CM Palaniswami
-
‘కొడనాడు’ దోపిడీ వెనుక పళనిస్వామి!
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ దోపిడీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎస్టేట్‌లోని కీలక పత్రాలు, వీడియోల కోసమే ఈ దోపిడీ, హత్యలు జరిగాయని తెహల్కా పత్రిక మాజీ సంపాదకుడు మాథ్యూస్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తమిళనాడు సీఎం పళనిస్వామి ఉన్నారని బాంబు పేల్చారు. జయలలిత విశ్రాంతి కోసం తరచూ ఈ ఎస్టేట్‌కు వచ్చేవారు. అలాంటి సందర్భాల్లో కొడనాడు ఎస్టేట్ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేవారు. అయితే జయలలిత చనిపోయాక 2017 ఏప్రిల్ 24న ఇక్కడ దోపిడీ జరిగింది. ఈ ఘటనలో వాచ్మెన్ ఓం బహదూర్ దారుణ హత్యకు గురికాగా, కృష్ణబహదూర్ అనే మరో వాచ్మెన్ గాయాలతో బయటపడ్డాడు. అప్పట్లో నగల కోసమే దొంగతనం జరిగిందని వార్తలొచ్చాయి. క్షమాపణ చెప్పే వీడియోలు.. అన్నాడీఎంకే వర్గాలను తన గుప్పెట్లో ఉంచుకునే రీతిలో జయలలిత కొన్ని కీలక రికార్డులను ఆ ఎస్టేట్‌లో దాచి ఉంచారని, తప్పు చేసిన పార్టీ నేతలు జయలలిత కాళ్లపై పడి క్షమించమని వేడుకునే వీడియోలు ఎస్టేట్‌లో ఉండేవని మాథ్యూస్ తెలిపారు. ఈ వీడియోలతో పాటు మరికొన్ని రికార్డుల కోసమే దోపిడీ జరిగిందని ఈ కేసులో నిందితుడు షయాన్ చెప్పాడు. జయలలిత ఆసుపత్రిలో ఉండగానే దోపిడీకి ప్రణాళిక రచించామనీ, పళనిస్వామి సీఎం అయ్యాక అది వీలైందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే నాటకం: సీఎం జయ పేరుకు కళంకం తీసుకురావడమే కాకుండా తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొత్త నాటకం మొదలైందని సీఎం ఆరోపించారు. ఈ విషయాన్ని ఇన్నిరోజులు నిందితులు కోర్టుకు ఎందుకు చెప్పలేదని పళనిస్వామి ప్రశ్నించారు. -
అవిశ్వాస తీర్మానం.. మేం మద్దతివ్వం..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం లేదని తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఈ తీర్మానానికి టీఆర్ఎస్ మద్దతివ్వదని ఆ పార్టీ ఎంపీ కవిత ముందుగానే సంకేతమిచ్చిన విషయం తెలిసిందే. కావేరి జలాలపై మా పార్టీ చేసిన పోరాటానికి ఏ పార్టీ మద్దతివ్వలేదని సీఎం ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. అందుకే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని సీఎం పళని స్వామి పేర్కొన్నారు. -
ప్రతీకారానికి సిద్ధం.. కనిపిస్తే కాల్చివేయండి .!
సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో తుపాకీ కాల్పులకు గురై విషాదకరమైన రీతిలో పోలీస్ ఇన్స్పెక్టర్ పెరియ పాండియన్ ప్రాణాలు కోల్పోవడంపై తమిళనాడు పోలీసుశాఖ అగ్రహంతో రగలిపోతోంది. పోలీసు అధికారి ప్రాణాలు హరించిన దుండగులు నాధూరాం, దినేష్ చౌదరి కనిపిస్తే కాల్చివేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం సూచన మేరకు రాజస్తాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు తెలుస్తోంది. కాగా, గురువారం చెన్నైకి చేరుకున్న సీఐ పెరియపాండియన్ భౌతికకాయానికి సీఎం ఎడపాడి సహా పలువురు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. చెన్నై శివారు కొళత్తూరు రెట్టేరి సమీపంలోని లక్ష్మీపురం కడప రోడ్డులోని మహాలక్ష్మి జ్యువెలరీ, కుదువ వ్యాపారంలో గత నెల 16వ తేదీ మధ్యాహ్నం దొంగలు పడి 3.5 కిలోల బంగారు నగలు, 4.5 కిలోల వెండి, రూ.2లక్షల నగదు దోచుకున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ దోపిడీపై రాజమంగళం పోలీసులు కేసునమోదు చేసి రాజస్థాన్‌కు చెందిన పాత నేరస్తులు నాధూరాం, దినేష్ చౌదరి ముఠాగా గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు రాజస్తాన్ వెళ్లిన పోలీసు బృందంలోని మధురవాయల్ శాంతిభద్రతల విభాగం ఇన్స్పెక్టర్ పెరియపాండి దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. చెన్నై కొళత్తరు ఇన్స్పెక్టర్ మునిశేఖర్, పలువురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో దుండగులు భీకరమైన రీతిలో పోలీసులపై ఎదురు తిరగడం, కాల్పులు జరిపి పారిపోవడం తమిళనాడు పోలీసుశాఖను గగుర్పాటుకు గురిచేసింది. నిందితులను ఎలాగైనా పట్టుకోవాలని తమిళనాడు నుంచి మరో పోలీసు బృందం రాజస్తాన్‌కు చేరుకుంది. అయితే సీఐ పెరియ పాండియన్‌పై కాల్పులు జరిపి పారిపోయిన దుండగుల చేతుల్లో తుపాకులు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కనిపిస్తే కాల్చివేయండి: వారిని ప్రాణాలతో పట్టుకునే క్రమంలో మరోసారి దారుణాలు చోటుచేసుకుంటాయని పోలీసుశాఖ అనుమానిస్తోంది. ఈ కారణంగా నాధూరం, దినేష్‌చౌదరి కనిపిస్తే వెంటనే కాల్పులు జరిపేలా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుని రాజస్తాన్ ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. రాజస్తాన్ ప్రభుత్వం సైతం కాల్పులకు ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిసింది. నాధూరం ఆచూకీ కోసం ఆయన భార్య మంజు, ప్రియురాలు దివ్యలను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా దినేష్ చౌదరిని గురువారం రాజస్తాన్‌లో అరెస్టుచేసినట్టు సమాచారం. సీఐకి ఘన నివాళి: ఇన్స్పెక్టర్ పెరియపాండియన్ భౌతిక కాయాన్ని గురువారం రాజస్తాన్ నుంచి విమానంలో చెన్నైకి తీసుకువచ్చారు. చెన్నై విమానాశ్రయం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆయన భౌతకాయాన్ని ఉంచారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీఐకి ఘన నివాళులర్పించారు. ఎడపాడి, పన్నీర్, మంత్రులు, పోలీసుశాఖలోని మొత్తం అధికారులు, సిబ్బంది తమ ఎడమచేతికి నల్లని గుడ్డను కట్టుకుని సంతాపం ప్రకటించారు. సీఐ భౌతికకాయాన్ని గురువారం సాయంత్రం చెన్నై నుంచి విమానంలో ఆయన స్వస్థలమైన తిరునెల్వేలి జిల్లా శంకరన్ కోవిల్‌కు తీసుకెళ్లారు. ప్రభుత్వ లాంఛనాలతో రాత్రి ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
ఎంజీఆర్ చిత్రానికి ముఖ్యమంత్రి క్లాప్
తమిళసినిమా: ఎంజీఆర్ చిత్రానికి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి క్లాప్ కొట్టారు. మక్కల్ తిలకం దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవిత చరిత్ర వెండితెర కెక్కునున్న విషయం తెలిసిందే. రమణ కమ్యూనికేషన్ పతాకంపై ఏ.బాలకృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం స్థానిక అడయారు సమీపంలోని ఫిలింసిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ చిత్రానికి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ముఖ్యఅతిథిగా హాజరై ముహూర్త సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, రాష్ట్రమంత్రులు పాండియన్, కడబూర్ రాజా, తిరువళ్లూర్ పార్లమెంట్ సభ్యులు వేణుగోపాల్, రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా సతీష్‌కుమార్ నటిస్తుండగా, అన్నాదురైగా దర్శకుడు ఎస్ఎస్.స్టాలిన్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింగంపులి, బ్లాక్ పాండి, ఏఆర్.దీనదయాళన్, ముత్తురామన్ నటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రులు వీఎన్.జానకి, జయలలితల పాత్రల్లో నటించే నటీమణుల ఎంపిక జరుగుతోందని నిర్మాత తెలిపారు. అదేవిధంగా చిత్ర టీజర్‌ను ఎంజీఆర్ జయంత్రి రోజు జనవరి 17న, చిత్రాన్ని ఏప్రిల్‌లోనూ విడుదలకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
దినకరన్ ఎమ్మెల్యేలపై వేటు
-
దినకరన్ ఎమ్మెల్యేలపై వేటు
18 మందిని అనర్హులుగా ప్రకటించిన స్పీకర్ ► అనర్హతపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేలు ► డీఎంకే ఎమ్మెల్యేలతో నేడు స్టాలిన్ అత్యవసర సమావేశం ► మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న విపక్షం? ► ఆసక్తికరంగా మారిన తమిళ రాజకీయాలు చెన్నై: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే రాజకీయాలపై శశికళ పెత్తనానికి చెక్ పడింది. తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామిపై కాలుదువ్విన టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. స్పీకర్ ధనపాల్ సోమవారం అనర్హులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీచేశారు. సీఎం పళనిస్వామిని గద్దె దించేందుకు పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ ప్రయత్నించిన నేపథ్యంలో.. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ అనర్హత నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేశారంటూ దినకరన్ మండిపడ్డారు. ఈ ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం హైకోర్టులో అనర్హతను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేశారు. మరోవైపు, మారుతున్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు డీఎంకే ఎమ్మెల్యేలంతా చెన్నై రావాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. వివాదానికి కారణమేంటి? జయలలిత మరణం, శశికళ జైలుకు పయనం తరువాత పార్టీ, ప్రభుత్వాలపై పెత్తనం విషయంలో టీటీవీ దినకరన్, సీఎం ఎడపాడి మధ్య రాజకీయ వైరంతో వివాదం రాజుకుంది. పన్నీర్‌సెల్వంను దరిచేర్చుకునేందుకు శశికళ కుటుంబాన్ని పళనిస్వామి దూరం పెట్టారు. దినకరన్‌ను కట్టడి చేశారు. దీంతో ఆగ్రహించిన దినకరన్ 19 మంది ఎమ్మెల్యేల చేత మద్దతు ఉపసంహరింపజేసి ప్రభుత్వాన్ని మైనార్టీలో పడవేయటంతో విపక్షాలన్నీ విశ్వాస పరీక్ష పెట్టాలని డిమాండ్ చేశాయి. అటు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న 19 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వ ప్రధాన విప్ రాజేంద్రన్ స్పీకర్‌ను కోరారు. ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. జక్కయ్యన్ అనే ఎమ్మెల్యే ఒక్కరే స్పీకర్ ముందు హాజరై పళనిస్వామివర్గంలో చేరగా.. మిగిలిన వారిపై స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళ, బుధవారాల్లో ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. డీఎంకే మదిలో ఏముంది? తమిళనాట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం డీఎంకే ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పళని సర్కారుపై ప్రజల్లోనూ అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలచే మూకుమ్మడిగా రాజీనామా చేయించి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పరిస్థితులు కల్పించాలని స్టాలిన్ భావిస్తున్నట్లు సమాచారం. ఎవరి బలమెంత? ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ విశ్వాస పరీక్షకు అనుమతిస్తే.. పళనిస్వామి మరోసారి సీఎంగా నెగ్గటం సులువే. మొత్తం 233 మంది ఎమ్మెల్యేలున్న ప్రస్తుత తమిళ అసెంబ్లీలో (జయ మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది) విజయానికి 117 సీట్లు అవసరం. అయితే.. పళనిస్వామి వర్గంలో 113 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మిత్రపక్షాలున్నారు. ఈ నేపథ్యంలో 18మందిపై అనర్హత వేటు పడితే.. 215 సభ్యులు మాత్రమే విశ్వాస పరీక్షలో పాల్గొంటారు. అప్పుడు గెలిచేందుకు 109 సీట్లు అవసరం. ఈ మేజిక్ ఫిగర్‌ను సీఎం వర్గం సులభంగానే చేరుకుంటుంది. అయితే.. రెండ్రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు.. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోం మంత్రి రాజ్నా«థ్ సింగ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని వివరించారు. -
గురి మార్చిన సీఎం పళని.. కళ్లుచెదిరే ఎత్తుగడ
-
గురి మార్చిన సీఎం పళని.. కళ్లుచెదిరే ఎత్తుగడ
సాక్షి, చెన్నై : టీవీవీ దినకరన్ ఎమ్మెల్యేలను చీల్చడంతో మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం ఎడపాడి పళనిస్వామి కళ్లుచెదిరే ఎత్తుగడలు సిద్ధంచేశారు. ఇందులో భాగంగా ఆయన డీఎంకే ఎమ్మెల్యేలను గురి పెట్టారు. దినకరన్ రూపంలో సీఎం పళని స్వామి ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సీఎంకు వ్యతిరేకంగా 21 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో ముందుకు సాగుతున్నారు. వీరితో పాటుగా ప్రధాన ప్రతి పక్షం సైతం బల నిరూపణకు పట్టుబడుతుండటంతో పళని సర్కారు ఇరకాటంలో పడింది. బల నిరూపణ తప్పని సరిగా మారిన పక్షంలో గట్టెక్కేందుకు తగ్గ మార్గాల్ని పళని అన్వేషిస్తున్నారు. ఇప్పటికే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ ధనపాల్ ద్వారా నోటీసులు ఇప్పించారు. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు అన్న ప్రశ్నతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇందుకు వారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందోనన్నది పక్కన పెడితే, సీఎం పళని కొత్త ఎత్తుగడతో బలపరీక్షలో నెగ్గేందుకు వ్యూహరచన చేసి ఉండటం వెలుగులోకి వచ్చింది. కొత్త వ్యూహం : కేంద్రంలోని ఢిల్లీ పెద్దలు రచించిన వ్యూహమా? అన్నాడీఎంకే సీనియర్లు ఇచ్చిన సలహానా? అన్నది పక్కన బెడితే, డీఎంకే సభ్యుల్ని గురి పెట్టి ఈ వ్యహ రచన సాగడం గమనించాల్సిన విషయం. ఇది కూడా నెల రోజుల క్రితం సాగిన ఘటనను ఆసరాగా చేసుకుని కొత్త ఎత్తుగడకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ వేదికగా గత నెల నిషేధిత గుట్కాల వ్యవహారంపై తీవ్ర రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిషేధిత వస్తువులు యథేచ్ఛగా దొరుకుతున్నాయంటూ సభలో గుట్కా ప్యాకెట్లను డిఎంకే సభ్యులు ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారాన్ని ఆ సమయంలో అధికార పక్షం పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు దీనినే వాడుకుని క్రమ శిక్షణా సంఘం ముందు ఉంచేందుకు సిద్ధం కావడం ఆలోచించాల్సిందే. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వేటుకు కసరత్తు : శాననసభలో 20 మంది డీఎంకే సభ్యులు గుట్కా ప్యాకెట్లను ప్రదర్శించినట్టుగా వీడియో ఆధారాల్ని ప్రస్తుతం సేకరించారు. గుట్కా వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి, ఆ సభ్యులపై చర్యకు ప్రస్తుతం క్రమ శిక్షణా సంఘానికి సిఫారసు చేయడంతో డీఎంకే వర్గాలు అగ్గి మీద గుగ్గిలంలా మండి పడుతున్నారు. తిరుగుబాటు దారులపై అనర్హత వేటు, 20 మంది డీఎంకే సభ్యుల సస్పెండ్ వెరసి సభలో సభ్యుల సంఖ్య తగ్గించినట్టు అవుతుందన్న వ్యూహంతోనే పళని ఈ ఎత్తుగడ వేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయ. సంఖ్య తగ్గిన పక్షంలో మెజారిటీ వ్యవహారంలోనూ సంఖ్యా బలం తగ్గేందుకు ఆస్కారం ఉందని, ఆ సమయంలో తమకు ఉన్న ఎమ్మెల్యే బలంతో పరీక్షలో నెగ్గవచ్చన్న వ్యూహాన్ని రచించినట్టు అన్నాడిఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది సాధ్యమా?: డీఎంకే సభ్యుల్ని గురి పెట్టి పళని కొత్త వ్యూహాన్ని రచించడం బాగానే ఉన్నా, ఆచరణలో సాధ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 40 రోజుల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడు తెర మీదకు తీసుకురావడాన్ని డిఎంకే సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈనెల 28వ(సోమవారం) తేదిన జరగనున్న క్రమ శిక్షణా సంఘం సమావేశంలో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమ శిక్షణా సంఘంలో సీఎం, స్పీకర్‌తో పాటుగా 17 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 10 మంది అన్నాడీఎంకే, ఆరుగురు డీఎంకే, ఒకరు కాంగ్రెస్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. అన్నాడీఎంకేకు చెందిన పది మందిలో ముగ్గురు దినకరన్ మద్దతు ఎమ్మెల్యే ఉన్నారు. ఈ దృష్ట్యా, నిర్ణయంపై సంఖ్యా బలం సమానంగానే ఉందని చెప్పవచ్చు. అన్నాడీఎంకే తరపున ఏడుగురు, డీఎంకే కాంగ్రెస్ తరపున ఏడుగురు సమానంగా ఉన్న దృష్ట్యా, చర్యల విషయంగా ఎలాంటి వివాదం సాగనున్నదో అన్నది వేచి చూడాల్సిందే. నేడు గవర్నర్‌తో భేటీ: నిన్నటి వరకు దినకరన్ వర్సెస్ పళని అన్నట్టుగా సాగిన బల పరీక్ష రచ్చ, ప్రస్తుతం స్టాలిన్ వర్సెస్ పళని అన్నట్టుగా మారి ఉంది. తమ ఎమ్మెల్యేను గురి పెట్టి సస్పెండ్ కార్యాచరణ సిద్ధం అవుతోండటాన్ని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ఆదివారం రాష్ట్రగవర్నర్(ఇన్) విద్యాసాగర్‌రావును కలిసేందుకు నిర్ణయించారు. పదిన్నర గంటలకు డిఎంకే ఎమ్మెల్యేలు అందరూ గవర్నర్‌ను కలవనున్నారు. ఈ విషయంగా తిరువారూర్‌లో స్టాలిన్మీడియాతో మాట్లాడుతూ,క్రమ శిక్షణా సంఘాన్ని సమావేశ పరచి, తమ సభ్యులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. -
వాట్సాప్‌లో సీఎంకు బెదిరింపులు
వేలూరు: పాలారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేకపోయారంటూ ముఖ్యమంత్రిని, కలెక్టర్‌ను బెదిరిస్తూ వాట్సాప్‌లో పోస్ట్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేలూరు జిల్లా వాలాజ సమీపంలోని తిరుమలచ్చేరి గ్రామానికి చెందిన విఘ్నేష్(31) ఎమ్మెస్సీ వరకు చదువుకుని ఖాళీగా ఉంటున్నాడు. వాలాజ వీసీ మోటూరు, రాణిపేట, ఆర్కాడు వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగం, ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో విఘ్నేష్ తరచూ ఫిర్యాదులు అందజేసేవాడు. ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్బ జలాలు అడుగంటి పోయి ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారంటూ, దానిని అరికట్టాలని కోరేవాడు. అయితే, అతడి ఫిర్యాదులకు అధికారులు స్పందించకపోవటంతో విఘ్నేష్ అసంతృప్తితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన సెల్ వాట్సాప్‌లో ఇసుక రవాణాను అరికట్టటానికి సీఎం పళనిస్వామి, కలెక్టర్ రామన్ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదంటూ బెదిరింపులు స్పురించేలా మాట్లాడి తన మిత్రులకు పోస్ట్ చేశాడు. వీటిపై వీఏవో సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు విఘ్నేష్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
సీఎం పక్క సీటు కోసం నేతలు రచ్చరచ్చ!
