
చెన్నైకా..జైలుకా?
⇔ డిల్లీ పోలీసుల ముందు దినకరన్
⇔ ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్ల ఎరపై విచారణ
⇔ అరెస్ట్ ఖాయమంటున్న రాజకీయ వర్గాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకవైపు చేతుల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన అన్నాడీఎంకే, మరోవైపు తన కనుసన్నల్లో నడిచే ప్రభుత్వం..ఇలా వెలుగులీనుతుండిన దినకరన్ జీవితంలో అకస్మాత్తుగా చీకట్లు కమ్ముకున్నాయి. పోలీసుల కనుసన్నలను దాటి పోకూడని దుస్థితిని తెచ్చుకున్న దినకరన్ చెన్నైకి తిరిగి వచ్చేనా డిల్లీలో అరెస్టయి జైలుకెళ్లేనా అని అన్నిపార్టీలూ ఆలోచనలో పడ్డాయి. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్లు ఎరవేశారనే ఆరోపణలపై డిల్లీ పోలీస్ సహాయ కమిషనర్ సంజయ్ షెరావత్, ఇన్స్‌పెక్టర్ నరేంద్ర షాకల్ నుండి ఈనెల 19వ తేదీన దినకరన్‌కు స్వయంగా సమన్లు అందజేశారు.
అప్పటికే బ్రోకర్ సుకేష్ చంద్రశేఖర్‌ను డిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి వాంగ్మూలం సేకరించినందున దినకరన్‌ను సైతం అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. అయితే సమన్లలో ఈనెల 22వ తేదీన డిల్లీలో పోలీసుల ముందు దినకరన్ హాజరుకావాలని ఉంది. దినకరన్‌పై తగిన ఆధారాలు ఉన్నందునే సమన్లు జారీచేశామని చెన్నైకి వచ్చిన డిల్లీ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
ఎన్నికల కమిషన్‌ను లోబరుచుకునేందుకు దినకరన్ ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తి సుకేష్ చంద్రశేఖర్ నుండి అనేక వివరాలు రాబట్టామని తెలిపారు. ఈనెల 22వ తేదీన డిల్లీలో జరిపే విచారణలో దినకరన్‌పై ఆరోపణలు రుజువైన పక్షంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. దినకరన్ అరెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్న తరువాతనే డిల్లీ పోలీసులు చెన్నైకి వచ్చి సమన్లు అందజేసినట్లు తెలుస్తోంది. డిల్లీ పోలీసులు ముందు హాజరయ్యేందుకు కొంత గడువుకావాలన్న దినకరన్ కోర్కెను పోలీసులు నిరాకరించారు.
పైగా హాజరును దాటవేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం డిల్లీకి బయలుదేరి వెళ్లిన దినకరన్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో క్రైంబ్రాంచ్ పోలీసుల ముందు హాజరయ్యారు. దినకరన్ నియమించి బ్రోకర్‌గా అరెస్ట్ కాబడిన సుకేష్ చంద్రశేఖర్‌ను కూడా తీసుకువచ్చి ఇరువురినీ ముఖాముఖిగా విచారించారు. డిల్లీ పోలీసులు గుక్కతిప్పుకోకుండా దినకరన్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. రాత్రి 9 గంటల వరకు దినకరన్‌ను విచారిస్తూనే ఉన్నారని సమాచారం. అవసరమైతే ఆదివారం సైతం విచారిస్తారని, అరెస్ట్ చేసే అవకాశాలను కొట్టిపారవేయలేమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఇదిలా ఉండగా సీఎం ఎడపాడి సైతం అధికార పర్యటన నిమిత్తం శనివారం డిల్లీకి చేరుకోవడం దినకరన్‌కు కలిసొచ్చే అవకాశంగా భావించవచ్చు. శశికళ వర్గానికి చెందిన ఇరువురు ప్రముఖ నేతలు డిల్లీలో రహస్య మంతనాలు జరిపినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.