దినకరన్ ఎమ్మెల్యేలపై వేటు
18 మందిని అనర్హులుగా ప్రకటించిన స్పీకర్
► అనర్హతపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేలు
► డీఎంకే ఎమ్మెల్యేలతో నేడు స్టాలిన్ అత్యవసర సమావేశం
► మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న విపక్షం?
► ఆసక్తికరంగా మారిన తమిళ రాజకీయాలు
చెన్నై: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే రాజకీయాలపై శశికళ పెత్తనానికి చెక్ పడింది. తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామిపై కాలుదువ్విన టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. స్పీకర్ ధనపాల్ సోమవారం అనర్హులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీచేశారు. సీఎం పళనిస్వామిని గద్దె దించేందుకు పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ ప్రయత్నించిన నేపథ్యంలో.. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ అనర్హత నిర్ణయం తీసుకున్నారు.
ప్రజాస్వామ్యం ఖూనీ చేశారంటూ దినకరన్ మండిపడ్డారు. ఈ ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం హైకోర్టులో అనర్హతను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేశారు. మరోవైపు, మారుతున్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు డీఎంకే ఎమ్మెల్యేలంతా చెన్నై రావాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది.
వివాదానికి కారణమేంటి?
జయలలిత మరణం, శశికళ జైలుకు పయనం తరువాత పార్టీ, ప్రభుత్వాలపై పెత్తనం విషయంలో టీటీవీ దినకరన్, సీఎం ఎడపాడి మధ్య రాజకీయ వైరంతో వివాదం రాజుకుంది. పన్నీర్‌సెల్వంను దరిచేర్చుకునేందుకు శశికళ కుటుంబాన్ని పళనిస్వామి దూరం పెట్టారు. దినకరన్‌ను కట్టడి చేశారు. దీంతో ఆగ్రహించిన దినకరన్ 19 మంది ఎమ్మెల్యేల చేత మద్దతు ఉపసంహరింపజేసి ప్రభుత్వాన్ని మైనార్టీలో పడవేయటంతో విపక్షాలన్నీ విశ్వాస పరీక్ష పెట్టాలని డిమాండ్ చేశాయి.
అటు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న 19 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వ ప్రధాన విప్ రాజేంద్రన్ స్పీకర్‌ను కోరారు. ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. జక్కయ్యన్ అనే ఎమ్మెల్యే ఒక్కరే స్పీకర్ ముందు హాజరై పళనిస్వామివర్గంలో చేరగా.. మిగిలిన వారిపై స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళ, బుధవారాల్లో ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
డీఎంకే మదిలో ఏముంది?
తమిళనాట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం డీఎంకే ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పళని సర్కారుపై ప్రజల్లోనూ అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలచే మూకుమ్మడిగా రాజీనామా చేయించి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పరిస్థితులు కల్పించాలని స్టాలిన్ భావిస్తున్నట్లు సమాచారం.
ఎవరి బలమెంత?
ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ విశ్వాస పరీక్షకు అనుమతిస్తే.. పళనిస్వామి మరోసారి సీఎంగా నెగ్గటం సులువే. మొత్తం 233 మంది ఎమ్మెల్యేలున్న ప్రస్తుత తమిళ అసెంబ్లీలో (జయ మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది) విజయానికి 117 సీట్లు అవసరం. అయితే.. పళనిస్వామి వర్గంలో 113 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మిత్రపక్షాలున్నారు. ఈ నేపథ్యంలో 18మందిపై అనర్హత వేటు పడితే.. 215 సభ్యులు మాత్రమే విశ్వాస పరీక్షలో పాల్గొంటారు. అప్పుడు గెలిచేందుకు 109 సీట్లు అవసరం.
ఈ మేజిక్ ఫిగర్‌ను సీఎం వర్గం సులభంగానే చేరుకుంటుంది. అయితే.. రెండ్రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు.. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోం మంత్రి రాజ్‌నా«థ్ సింగ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని వివరించారు.