చెన్నై: సీఎం సీటు కోసం నేతలు గొడవపడటం చూస్తుంటాం. కానీ సీఎం పక్క సీట్లో కూర్చునేందుకు నేతలు గొడవపడి మాటల యుద్ధానికి తెరతీశారు. తమిళనాడులోని తరిప్పూర్ నగరంలో ఆదివారం ఇలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పక్క సీట్లో నేనంటే నేను కూర్చుంటానంటూ ఓ రాష్ట్ర మంత్రి, డిప్యూటీ స్పీకర్ల మధ్య వివాదం తలెత్తగా చివరకి సీఎం పళనిస్వామి గొడవ సద్దుమణిగేలా చేశారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుప్పూర్ సిటీలో బహిరంగ సభ ఏర్పాటుచేశారు. వేదికపై సీఎం పళనిస్వామి వచ్చి కూర్చున్నారు. ఆ వెంటనే ఆయన పక్కన ఓ నేత కూర్చోగా, మరో సీటు ఖాళీగా ఉంది. ఆ సీటులో కూర్చునేందుకు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్, డిప్యూటీ స్పీకర్ పొల్లాచి జయరామన్ ఆసక్తి చూపించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సభలో అందరూ చూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయి నేతలిద్దరూ వాగ్వివాదానికి దిగారు. ఈ నేతల మద్దతుదారులు కూడా మరో నేతకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సీఎం పళనిస్వామి రంగంలోకి దిగారు. డిప్యూటీ స్పీకర్ జయరామన్‌కు సీఎం సర్దిచెప్పి వేరే సీటులో కూర్చోవాలని సూచించారు. సీఎం మాటకు జయరామన్ కట్టుబడటంతో గొడవ సద్దుమణిగింది. -
ఎమ్మెల్యేల కొనుగోలుపై రచ్చరచ్చ
- అసెంబ్లీ లోపల, బయట డీఎంకే ఆందోళనలు - స్టాలిన్ సహా పలువురు ఎమ్మెల్యేల అరెస్ట్ చెన్నై: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున డబ్బు, బంగారం ఇచ్చినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైన నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాల ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేసింది. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే డీఎంకే ఎమ్మెల్యేలు లేచినిలబడి పన్నీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాకౌట్ చేసిన అనంతరం అసెంబ్లీ బయట కూడా ప్రభుత్వ వ్యతిరేక స్లోగన్లతో హోరెత్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ను, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సీఎం పళనిపై స్టాలిన్ మండిపడ్డారు. అక్రమంగా బలపరీక్షలో నెగ్గిన ప్రభుత్వాన్ని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఆందోళన, పోలీస్ అరెస్టులతో అసెంబ్లీ ఆవరణలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. -
శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి అష్టదళ పాద పద్మారాధన సేవలో వారు పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తితిదే జేఈవో భాస్కర్ పళనిస్వామి దంపతులను సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. ఆర్మీ వైస్ చీఫ్, లెఫ్ట్‌నెంట్ జనరల్ శరత్చంద్ర దంపతులు కూడా మంగళవారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. -
తదుపరి ఎవరో?
రెండాకుల చిహ్నం కోసం లంచం వ్యవహారంలో తదుపరి ఢిల్లీ పోలీసుల ఉచ్చులో పడేది ఎవరో అన్న ప్రశ్న అధికార పక్షాన్ని వెంటాడుతోంది. చెన్నై చుట్టూ మూడు రోజులు సాగిన విచారణలో పలువురు మంత్రుల ప్రమేయం వెలుగులోకి వచ్చిన సమాచారంతో సీఎం పళనిస్వామి కేబినెట్లో ఆందోళన నెలకొంది. చెన్నైలో విచారణ ముగించి ఢిల్లీకి దినకరన్‌ను తరలించినా, మళ్లీ కస్టడీకి తీసుకుని ఇక్కడికే తీసుకొస్తారేమోనన్న చర్చ సాగుతోంది. సాక్షి, చెన్నై : రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వద్ద చెన్నైలో మూడు రోజులుగా ఢిల్లీ పోలీసులు విచారించారు. శుక్రవారం అర్ధరాత్రి విచారణ ప్యారిస్, పెరంబూరు చుట్టు›సాగి ఉండడంతో, అక్కడ దినకరన్‌కు సన్నిహితులు ఎవరు ఉన్నారో అని ఆరా తీయాల్సిన పరిస్థితి. విచారణలో వెలుగు చూసిన చిరునామాల్లో తాము ఎవరి కోసం వచ్చామో ఆ వ్యక్తులు లేకపోవడం ఢిల్లీ పోలీసుల్లో అనుమానాలు బయలు దేరాయి. ఆదంబాక్కం మోహన్, కొలపాక్కం ఫిలిప్స్ డేనియల్, తిరువేర్కాడు గోపినాథ్‌లను విచారణ నిమిత్తం ఢిల్లీకి పిలుస్తూ సమన్లు జారీ చేశారు. 16 మందిలో ఐదుగుర్ని గురిపెట్టి చెన్నైలో విచారణ జరిగి ఉండగా, మిగిలిన వారిలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు అదనపు డీజీపీ, ఒకరు ఐజీ స్థాయి అధికారి ఉండడంతో వాళ్లెవరోనని ఆరా తీసే వాళ్లు పెరిగారు. మంత్రుల పేర్లు ఢిల్లీ పోలీసుల జాబితాలో ఉన్న సమాచారం సీఎం పళనిస్వామి కేబినెట్లో గుబులు రేపింది. శనివారం పలువురు మంత్రులు ఎక్కడ తమను ఢిల్లీ పోలీసులు విచారణ పేరిట పిలిపిస్తారోనన్న భయంతో సొంత జిల్లాల బాట పట్టడం గమనించాల్సిన విషయం. ఈ మూడు రోజుల విచారణలో ఢిల్లీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కాయో, అందులో ఏ మంత్రి పేరు ఉందో అన్న చర్చ అన్నాడీఎంకేలో ఊపందుకుంది. మంత్రుల్ని, ఐపీఎస్‌లను విచారించ దలచిన పక్షంలో కేసు సీబీఐకు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడడంతో రెండాకుల వ్యవహారంలో తదుపరి టార్గెట్ ఎవరో అన్న ఆందోళన బయలు దేరింది. ఇద్దరు మంత్రులు నగదు సమకూర్చడంలో సహకరించినట్టు, ముగ్గురు ఐపీఎస్‌లు ఢిల్లీకి చేరవేయడం ముఖ్య పాత్ర పోషించినట్టుగా ప్రచారం సాగుతుండడంతో, దినకరన్‌కు తోడుగా ఢిల్లీ వెళ్లబోయేదెవ్వరోనన్న ఉత్కంఠ తప్పడం లేదు. ఢిల్లీలో లంచం పుచ్చుకునేందుకు ప్రయత్నించిన ఎన్నికల అధికారులు ఎవరోనన్న విషయాన్ని బయటకు లాగే రీతిలో విచారణ సాగుతున్నట్టు సమాచారం. ఢిల్లీకి దినకరన్: మూడు రోజుల విచారణతో ఢిల్లీకి దినకరన్‌ను తరలించారు. నిన్నటి వరకు ఖద్దరు డ్రెస్‌తో తిరిగిన దినకరన్, తాజాగా టీ షర్టు, సాధారణ ప్యాంట్ ధరించి ఢిల్లీ పోలీసుల వెంట నడిచారు. చేతిలో ఓ బ్యాగ్‌లో తనకు కావాల్సిన వస్తువుల్ని తీసుకుని పోలీసు భద్రత నడుమ రాజాజీ భవన్ నుంచి విమానాశ్రయంకు చేరుకున్నారు. మొన్నటి వరకు సాధారణంగానే కనిపించిన దినకరన్, తాజాగా ఢిల్లీ వెళ్తూ బాధను దిగమింగుతున్నట్టుగా కనిపిస్తూ, మీడియాకు, తన కోసం వచ్చిన మద్దతుదారులకు చేతులు ఊపుతూ సెలవు తీసుకున్నారు. ఆదివారంతో కస్టడీ ముగియనుండడంతో, సోమవారం కోర్టులో హాజరు పరిచి మళ్లీ దినకరన్‌ను కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ కస్టడీకి తీసుకున్న పక్షంలో విచారణ చెన్నై చుట్టూ మళ్లీ సాగేనా, కొచ్చి, బెంగళూరు వైపుగా సాగేనా అన్నది వేచి చూడాల్సిందే. రూ. 200 కోట్లు లక్ష్యంగా: కొడనాడులో రూ.200 కోట్లు కొత్త నోట్లు ఉన్నట్టు, వాటి దోపిడీ లక్ష్యంగా వ్యూహ రచన జరిగినట్టు కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. తిరుచ్చూర్‌లో తొలుత ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని చేపట్టిన విచారణలో ఈ దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈ పథకంలో కోయంబత్తూరుకు చెందిన అన్నాడీఎంకే ప్రముఖుడి హస్తం ఉన్నట్టు తెలిసింది. కనకరాజ్‌కు పూర్తిగా ఎస్టేట్ గురించి తెలిసి ఉండడంతో అతడి సహకారంతో దోపిడీకి ప్రయత్నించిన సమయంలో సెక్యూరిటీ అడ్డుకోవడం, వారి మీద దాడి చేయక తప్పలేదని పట్టుబడ్డ వారు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో వరుసగా ఘటనలో సాగుతుండడంతో అమ్మ ఆత్మ కొడనాడులో సంచరిస్తున్నట్టు, బలి తీసుకుంటున్నట్టు అక్కడి గ్రామాల్లో కొత్త ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. -
