
చెన్నై: సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఈసారి బోణి చేసి.. అధిక సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముందుకువెళ్తోంది. ఈనేపథ్యంలో ఎన్డీయే కూటమిలో భాగంగా.. తమిళనాడు పొత్తులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తమిళనాడులో పీఎంకే (పట్టాలి మక్కళ్ కట్చి) పార్టీతో బీజేపీ పొత్తు ఖరారైంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పీఎంకే పార్టీకి 10 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ.. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)తో పొత్తులో భాగంగా సీట్ల పంపకం ఖరారు చేసింది. బీజేపీ ఏఎంఎంకేకు రెండు సీట్లు కేటాయించినట్లు ఆ పార్టీ చీఫ్ టీటీవీ దినకరన్ బుధవారం వెల్లడించారు.
‘బీజేపీ మా పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికే మొగ్గు చూపింది. కానీ, మాకు కేవలం రెండు సీట్ల మాత్రమే కావాలని కోరాం. మా అభిప్రాయాన్ని పరిగణలోకి బీజేపీ మాకు రెండు సీట్లు కేటాయించింది. మాకు సీట్ల సంఖ్య పాధాన్యం కాదు.. మాకే ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించటమే ముఖ్యం’ అని టీటీవీ దినకరన్ అన్నారు. ఏయే పార్లమెంట్ నియోజకవర్గాలను తమకు కేటాయిస్తారమే విషయాన్ని బీజేపీ వెల్లడిస్తుందని తెలిపారు. తమిళనాడులో బీజేపీ గణనీయమైన ఎదుగుదలను కనబరుస్తోందని తెలిపారు. అయితే తమ పార్టీ గుర్తు కుక్కర్ కేటాయింపు విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐఏడీఎంకే పార్టీపై దినకరన్ విమర్శలు చేశారు. ఆ పార్టీ రోజురోజుకుగా ప్రభావం కోల్పోతోందన్నారు. కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆ పార్టీ పనిచేస్తోందని అన్నారు. పరోక్షంగా ఏఐఏడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామిపై విమర్శలు చేశారు. దినకరన్.. ఏఐఏడిఎంకే పార్టీ నుంచి 2017లో బయటకు వచ్చి ఏఎంఎంకే పార్టీన స్థాపించిన విషయం తెలిసిందే. ఇక.. తమిళానాడు ఇప్పటివరకు బీజేపీ ఒక్కస్థానంలో కూడా గెలుపొందకపోటం గమనార్హం. 2019లో లోకసభ ఎన్నికల్లో సైతం ఎన్డీయే మిత్రపక్ష పార్టీ ఏఐఏడిఎంకే పార్టీ ఒక సీటు గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment