
ష్..అంతా రహస్యం!
♦ ఎవ్వరూ నోరు మెదపొద్దు.. సెంగోట్టయన్ హెచ్చరిక
♦ సీఎంగా పళని కొనసాగింపు నేతృత్వానికి ప్రత్యేక కమిటీ
♦ రహస్య మంతనాల్లో కొత్త అంశం
♦ 28 మంది ఎమ్మెల్యేల కొత్త నినాదం
♦ పలువురు చిన్నమ్మకు మద్దతుగా గళం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే విలీన చర్చల అంశాల్ని రహస్యంగా ఉంచేందుకు పళని, పన్నీరు శిబిరాలు నిర్ణయించాయి. కమిటీలకు నేతృత్వం వహించే వాళ్లు తప్ప, ఇతరులు ఎవ్వరూ నోరు మెదపకూడదన్న హుకుంను తమ శిబిరాల్లోని నాయకులకు జారీ చేశారు. రెండో రోజుగా సాగిన రహస్య మంతనాల్లో ఇరు శిబిరాలు ఈ మేరకు నిర్ణయంతో పాటు ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చి ముందుకు సాగే పనిలో పడ్డట్టున్నాయి. ఇక, 28 మంది ఎస్పీ, ఎస్టీ ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టినట్టుగా మరో చోట రహస్య మంతనాల్లో మునగడం పళని శిబిరంలో కలవరాన్ని రేపింది. అన్నాడీఎంకేలోకి సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు శిబిరాలు ఏకం అయ్యేందుకు సాగుతున్న రహస్య ప్రయత్నాల గురించి తెలిసిందే.
పన్నీరు శిబిరం నుంచి మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పళని శిబిరం నుంచి ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్టయన్ నగరంలోని ఓ హోటల్ వేదికగా బుధవారం రాత్రి కూడా చర్చల్లో మునిగారు. ఇరు శిబిరాలు తమ డిమాండ్ల మీద దృష్టి పెడుతూ, పదవుల పందేరం విషయంలో మాత్రం ఆచితూచి స్పందించే పనిలో పడ్డట్టున్నాయి. అలాగే, సీఎంగా పళని స్వామిని కొనసాగిస్తూనే, రిమోట్ కంట్రోల్ మాత్రం ఓ కమిటీ గుప్పెట్లోకి తీసుకొచ్చే అంశాన్ని తెర మీదకు తెచ్చారు.
ఈ కమిటీకి అధ్యక్షుడిగా పన్నీరుసెల్వం వ్యవహరించే విధంగా, ఇరు శిబిరాలకు చెందిన ఐదుగురు లేదా ఏడుగురిని ఈ కమిటీ సభ్యులుగా ఎంపిక చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీని, ప్రభుత్వాన్ని ఈ కమిటీ నడిపించే విధంగా ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేసుకుందామన్న అభిప్రాయాల్ని పళని శిబిరం పన్నీరు శిబిరం దృష్టికి తీసుకెళ్లింది. సమస్యలన్నీ కుదుటపడ్డాక, పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చి, మెజారిటీ శాతం నిర్ణయం మేరకు తదుపరి అడుగులు వేద్దామన్న ఒడంబడికతో ముందుకు సాగుదామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సర్వ సభ్య సమావేశం సాగే వరకు పార్టీలోని పదవుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు వద్దన్న వాదనను పళని శిబిరం తెరమీదకు తీసుకు రాగా, ఆలోచిద్దామని పన్నీరు శిబిరం దాట వేసినట్టు సమాచారం. ఇక, పన్నీరు శిబిరానికి చెందిన పాండియరాజన్, సెమ్మలైలకు మంత్రి పదవి అప్పగించడంతో పాటు సామరస్య పూర్వకంగా వ్యవహారాలన్నీ సాగాలంటే, మార్గదర్శక కమిటీతో ముందుకు సాగడమే మంచిదన్న నిర్ణయాన్ని పళని శిబిరం స్పష్టం చేసినట్టుంది.
