంటే నేను కూర్చుంటానంటూ ఓ రాష్ట్ర మంత్రి, డిప్యూటీ స్పీకర్ల మధ్య వివాదం తలెత్తగా చివరకి సీఎం పళనిస్వామి గొడవ సద్దుమణిగేలా చేశారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుప్పూర్ సిటీలో బహిరంగ సభ ఏర్పాటుచేశారు. వేదికపై సీఎం పళనిస్వామి వచ్చి కూర్చున్నారు.
ఆ వెంటనే ఆయన పక్కన ఓ నేత కూర్చోగా, మరో సీటు ఖాళీగా ఉంది. ఆ సీటులో కూర్చునేందుకు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్, డిప్యూటీ స్పీకర్ పొల్లాచి జయరామన్ ఆసక్తి చూపించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సభలో అందరూ చూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయి నేతలిద్దరూ వాగ్వివాదానికి దిగారు. ఈ నేతల మద్దతుదారులు కూడా మరో నేతకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సీఎం పళనిస్వామి రంగంలోకి దిగారు. డిప్యూటీ స్పీకర్ జయరామన్‌కు సీఎం సర్దిచెప్పి వేరే సీటులో కూర్చోవాలని సూచించారు. సీఎం మాటకు జయరామన్ కట్టుబడటంతో గొడవ సద్దుమణిగింది.