
తదుపరి ఎవరో?
రెండాకుల చిహ్నం కోసం లంచం వ్యవహారంలో తదుపరి ఢిల్లీ పోలీసుల ఉచ్చులో పడేది ఎవరో అన్న ప్రశ్న అధికార పక్షాన్ని వెంటాడుతోంది. చెన్నై చుట్టూ మూడు రోజులు సాగిన విచారణలో పలువురు మంత్రుల ప్రమేయం వెలుగులోకి వచ్చిన సమాచారంతో సీఎం పళనిస్వామి కేబినెట్‌లో ఆందోళన నెలకొంది. చెన్నైలో విచారణ ముగించి ఢిల్లీకి దినకరన్‌ను తరలించినా, మళ్లీ కస్టడీకి తీసుకుని ఇక్కడికే తీసుకొస్తారేమోనన్న చర్చ సాగుతోంది.
సాక్షి, చెన్నై : రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వద్ద చెన్నైలో మూడు రోజులుగా ఢిల్లీ పోలీసులు విచారించారు. శుక్రవారం అర్ధరాత్రి విచారణ ప్యారిస్, పెరంబూరు చుట్టు›సాగి ఉండడంతో, అక్కడ దినకరన్‌కు సన్నిహితులు ఎవరు ఉన్నారో అని ఆరా తీయాల్సిన పరిస్థితి. విచారణలో వెలుగు చూసిన చిరునామాల్లో తాము ఎవరి కోసం వచ్చామో ఆ వ్యక్తులు లేకపోవడం ఢిల్లీ పోలీసుల్లో అనుమానాలు బయలు దేరాయి.
ఆదంబాక్కం మోహన్, కొలపాక్కం ఫిలిప్స్ డేనియల్, తిరువేర్కాడు గోపినాథ్‌లను విచారణ నిమిత్తం ఢిల్లీకి పిలుస్తూ సమన్లు జారీ చేశారు. 16 మందిలో ఐదుగుర్ని గురిపెట్టి చెన్నైలో విచారణ జరిగి ఉండగా, మిగిలిన వారిలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు అదనపు డీజీపీ, ఒకరు ఐజీ స్థాయి అధికారి ఉండడంతో వాళ్లెవరోనని ఆరా తీసే వాళ్లు పెరిగారు. మంత్రుల పేర్లు ఢిల్లీ పోలీసుల జాబితాలో ఉన్న సమాచారం సీఎం పళనిస్వామి కేబినెట్‌లో గుబులు రేపింది. శనివారం పలువురు మంత్రులు ఎక్కడ తమను ఢిల్లీ పోలీసులు విచారణ పేరిట పిలిపిస్తారోనన్న భయంతో సొంత జిల్లాల బాట పట్టడం గమనించాల్సిన విషయం.
ఈ మూడు రోజుల విచారణలో ఢిల్లీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కాయో, అందులో ఏ మంత్రి పేరు ఉందో అన్న చర్చ అన్నాడీఎంకేలో ఊపందుకుంది. మంత్రుల్ని, ఐపీఎస్‌లను విచారించ దలచిన పక్షంలో కేసు సీబీఐకు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడడంతో రెండాకుల వ్యవహారంలో తదుపరి టార్గెట్ ఎవరో అన్న ఆందోళన బయలు దేరింది.
ఇద్దరు మంత్రులు నగదు సమకూర్చడంలో సహకరించినట్టు, ముగ్గురు ఐపీఎస్‌లు ఢిల్లీకి చేరవేయడం ముఖ్య పాత్ర పోషించినట్టుగా ప్రచారం సాగుతుండడంతో, దినకరన్‌కు తోడుగా ఢిల్లీ వెళ్లబోయేదెవ్వరోనన్న ఉత్కంఠ తప్పడం లేదు. ఢిల్లీలో లంచం పుచ్చుకునేందుకు ప్రయత్నించిన ఎన్నికల అధికారులు ఎవరోనన్న విషయాన్ని బయటకు లాగే రీతిలో విచారణ సాగుతున్నట్టు సమాచారం.
ఢిల్లీకి దినకరన్:
మూడు రోజుల విచారణతో ఢిల్లీకి దినకరన్‌ను తరలించారు. నిన్నటి వరకు ఖద్దరు డ్రెస్‌తో తిరిగిన దినకరన్, తాజాగా టీ షర్టు, సాధారణ ప్యాంట్ ధరించి ఢిల్లీ పోలీసుల వెంట నడిచారు. చేతిలో ఓ బ్యాగ్‌లో తనకు కావాల్సిన వస్తువుల్ని తీసుకుని పోలీసు భద్రత నడుమ రాజాజీ భవన్ నుంచి విమానాశ్రయంకు చేరుకున్నారు. మొన్నటి వరకు సాధారణంగానే కనిపించిన దినకరన్, తాజాగా ఢిల్లీ వెళ్తూ బాధను దిగమింగుతున్నట్టుగా కనిపిస్తూ, మీడియాకు, తన కోసం వచ్చిన మద్దతుదారులకు చేతులు ఊపుతూ సెలవు తీసుకున్నారు. ఆదివారంతో కస్టడీ ముగియనుండడంతో, సోమవారం కోర్టులో హాజరు పరిచి మళ్లీ దినకరన్‌ను కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ కస్టడీకి తీసుకున్న పక్షంలో విచారణ చెన్నై చుట్టూ మళ్లీ సాగేనా, కొచ్చి, బెంగళూరు వైపుగా సాగేనా అన్నది వేచి చూడాల్సిందే.
రూ. 200 కోట్లు లక్ష్యంగా:
కొడనాడులో రూ.200 కోట్లు కొత్త నోట్లు ఉన్నట్టు, వాటి దోపిడీ లక్ష్యంగా వ్యూహ రచన జరిగినట్టు కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. తిరుచ్చూర్‌లో తొలుత ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని చేపట్టిన విచారణలో ఈ దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈ పథకంలో కోయంబత్తూరుకు చెందిన అన్నాడీఎంకే ప్రముఖుడి హస్తం ఉన్నట్టు తెలిసింది. కనకరాజ్‌కు పూర్తిగా ఎస్టేట్ గురించి తెలిసి ఉండడంతో అతడి సహకారంతో దోపిడీకి ప్రయత్నించిన సమయంలో సెక్యూరిటీ అడ్డుకోవడం, వారి మీద దాడి చేయక తప్పలేదని పట్టుబడ్డ వారు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో వరుసగా ఘటనలో సాగుతుండడంతో అమ్మ ఆత్మ కొడనాడులో సంచరిస్తున్నట్టు, బలి తీసుకుంటున్నట్టు అక్కడి గ్రామాల్లో కొత్త ప్రచారం ఊపందుకోవడం గమనార్హం.