ష్..అంతా రహస్యం!
♦ ఎవ్వరూ నోరు మెదపొద్దు.. సెంగోట్టయన్ హెచ్చరిక ♦ సీఎంగా పళని కొనసాగింపు నేతృత్వానికి ప్రత్యేక కమిటీ ♦ రహస్య మంతనాల్లో కొత్త అంశం ♦ 28 మంది ఎమ్మెల్యేల కొత్త నినాదం ♦ పలువురు చిన్నమ్మకు మద్దతుగా గళం సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే విలీన చర్చల అంశాల్ని రహస్యంగా ఉంచేందుకు పళని, పన్నీరు శిబిరాలు నిర్ణయించాయి. కమిటీలకు నేతృత్వం వహించే వాళ్లు తప్ప, ఇతరులు ఎవ్వరూ నోరు మెదపకూడదన్న హుకుంను తమ శిబిరాల్లోని నాయకులకు జారీ చేశారు. రెండో రోజుగా సాగిన రహస్య మంతనాల్లో ఇరు శిబిరాలు ఈ మేరకు నిర్ణయంతో పాటు ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చి ముందుకు సాగే పనిలో పడ్డట్టున్నాయి. ఇక, 28 మంది ఎస్పీ, ఎస్టీ ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టినట్టుగా మరో చోట రహస్య మంతనాల్లో మునగడం పళని శిబిరంలో కలవరాన్ని రేపింది. అన్నాడీఎంకేలోకి సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు శిబిరాలు ఏకం అయ్యేందుకు సాగుతున్న రహస్య ప్రయత్నాల గురించి తెలిసిందే. పన్నీరు శిబిరం నుంచి మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పళని శిబిరం నుంచి ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్టయన్ నగరంలోని ఓ హోటల్ వేదికగా బుధవారం రాత్రి కూడా చర్చల్లో మునిగారు. ఇరు శిబిరాలు తమ డిమాండ్ల మీద దృష్టి పెడుతూ, పదవుల పందేరం విషయంలో మాత్రం ఆచితూచి స్పందించే పనిలో పడ్డట్టున్నాయి. అలాగే, సీఎంగా పళని స్వామిని కొనసాగిస్తూనే, రిమోట్ కంట్రోల్ మాత్రం ఓ కమిటీ గుప్పెట్లోకి తీసుకొచ్చే అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా పన్నీరుసెల్వం వ్యవహరించే విధంగా, ఇరు శిబిరాలకు చెందిన ఐదుగురు లేదా ఏడుగురిని ఈ కమిటీ సభ్యులుగా ఎంపిక చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీని, ప్రభుత్వాన్ని ఈ కమిటీ నడిపించే విధంగా ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేసుకుందామన్న అభిప్రాయాల్ని పళని శిబిరం పన్నీరు శిబిరం దృష్టికి తీసుకెళ్లింది. సమస్యలన్నీ కుదుటపడ్డాక, పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చి, మెజారిటీ శాతం నిర్ణయం మేరకు తదుపరి అడుగులు వేద్దామన్న ఒడంబడికతో ముందుకు సాగుదామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సర్వ సభ్య సమావేశం సాగే వరకు పార్టీలోని పదవుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు వద్దన్న వాదనను పళని శిబిరం తెరమీదకు తీసుకు రాగా, ఆలోచిద్దామని పన్నీరు శిబిరం దాట వేసినట్టు సమాచారం. ఇక, పన్నీరు శిబిరానికి చెందిన పాండియరాజన్, సెమ్మలైలకు మంత్రి పదవి అప్పగించడంతో పాటు సామరస్య పూర్వకంగా వ్యవహారాలన్నీ సాగాలంటే, మార్గదర్శక కమిటీతో ముందుకు సాగడమే మంచిదన్న నిర్ణయాన్ని పళని శిబిరం స్పష్టం చేసినట్టుంది. అలాగే, కమిటీలో ఉన్న ముఖ్యులు తప్ప, మరెవ్వరూ చర్చల ప్రస్తావన మీడియా ముందుకు తీసుకురాకూడదన్న నిర్ణయం కూడా తీసుకున్నట్టుంది. అందుకే కాబోలు గురువారం ఉదయాన్నే మీడియా ముందుకు వచ్చిన మంత్రి సెంగోట్టయన్, విలీన చర్చల విషయంగా పార్టీ వర్గాలు ఎవ్వరూ నోరు మెదిపేందుకు వీలులేదని, అనవసర గందరగోళం సృష్టించే విధంగా వ్యవహరించవద్దని హెచ్చరించడం గమనార్హం. ఎవరికి వారు వ్యాఖ్యలు పేల్చడంతో చర్చల్లో జాప్యం తప్పడం లేదని, ఇక ఏ విషయమైనా కమిటీకి నేతృత్వం వహించే వాళ్లే ప్రకటిస్తారని వ్యాఖ్యానించారు. ఈ హుకుంతో పళని శిబిరానికి చెందిన ఎంపీ తంబిదురై, మంత్రి సీవీ షణ్ముగంలను మీడియా ప్రశ్నించగా, మున్ముందు పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయని స్పందించడం గమనార్హం. అలాగే, మంత్రి జయకుమార్‌ను కదిలించగా, తలుపులు తెరిచే ఉన్నాయని, చర్చలు ఎప్పుడైనా సాగవచ్చని ముందుకు సాగారు. పళని శిబిరానికి చెందిన పాండియరాజన్‌ను కదిలించగా, డిమాండ్లు నెర వేరగానే ఒకే వేదికగా చర్చలు ఉంటాయని, అన్నీ కమిటీ పెద్ద మునుస్వామి చూసుకుంటారని స్పందించారు. చిన్నమ్మకు మద్దతుగా : పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మూడో రోజుగా 17 జిల్లాల కార్యదర్శులతో సీఎం పళని స్వామి భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీలో పలువురు చిన్నమ్మ శశికళకు మద్దతుగా స్పందించడంతో షాక్‌కు గురికాక తప్పలేదట. ఒకరిద్దరు జిల్లాల కార్యదర్శులు అయితే, దినకరన్‌కు మద్దతుగా తమ గళాన్ని వినిపించగా, మరి కొందరు పన్నీరు అస్సలు పార్టీకి అవసరమా అని పెదవి విప్పినట్టు అన్నాడీఎంకే కార్యాలయంలో చర్చ సాగుతోంది. కొత్త నినాదం : విలీన రహస్య మంతనాలు, పార్టీ కార్యాలయంలో అభిప్రాయ సేకరణలు జోరందుకుంటున్న వేళ అమ్మ శిబిరానికి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశ పెట్టడం సీఎం పళనిస్వామికి మరోషాక్కే. అన్నాడీఎంకేలో 33 మంది ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో చోళవందాన్ ఎమ్మెల్యే మాణిక్యం, వాసుదేవనల్లూరు ఎమ్మెల్యే మనోహరన్, ఉత్తంకరై ఎమ్మెల్యే మనోరంజితం పన్నీరు శిబిరంలో ఉన్నారు. మిగిలిన 30 మంది అమ్మ శిబిరం వెన్నంటి ఉన్నారు. ఇందులో సరోజ, బెంజమిన్, రాజలక్ష్మి మంత్రులుగా పదవుల్లో ఉన్నారు. అయితే, తమ సామాజిక వర్గానికి మంత్రి, ఇతర పదువుల్లోని స్థానాల సంఖ్యను పెంచాలని నినదిస్తూ ప్రత్యేక సమావేశం చెన్నైలో పెట్టి ఉండడం గమనార్హం. ఇందులో స్పీకర్, ఓ మంత్రి మినహా తక్కిన 28 మంది హాజరైనట్టు సమాచారం. అర్ధరాత్రి వరకు ఈ మంతనాలు సాగి ఉండడంతో మున్ముందు ఈ ఎమ్మెల్యేలు అడుగులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. -
టీటీవీ తప్పుకో..
