న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకకు చెందిన 34 ఏళ్ల మహిళ తన తీరిక సమయంలో ఫేస్‌బుక్‌ను స్క్రోలింగ్ చేసింది. ఒక ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ యాడ్‌లో లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ పిల్లలకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
దీనితో పాటు మోడలింగ్‌లో శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది. తన కుమార్తెకు ఇది మంచి అవకాశం అవుతుందని ఆమె భావించింది. వెంటనే సదరు మహిళ ఆ యాడ్‌పై క్లిక్ చేసింది. అది ఆమెను ‘టెలిగ్రామ్’కు తీసుకువెళ్లింది. ఈ సంస్థను ఇదేవిధంగా చాలా మంది తల్లిదండ్రులు సంప్రదించారు. తమపిల్లలను మోడల్స్‌గా మార్చాలనే తాపత్రయంలో ఆ సంస్థ అడిగినంత ఫీజు చెల్లించారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ సంస్థ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన చిన్నారులకు మోడలింగ్ అసైన్‌మెంట్లు ఇవ్వనున్నట్లు హామీనిచ్చింది. ఎంతకాలం గడిచినా లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ చిన్నారులకు మోడలింగ్ అవకాశాలు కల్పించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్లు చేపట్టి ఈ సంస్థ గుట్టును రట్టు చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ సంస్థ ముఠా సభ్యులు 197 మంది తల్లిదండ్రుల నుంచి రూ.4.7 కోట్లకు పైగా మొత్తాన్ని వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలను మోడల్స్‌గా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులను టార్గెట్‌గా చేసుకుని, వీరు భారీ ఎత్తున మోసానికి పాల్పడ్డారు.
ఈ స్కామర్లు మోడలింగ్ చేస్తున్న పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇతర తల్లిదండ్రులను ఆకర్షిస్తారు. తరువాత వారిని టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చి, పిల్లలకు మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఇందుకు ఆన్‌లైన్ వేదికను ఉపయోగించుకుంటారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. తల్లిదండ్రులు ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట
Comments
Please login to add a commentAdd a comment