అలాగే, కమిటీలో ఉన్న ముఖ్యులు తప్ప, మరెవ్వరూ చర్చల ప్రస్తావన మీడియా ముందుకు తీసుకురాకూడదన్న నిర్ణయం కూడా తీసుకున్నట్టుంది. అందుకే కాబోలు గురువారం ఉదయాన్నే మీడియా ముందుకు వచ్చిన మంత్రి సెంగోట్టయన్, విలీన చర్చల విషయంగా పార్టీ వర్గాలు ఎవ్వరూ నోరు మెదిపేందుకు వీలులేదని, అనవసర గందరగోళం సృష్టించే విధంగా వ్యవహరించవద్దని హెచ్చరించడం గమనార్హం. ఎవరికి వారు వ్యాఖ్యలు పేల్చడంతో చర్చల్లో జాప్యం తప్పడం లేదని, ఇక ఏ విషయమైనా కమిటీకి నేతృత్వం వహించే వాళ్లే ప్రకటిస్తారని వ్యాఖ్యానించారు.
ఈ హుకుంతో పళని శిబిరానికి చెందిన ఎంపీ తంబిదురై, మంత్రి సీవీ షణ్ముగంలను మీడియా ప్రశ్నించగా, మున్ముందు పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయని స్పందించడం గమనార్హం. అలాగే, మంత్రి జయకుమార్‌ను కదిలించగా, తలుపులు తెరిచే ఉన్నాయని, చర్చలు ఎప్పుడైనా సాగవచ్చని ముందుకు సాగారు. పళని శిబిరానికి చెందిన పాండియరాజన్‌ను కదిలించగా, డిమాండ్లు నెర వేరగానే ఒకే వేదికగా చర్చలు ఉంటాయని, అన్నీ కమిటీ పెద్ద మునుస్వామి చూసుకుంటారని స్పందించారు.
చిన్నమ్మకు మద్దతుగా : పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మూడో రోజుగా 17 జిల్లాల కార్యదర్శులతో సీఎం పళని స్వామి భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీలో పలువురు చిన్నమ్మ శశికళకు మద్దతుగా స్పందించడంతో షాక్‌కు గురికాక తప్పలేదట. ఒకరిద్దరు జిల్లాల కార్యదర్శులు అయితే, దినకరన్‌కు మద్దతుగా తమ గళాన్ని వినిపించగా, మరి కొందరు పన్నీరు అస్సలు పార్టీకి అవసరమా అని పెదవి విప్పినట్టు అన్నాడీఎంకే కార్యాలయంలో చర్చ సాగుతోంది.
కొత్త నినాదం : విలీన రహస్య మంతనాలు, పార్టీ కార్యాలయంలో అభిప్రాయ సేకరణలు జోరందుకుంటున్న వేళ అమ్మ శిబిరానికి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశ పెట్టడం సీఎం పళనిస్వామికి మరోషాక్కే. అన్నాడీఎంకేలో 33 మంది ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో చోళవందాన్ ఎమ్మెల్యే మాణిక్యం, వాసుదేవనల్లూరు ఎమ్మెల్యే మనోహరన్, ఉత్తంకరై ఎమ్మెల్యే మనోరంజితం పన్నీరు శిబిరంలో ఉన్నారు. మిగిలిన 30 మంది అమ్మ శిబిరం వెన్నంటి ఉన్నారు.
ఇందులో సరోజ, బెంజమిన్, రాజలక్ష్మి మంత్రులుగా పదవుల్లో ఉన్నారు. అయితే, తమ సామాజిక వర్గానికి మంత్రి, ఇతర పదువుల్లోని స్థానాల సంఖ్యను పెంచాలని నినదిస్తూ ప్రత్యేక సమావేశం చెన్నైలో పెట్టి ఉండడం గమనార్హం. ఇందులో స్పీకర్, ఓ మంత్రి మినహా తక్కిన 28 మంది హాజరైనట్టు సమాచారం. అర్ధరాత్రి వరకు ఈ మంతనాలు సాగి ఉండడంతో మున్ముందు ఈ ఎమ్మెల్యేలు అడుగులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.