♦ అమ్మ శిబిరంలో గళం ♦ త్వరలో ఒకే వేదికగా పళని, పన్నీరు ♦ చర్చల్లో సామరస్యం సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నుంచి టీటీవీ దినకరన్‌ను సాగనంపేందుకు అమ్మ శిబిరంలో చక చకా ప్రయత్నాలు సాగుతున్నాయి. తప్పుకుంటావా...తప్పించమంటారా..? అన్న గళాన్ని సీఎం పళనిస్వామికి మద్దతుగా ఉన్న పలువురు మంత్రులు అందుకున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అన్నాడీఎంకే, ప్రభుత్వ రక్షకులుగా పళనిస్వామి, పన్నీరుసెల్వం ఏకం కావడం తథ్యం అని రెండు శిబిరాల్లోని సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో అన్నాడీఎంకే(అమ్మ) శిబిరంలో సాగుతున్న పరిణా మాలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఐటీ ఉచ్చులో పడ్డ మంత్రి విజయభాస్కర్‌ను తొలగించే వ్యవహరంలో అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, సీఎం ఎడపాడి పళని స్వామిల మధ్య బయలుదేరిన విభేదాలు కొత్త అడుగులకు దారి తీస్తున్నాయి. టీటీవీని పక్కన పెట్టి, అన్నాడీఎంకేను, ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు తగ్గ ఎత్తుగడల్లో మాజీ సీఎం, ప్రస్తుత సీఎం ఏకం అయ్యేందుకు సాగుతున్న ప్రయత్నాలు ఫలితాల్ని ఇస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇరు శిబిరాలకు చెందిన సీనియర్ల మధ్య ఆదివారం కూడా చర్చలు సాగినట్టు తెలిసింది. మంతనాల్లో: 90 శాతం మేరకు సంతృప్తికరంగానే మంతనాలు సాగినట్టు సీనియర్లు పేర్కొంటున్నారు. అదే సమయంలో పళని స్వామి వెంట నడిచేందుకు 60 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు, టీటీవీకి మద్దతుగా వ్యవహరించే విధంగా మరో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు గణాంకాల్లో తేలింది. ఇప్పటికే 12 మంది పన్నీరు వెంట ఉండగా, మరి కొందరు తటస్థంగా వ్యవహరిస్తుండటం తాజా చర్చల ద్వారా ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ లెక్కలు పళని స్వామి శిబిరాన్ని ఆలోచనలో పడేసినా, పన్నీరు సెల్వం నేతృత్వంలో అన్నాడిఎంకే పురట్చి తలైవీ శిబిరంలోని సీనియర్లు మాత్రం భరోసా ఇచ్చినట్టు తెలిసింది. కువత్తూరులో సాగిన వ్యవహారాల్ని పరిగణలోకి తీసుకుని ఇప్పటికే ఐటీ గురి పెట్టి ఉండటాన్ని తమకు అనుకూల అస్త్రం మలచుకుందామన్న సూచనను చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను ఐటీ సేకరించినట్టుగా, దాడులు తథ్యమన్న భయాన్ని సృష్టించేందుకు తగ్గ కార్యచరణను రూపొందించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీటీవీ తప్పుకో: ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు ఐటీ దాడుల భయాన్ని అస్త్రంగా ప్రయోగించేందుకు తాము సిద్ధం అని, అదే సమయంలో టీటీవీని ఎలా తప్పించాలో అన్న విషయం మీద దృష్టి పెట్టాలని పళని స్వామి మద్దతు మంత్రులకు పన్నీరు శిబిరం సూచించినట్టు తెలిసిందే.దీంతో మంత్రులు తంగమణి, వేలుమణిలో ఒక అడుగు ముందుకు వేసి దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారటా..!. టీటీవీ తప్పుకుంటావా..? , తప్పించ మంటారా..? అన్న నినాదాన్ని అందుకునే పనిలో పడ్డట్టు అన్నాడిఎంకే అమ్మ శిబిరంలో చర్చ సాగుతున్నది. టీటీవీని అన్నాడిఎంకే నుంచి తప్పించడంతో పాటుగా, ఐటీ ఉచ్చులో పడ్డ మంత్రి విజయ భాస్కర్‌ను పదవి నుంచి సాగనంపేందుకు ఎడపాడి సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఆ ఇద్దర్ని బయటకు పంపించి, ప్రజల వద్ద మార్కులు కొట్టేయడానికి తగ్గ వ్యూహంతో పళని స్వామి ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఇక, తనను తప్పించి, ఆ ఇద్దరు ఏకం అయ్యేందుకు సాగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు టీటీవీ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళను కలిసి, తదుపరి అడుగులు వేయడానికి నిర్ణయించినట్టు ఆయన మద్దతు ఎమ్మెల్యేల ఒకరు పేర్కొన్నారు. -
పళని విశ్వాస పరీక్షపై రాష్ట్రపతికి నివేదిక
- ఇప్పటికే పంపిన గవర్నర్ విద్యాసాగర్‌రావు - ‘అసెంబ్లీలో’ ఆరోపణలపై డీఎంకేను ఆధారాలు చూపాలన్న కోర్టు చెన్నై/ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా ఈ నెల 18న అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు నివేదిక పంపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. తమిళనాడు అసెంబ్లీలో నిబంధనలకు విరుద్ధంగా విశ్వాస పరీక్ష జరిగిందన్న దానిపై వీడియో క్లిప్పింగ్లుగాని, ఇతర ప్రామాణికాలుగాని సమర్పించాలని ప్రతిపక్ష డీఎంకేకు మద్రాస్ హైకోర్టు సూచించింది. విశ్వాస పరీక్షను రద్దు చేయాలంటూ ఈ నెల 20న డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హులువాది జి రమేశ్, జస్టిస్ ఆర్ మాధవన్‌లతో కూడిన ధర్మాసనం డీఎంకే ఆరోపణలపై ఆధారాలను సమర్పిం చాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ప్రజాస్వామ్యం ఖూనీ: స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో అన్నా డీఎంకే సభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, విపక్ష నేత స్టాలిన్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు జరిపారు. తిరుచ్చి తెన్నూర్ ఉళవర్ సంత మైదానంలో జరిగిన నిరాహార దీక్షలో స్టాలిన్ ప్రసంగిస్తూ.. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ ధనపాల్ అధికార పార్టీ సభ్యుడిగా మారిపోయారని మండిపడ్డారు. -
తమిళసభలో తన్నులాట
మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం ముగిసింది. ముఖ్యమంత్రి పళనిస్వామి శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గి మెజారిటీ ఎమ్మెల్యేలు తన పక్షానే ఉన్నారని నిరూపించుకున్నారు. కీలక సమయాల్లో బలంగా, దృఢంగా వ్యవహరించలేనివారు అనుకున్నది సాధించలేరని పన్నీర్‌సెల్వానికి తెలిసొచ్చింది. అయితే ఈ విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమైనవి. స్పీకర్‌పై దాడిచేసి ఆయన చొక్కా చించి, దౌర్జన్యం చేస్తుంటే మార్షల్స్ ఆయనను అతి కష్టం మీద అక్కడినుంచి తరలించాల్సివచ్చింది. తనపైనే దౌర్జన్యం జరిగిందని ప్రధాన ప్రతిపక్షం నాయకుడు స్టాలిన్ అంటున్నారు. డీఎంకే సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేశాక తీర్మానంపై ఓటింగ్ సాధ్యమైంది. అధికారం కోసం ఈ మాదిరి కాట్లాటలు మన దేశంలో సర్వసాధారణంగా మారాయి. ఇతర సమయాల్లో ఎంతో సంస్కారవంతంగా ఉన్నట్టు కనబడేవారు చట్టసభల్లో బలా బలాలు తేల్చుకోవాల్సివచ్చేసరికి ప్రత్యర్థులపైకి లంఘించడం, దూషణలకు దిగడం... గూండాయిజానికి కూడా సిద్ధపడటం తరచు కనబడుతుంది. జయలలిత మరణానంతరం అన్నా డీఎంకే సంక్షోభంలో పడింది. దీనికితోడు శశికళ జైలుపాలుకావడంతో ఆమె ఆశీస్సులతో లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన పళనిస్వామి బలనిరూపణ చేసుకోగలుగుతారా అన్న సందేహాలు చాలామందిలో ఏర్పడ్డాయి. శశికళ శిబిరంలోనివారు నిర్బంధంలో మగ్గుతున్నారన్న ప్రచారం జరి గింది. వారికి స్వేచ్ఛనిస్తే గెలుపు తనదేనని పన్నీర్ కూడా చెబుతూ వచ్చారు. తనకు మరో అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఒకసారి రాజీనామా చేశాక, దాన్ని ఆమో దించాక రాజ్యాంగపరంగా అది సాధ్యంకాని విషయం. రాజీనామా చేసిన రోజునే పన్నీర్ ఆమాట చెప్పి ఉంటే వేరుగా ఉండేది. అదే జరిగితే పన్నీర్ రాజీనామాపై గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు నిర్ణయాన్ని వాయిదా వేసేవారేమో! నిజానికి సుబ్రహ్మణ్యస్వామిని మినహాయిస్తే బీజేపీ నేతలంతా పన్నీర్‌సెల్వానికి మద్దతు పలికారు. కనుక కేంద్ర ప్రభుత్వ అండదండలు, గవర్నర్ సానుభూతి ఆయనకే ఉన్నాయని అందరికీ తెలుస్తూనే ఉంది. కానీ సారాంశంలో అధికారం అన్నది నంబర్ గేమ్! మెజారిటీ సభ్యులు ఎవరి పక్షాన ఉన్నారని తేలితే వారికి అది దక్కు తుంది. ఎవరికి ఇష్టం ఉన్నా, లేకున్నా తమిళనాడులో జరిగింది అదే. ప్రజలంతా శశికళపై ఆగ్రహంతో ఉన్నారని, ఎమ్మెల్యేలను చెరవిడిపిస్తే వారు కూడా పన్నీర్ వైపు వస్తారన్న ప్రచారం జరిగింది. ప్రముఖ సినీ నటులు సైతం పన్నీర్నే సమర్ధించారు. నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే విశ్వాసపరీక్షలో అది వ్యక్తమయ్యేది. పార్టీ నిలువునా చీలిపోకపోయినా కనీసం కొద్దిమందైనా మనసు మార్చుకునేవారు. బల నిరూపణ సమయంలో డీఎంకే వైఖరే అందరినీ ఆశ్చర్యపరి చింది. అధికారం కోసం అన్నా డీఎంకేలోని వైరి వర్గాలు ఘర్షణ పడటంలో అర్ధ ముంది. వారివల్ల సభా నిర్వహణకు ఆటంకాలెదురైతే వేరుగా ఉండేది. ఈ గొడ వతో సంబంధమే లేని ప్రతిపక్షం డీఎంకే దౌర్జన్యానికి పూనుకోవడం ఊహించని పరిణామం. సభలో తాము ఎవరినీ సమర్ధించబోమని ముందురోజు చెప్పిన మాటకే డీఎంకే నేత స్టాలిన్ కట్టుబడి ఉంటే ఆ పార్టీ పరువు నిలిచేది. కనీసం బలపరీక్షనాడు పన్నీర్‌కు మద్దతుగా ఓటేసి ఉన్నా ఎవరూ వేలెత్తిచూపరు. ఆ రెండు ప్రత్యామ్నాయాలనూ విడిచిపెట్టి రహస్య ఓటింగ్ జరపాలని డిమాండ్ చేయడం, అందుకు స్పీకర్ అంగీకరించలేదని ఆగ్రహించి వీరంగం వేయడం ఎలా సమర్ధ నీయం? పన్నీర్ సైతం రహస్య ఓటింగ్ కోసం పట్టుబట్టలేదు. గైర్హాజర్ కాలేదు. ఆయన వర్గంలోని వారంతా బలపరీక్షలో పాల్గొన్నారు. వారికి లేని అభ్యంతరం డీఎంకేకు ఎందుకు? తాము రహస్య ఓటింగ్ ప్రతిపాదన తెస్తే పన్నీర్ వర్గం చెలరేగి పోతుందని, తాము కూడా తలదూర్చి సభా నిర్వహణను అడ్డుకుంటే తీర్మానం ప్రతిపాదన అసాధ్యమై, చివరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టకతప్పదని ఆ పార్టీ అనుకుని ఉండొచ్చు. బలనిరూపణ మరికొన్నాళ్లు వాయిదా పడితే అన్నాడీఎంకే బీటలు వారుతుందని కలగని ఉండొచ్చు. నిజానికి శశికళ వర్గానికి సైతం అలాంటి అనుమానాలున్నాయి. రోజులు గడుస్తున్నకొద్దీ ఎమ్మెల్యేలు చేజారతారేమోనన్న దిగులుంది. అందుకే గవర్నర్ ఇచ్చిన పక్షం రోజుల గడువును కాదని, వెనువెంటనే ఓటింగ్‌కు సిద్ధపడింది. అయితే ఇప్పుడు గెలుపు సాధించినంతమాత్రాన పళనిస్వామి ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని... రాష్ట్రంలో అనిశ్చితికి తెరపడుతుందని భావించడానికి లేదు. ఇప్పటికైతే తన వారసుణ్ణి శశికళ గెలిపించుకోగలిగారు. కానీ ఇంతమంది ఎమ్మెల్యేలను ఎల్లకాలమూ చెదిరిపోకుండా ఆమె కాపాడుకోగలరా? వారిలో అసం తృప్తి రగలకుండా చూసుకోగలరా? జైలుకెళ్తూ తన బంధువు దినకరన్‌కు శశికళ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన ద్వారా ప్రభు త్వాన్ని నియంత్రణలో పెట్టుకోవాలన్నది శశికళ ఎత్తుగడ కావొచ్చు. మరికొన్ని నెలల్లోనే తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వివిధ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అప్పటికల్లా పళనిస్వామి నిల దొక్కుకోగలగాలి. సమర్థుడన్న పేరు తెచ్చుకోవాలి. ఇదంతా దినకరన్‌పై ఆధారపడి ఉంటుంది. పాలనలో శశికళ జోక్యం ఉన్నదన్న ముద్ర పడితే, పళనిస్వామి బల హీనుడన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. వాస్తవానికి ఇప్పటికీ ప్రజాబలం పన్నీర్‌కే ఉన్నదని సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్ని కలు, స్థానిక ఎన్నికలు కీలకమైనవి. అందులో ఫలితాలు ప్రతికూలంగా ఉంటే పళ నిస్వామి నుంచి వలసలు మొదలవుతాయి. ఎమ్మెల్యేలు అటు డీఎంకే వైపు... ఇటు పన్నీర్ వైపు చూడొచ్చు. అలాంటి పరిణామాలేమైనా జరిగితే వేరుగానీ ఈలోగానే పళనిస్వామికి శాపనార్థాలు పెట్టడం భావ్యం కాదు. అసెంబ్లీలో జరిగిన పరిణా మాలను సాకుగా చూపి పరిస్థితిని తిరగదోడటం మంచిది కాదు. బలపరీక్షలో ఆయన విజయం సాధించారు. దాన్ని గౌరవించి పాలన సజావుగా సాగేందుకు సహకరించడమే అందరి కర్తవ్యం. -
పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి?
-
పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి?
- వెలుగులోకి వాస్తవాలు - దాడికి నిరసనగా డీఎంకే దీక్షలు - రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న స్టాలిన్ సాక్షి, చెన్నై: డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాడి చేయించిందా? ఈ ప్రశ్నకు డీఎంకే నాయకులు అవుననే అంటున్నారు. మార్షల్స్ ముసుగులో నిబంధనలు ఉల్లంఘించి తొమ్మిది మంది ఐపీఎస్‌లు తమిళనాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే ఇందుకు బలమైన రుజువని చెబుతున్నారు. సభా నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎస్‌లను రంగంలోకి దించి, పథకం ప్రకారం ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్‌పై దాడి చేయించారన్న ఆరోపణలకు బలం చేకూరే ఆధారాలు దొరికినట్టు సమాచారం. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు సాగిన విచారణలో ఆ తొమ్మిది మంది ఐపీఎస్‌లను గుర్తించినట్టు తెలిసింది. ఈ విషయమై స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. సభలో స్పీకర్ కూడా లేని సమయంలో చొరబడ్డ ఆ అధికారులు బలవంతంగా స్టాలిన్‌ను బయటకు ఎత్తుకెళ్లినట్టు ఆధారాలు బయట పడ్డాయి. శ్రీధర్, సంతోష్‌కుమార్, జోషి నిర్మల్ కుమార్, ఆర్ సుధాకర్, రవి, గోవిందరాజ్, ముత్తలగు, శివ భాస్కర్, దేవరాజ్ అనే ఐపీఎస్‌లు సభలోకి వచ్చినట్టు గుర్తించారు. జల్లికట్టు ఉద్యమంలో సాగిన అల్లర్ల వ్యవహారంలో వీరిపై పలు ఆరోపణలు ఉన్నాయి. సభలో సాగుతున్న గందరగోళం మేరకు ఆగమేఘాలపై ఐపీఎస్‌లను రంగంలోకి దించాల్సి వచ్చినట్టు అసెంబ్లీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. అయితే, హఠాత్తుగా ఐపీఎస్‌లకు మార్షల్స్ యూనిఫారాలు ఎక్కడి నుంచి వచ్చాయని, సభలో స్పీకర్ లేని సమయంలో ఎలా మార్షల్స్ ముసుగులో ఆ అధికారులు ప్రవేశించారని డీఎంకే ప్రశ్నించింది. దీంతో ఈ తొమ్మిది మంది మెడకు నిబంధనల ఉల్లంఘన వ్యవహారం చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 22న డీఎంకే దీక్షలు స్టాలిన్‌కు జరిగిన అవమానంపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తనను బలవంతంగా ఎత్తుకు వచ్చి, దాడి చేశారని స్టాలిన్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై పోరాటానికి డీఎంకే శ్రేణులు సిద్ధమయ్యాయి. దూకుడు ప్రదర్శించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని స్టాలిన్ నిర్ణయించారు. ఆదివారం తేనాంపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. దాడికి నిరసనగా ఈనెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తిరుచ్చిలో జరిగే దీక్షకు స్టాలిన్ నేతృత్వం వహించనున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేసేందుకు కూడా అనుమతి కోరనున్నామని స్టాలిన్ తెలిపారు. దీక్షకు డీఎంకే సిద్ధం అవుతోంటే, మెరీనా తీరంలో నిషేదాజ్ఞల్ని ఉల్లంఘించి ఆందోళన నిర్వహించారని పేర్కొంటూ, స్టాలిన్, ఇద్దరు ఎంపీలు, 69 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. గవర్నర్ వద్ద పంచాయితీ - అసెంబ్లీని రద్దు చేయాలన్న డీఎంకే - సభలో పరిస్థితులను వివరించిన స్వామి చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి ఒకరిపై మ రొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను వివరించారు. కాసేపటి తర్వాత డీఎంకే ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలసి అధికార పార్టీ తీరుపై ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్యెల్యేలపై జరిగిన దౌర్జన్యంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, పరి శీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను బయటకు గెంటి బలపరీక్షలో ముఖ్యమంత్రి గెలవడం చట్టవిరుద్ధమని అన్నారు. శాసనసభలో శనివారం జరిగిన కార్యకలాపాలను రద్దు చేయాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల సభ్యులు లేకుండానే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారని సభలో విపక్ష నాయకుడు కూడా అయిన ఆయన పేర్కొన్నారు. శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా రణరంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే. డీఎంకే సభ్యులు కుర్చీలు, మైకులు విరగ్గొట్టి స్పీకర్ ధనపాల్‌పై విసిరివేశారు. సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం స్పీకర్ డీఎంకే ఎమ్మెల్యేలను బయటకి పంపి ఓటింగ్ ప్రక్రియను పూ ర్తి చేశారు. ఇదిలా ఉంటే స్వామిని బలపర్చినందుకు తనకు బెది రింపులు వస్తున్నాయని కోయంబత్తూరు ఎమ్మెల్యే అమ్మన్ అర్జునన్ ఆరోపించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి దుర్భాషలాడారని చెప్పారు. వికీపిడియాలో 'పళనిస్వామి: శశికళ బానిస' ప్రజా మద్దతుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పేరు వికీపీడియాలో మారిపోయింది. పళనిస్వామి పేరును కొట్టేసి ఆ స్థానంలో ‘శశికళ బానిస’ అని రాశారు. శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం గళమెత్తడంతో అన్నాడీఎంకేలో మొదలైన ఆధిపత్య పోరులో చివరికి చివరికి నాటకీయ పరిణామాల మధ్య పళనిస్వామి గద్దెనెక్కారు. సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ, ఇళవరసి, సుధాకరన్ జైలుకు వెళ్లారు. అయితే శశికళ మద్దతుదారుడైన పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడాన్ని జీర్ణించుకోలేని కొందరు వికీపీడియాలో ఆయన పేరును శశికళ బానిస అని మార్చేసి తమ కోపాన్ని చల్లార్చుకున్నారు. ఫిబ్రవరి 16నే దీనిని ఎడిట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ పేరును సరిచేశారు. ఇది మాఫియా సర్కార్: కమల్ హాసన్ పళనిస్వామి ప్రభుత్వంపై ప్రముఖ హీరో కమల్‌హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఏర్పాటైన ప్రభుత్వానికి, నేరగాళ్ల గ్యాంగ్‌నకు పెద్ద తేడా ఏమీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో శనివారం నాటి పరిణామాలను, సభ జరిగిన తీరును తనతో సహా ప్రజలు ఎవరూ అంగీకరించడం లేదన్నారు. జైలులో ఉన్న శశికళ ఎంచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు. తమిళ అసెంబ్లీని శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైందని, దానిని మనమే శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ అరంగేట్రంపై మరోమారు స్పందించిన కమల్ తాను రాజకీయాలకు పనికిరానని స్పష్టం చేశారు. -
గవర్నర్‌తో పళని, డీఎంకే నేతల భేటీ
-
గవర్నర్‌తో పళని, డీఎంకే నేతల భేటీ
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేశారు. నిన్న బలపరీక్షలో నెగ్గిన ముఖ్యమంత్రి పళనిస్వామి గవర్నర్‌తో భేటీ అయ్యారు. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. కాసేపటి తర్వాత డీఎంకే ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలసి అధికార పార్టీ తీరుపై ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్యెల్యేలపై జరిగిన దౌర్జన్యంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని డీఎంకే ఎంపీ తిరుచి శివ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను బయటకు గెంటి బలపరీక్షలో ముఖ్యమంత్రి గెలవడం చట్టవిరుద్ధమని అన్నారు. శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా రణరంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే. డీఎంకే సభ్యులు కుర్చీలు, మైకులు విరగ్గొట్టి స్పీకర్ ధనపాల్‌పై విసిరివేశారు. సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం స్పీకర్ డీఎంకే ఎమ్మెల్యేలను బయటకి పంపి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
నేడే బల పరీక్ష.. పది ఓట్లే కీలకం
-
పళనీ.. నన్ను చూసి నవ్వొద్దు
-
నన్ను చూసి నవ్వొద్దు
సీఎం పళనికి ప్రతిపక్షనేత స్టాలిన్ హితవు సాక్షి, చెన్నై: అసెంబ్లీలో అడుగు పెట్టే సమయంలో తనను చూసి నవ్వొద్దని సీఎం పళనిస్వామికి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ హితవు పలికారు. శుక్రవారం మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ... గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన దృష్ట్యా సీఎంకు తన శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు. సభకు వచ్చే సమయంలో ఆయన తనను చూసి నవ్వకుండా, చిరునవ్వులు చిందించ కుండా ఉంటే మంచిదన్నారు. స్టాలిన్‌ను చూసి పన్నీరు సెల్వం చిరునవ్వుతో పలకరిస్తున్నారన్న ఆగ్రహంతోనే ఆయన్ను పదవి నుంచి చిన్నమ్మ శశికళ తప్పించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీకి పళనిస్వామి కృతజ్ఞతలు: తనకు శుభాకాంక్షలు అందించిన ప్రధాని మోదీకి సీఎం పళనిస్వామి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం పదవి చేపట్టిన పళనిస్వామికి ప్రధాని మోదీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం లేఖ రాశారు. రాష్ట్రాభివృద్ధి కోసం పురట్చితలైవి అమ్మ దూరదృష్టితో ఏర్పాటు చేసిన పథకాలకు సహకారం అందించాలని కోరారు. ఉత్సాహంగా కనిపించిన శశికళ బొమ్మనహళ్లి (కర్ణాటక): అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శుక్రవారం కాస్త ఉత్సాహంగా కనిపించారు. ఇళవరసి, సుధాకరన్‌లతో మాట్లాడటమే కాకుండా తోటి ఖైదీల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొదటి రెండు రోజులు కాస్త ముభావంగా కనిపించిన ఆమె శుక్రవారం జైలు నిబంధనలను అనుసరించి ఆహారం తీసుకున్నారు. పత్రికలు చదివారు. టీవీ చూశారు. ఫ్లోర్ లీడర్‌గా సెంగోట్టయన్: తమిళనాడు శాసనసభ ఫ్లోర్ లీడర్‌గా కేఏ సెంగోట్టయన్ నియమితులయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో శనివారం సీఎం పళనిస్వామి బలపరీక్ష జరగనుంది. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా కేఏ సెంగోట్టయన్‌ను నియమించారు. -
‘మ్యాజిక్’ చేసేదెవరు?
తమిళనాడులో నేడే బలపరీక్ష... పది ఓట్లే కీలకం - ఉదయం 11 గంటలకు అసెంబ్లీ.. పన్నీర్ గూటికి మైలాపూర్ ఎమ్మెల్యే - పళని క్యాంప్‌లోని 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు - హుటాహుటిన రిసార్ట్స్‌కు సీఎం.. ఎమ్మెల్యేల బుజ్జగింపు - పళని శిబిరంలో 123.. పన్నీర్ వద్ద 12 మంది ఎమ్మెల్యేలు - పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామన్న డీఎంకే - అధిష్టానం ఆదేశానుసారం నడుస్తామన్న కాంగ్రెస్ చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడు రాజకీయ పరిమాణాలు చివరిఘట్టంలోనూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీలో నేడు ఉదయం 11 గంటలకు జరగనున్న బలపరీక్షపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామికి బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర్‌రావు 15 రోజుల గడువు ఇచ్చినప్పటికీ ఆయన శనివారమే బలం నిరూపించుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. సంఖ్యాపరంగా పళనిస్వామివైపే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఎవరికీ మద్దతివ్వబోమని ప్రకటించిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్.. తాజాగా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించి హైడ్రామాకు తెరలేపారు. అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనంటూ... మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ నటరాజన్ తాజాగా పన్నీర్ శిబిరంలోకి చేరారు. అమ్మ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు కుటుంబపాలనకు, విశ్వాసతీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాజనీ సీఎం పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేశారు. కువత్తూరు క్యాంప్‌లో ఉన్న 20మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట పట్టారన్న వార్తలు సంచలనం రేకెత్తించాయి. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పళనిస్వామి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు జైలునుంచి శశికళ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు రహస్య ఓటింగ్ డిమాండ్ చేస్తూ పన్నీర్ మద్దతుదారులు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్ రహస్య ఓటింగ్‌కు అనుమతిస్తే పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. క్యాంపులో ఉన్నవారిలో పదిమంది పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసినా పరిస్థితులు తారుమారవుతాయి. దీంతో శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కాపాడుకుని బలపరీక్షలో సత్తా చాటేందుకు పళనిస్వామి వ్యూహాలు రచిస్తున్నారు. మరో పదిమందినైనా ఆకర్షించడంద్వారా పళనిస్వామి ప్రభుత్వాన్ని గద్దె దించి శశికళను దెబ్బ కొట్టాలని విపక్షాలు పథకాలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జరుగనున్న బలపరీక్షలో విజయమెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాక్షేత్రంలో జయలలిత బొమ్మతో గెలుపొందిన ఎమ్మెల్యేలు అమ్మ నమ్మినబంటువైపు నిలుస్తారా? చిన్నమ్మ నమ్మినబంటుకు ఓటేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠగా తమిళ రాజకీయాలు పురట్చితలైవి జయలలిత మరణం తరువాత ఆపద్ధర్మ సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం, చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు చేయడంతో తమిళ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పదిరోజుల హైడ్రామా తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ జైలు పాలుకావడం... పన్నీర్ పదవీచ్యుతుడవ్వడం.. ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. బలపరీక్షకు 15 రోజులు సమయం ఉన్నా... 18నే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఆ తరువాత కొన్ని గంటల్లో చెన్నైలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌కు తీసుకొచ్చిన ఎమ్మెల్యేలను తిరిగి కువత్తూరులోని రిసార్ట్స్‌కు తరలించారు. ఆ తరువాత మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్ శుక్రవారం ఉదయం పళనిస్వామికి ఝలక్ ఇచ్చి పన్నీర్ శిబిరంలో వచ్చి చేరారు. తాను అమ్మ ఫొటోతో గెలిచానని, అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. అవసరమైతే తిరిగి అమ్మఫొటోతో ఎన్నికలకు వెళ్లేందుక్కూడా వెనుకాడబోనని ప్రకటించినట్లు తెలిసింది. 20 మంది తిరుగుబాటు నటరాజన్ ప్రకటన వెలువడిన వెంటనే రిసార్ట్స్‌లో ఉన్న సుమారు 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను వారు తెరమీదకు తెచ్చారు. వెంటనే తీర్చకపోతే తమ నిర్ణయం మరోలా ఉంటుందని హెచ్చరించారు. దీంతో పళనిస్వామి బెంగళూరు పర్యటను రద్దు చేసుకున్నారు. హుటాహుటిన శుక్రవారం రిసార్ట్స్‌కు వెళ్లి ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. బెంగళూరు జైల్లో ఉన్న శశికళ కూడా తమ వద్దకు రావడం కంటే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూడమని హుకుం జారీచేసినట్లు తెలిసింది. క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేలందరితో శశకళ జైలు నుంచి ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. బలనిరూపణలో గెలిచిన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అసంతృప్త ఎమ్మెల్యేలకు ఆశ చూపినట్టు తెలుస్తోంది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేయాలని భావించే ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వారి బంధువులు, అనుచరులను రిసార్ట్స్‌కు పిలిపించి ఒప్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రిసార్ట్స్ పరిసర ప్రాంతాల్లో వాహనాలతో నిండిపోయాయి. రిసార్ట్స్‌కు వచ్చిపోయే వారిని మన్నార్గుడి సైన్యం క్షుణ్ణంగా పరిశీలించి అనుమతిస్తోంది. రిసార్ట్స్ గేటు ముందు, కువత్తూరు ముఖద్వారం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రహస్య ఓటింగ్‌కు డిమాండ్ అసెంబ్లీలో నిర్వహించనున్న బలపరీక్షను రహస్యంగా చేపట్టాలని పన్నీర్‌సెల్వం మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ ధనపాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. క్యాంప్‌లో అనేకమంది ఎమ్మెల్యేను నిర్బంధించారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బలపరీక్షలో ఎమ్మెల్యేలంతా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని కోరారు. మరోవైపు పన్నీర్‌సెల్వంకు మద్దతుగా ప్రజలు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నివాసాలను, కార్యాలయాలను ముట్టడించారు. పన్నీర్ అనుకూలంగా ఓటెయ్యకపోతే నియోజకవర్గాల్లో తిరగలేరని హెచ్చరించారు. 30 ఏళ్ల తరువాత బలపరీక్ష రిపీట్ తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షలు, అవిశ్వాస తీర్మానాలూ కొత్తేమీ కాదు. 1952లో రాజాజీపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, 200 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా ఓటేసి తిరిగి సీఎంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత 1972 డిసెంబర్ 11న డీఎంకే నేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే పార్టీలో ఉన్న ఎంజీ రామచంద్రన్‌ను పార్టీ నుంచి తొలగించారు. ఆ సమయంలో సీఎం కరుణానిధిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ బలపరీక్షలో కరుణానిధికి అనుకూలంగా 172 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో ఆయనే సీఎంగా ఎన్నికయ్యారు. 1988లో ఎంజీ రామచంద్రన్ మరణించాక అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే (జా) జానకీ రామచంద్రన్, అన్నాడీఎంకే (జే) జయలలిత సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. జనవరి 28న బలపరీక్ష నిర్వహించారు. స్పీకర్ పీహెచ్ పాండ్యన్ సమక్షంలో నిర్వహించిన బలపరీక్షలో జానకీ రామచంద్రన్ సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. జానకీ రామచంద్రన్‌కు అనుకూలంగా 99 మంది, జయలలితకు అనుకూలంగా 33 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. ఆ సమయంలో అసెంబ్లీలో జరిగిన గొడవలో 29 మంది ఎమ్మెల్యేలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు ఆదేశించారు. జయలలిత మరణంతో 30 ఏళ్ల తరువాత తమిళనాడు అసెంబ్లీ మరోసారి బలపరీక్షకు సిద్ధమవుతోంది. నేడు జరుగనున్న బలపరీక్ష ఎవరికి పరీక్ష కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.