అన్నాడీఎంకే సర్కారును కూల్చడమే లక్ష్యంగా అమ్మ శిబిరం నేత దినకరన్ దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. ఆ కోవలో ఎమ్మెల్యేకు గాలం వేసే పనిలో పడ్డారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకూలమనే సంకేతాలు వెలువడ్డాయి. ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు మాజీ మంత్రులతో ఓ బృందం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామి సర్కారును కూల్చడయే లక్ష్యంగా ఆది నుంచి అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది.
కాగా, ఇంకొందరు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుని సీఎం పళని స్వామిని గద్దె దించాలనే లక్ష్యంగా దినకరన్ సాగుతున్నట్లు భావిస్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో సత్తా చాటుకున్న దినకరన్ వెన్నంటి నడిచేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సంసిద్ధంగా ఉన్నట్లు ఆ ఆయన వర్గం చెబుతోంది. పలువురు ఎమ్మెల్యేలు కూడా దినకరన్‌తో కలిసి అడుగులు వేద్దామనే ఆలోచనలో ఉన్నా, అనర్హత వేటుకు జడిసి, వెనక్కు తగ్గారు. ఇలాంటి వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు దినకరన్ నిర్ణయిం చుకున్నారు. సీఎం పళని స్వామిపై అసంతృప్తితో ఉన్న వారిని తమ వైపు తిప్పుకుని బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం ద్వారా సీఎం పళని స్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.
రంగంలోకి కమిటీ
సీఎంకు వ్యతిరేకంగా, అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను , తటస్థంగా ఉన్న మిత్రపక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు దినకరన్ ఓ కమిటీని రంగంలోకి దించారు. మాజీ మంత్రులు, అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ నేతృత్వంలో ఆ కమిటీ ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో పడింది. నామక్కల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రభును తమ వైపునకు తిప్పుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించింది. ఆ ఎమ్మెల్యే దినకరన్‌తో భేటీ కావడం గమనార్హం. విల్లుపురం, కడలూరు జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకున్నారు. ఇంకొందరు లక్ష్యంగా సాగుతున్నారు.
వారంతట వారే వస్తున్నారు..
విషయంగా దినకరన్‌ను ప్రశ్నించగా, ఎమ్మెల్యేలు తమంతకు తాము తమ వెంట వస్తున్నారన్నారు. త్వరలో ప్రభుత్వం కూలడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అమ్మ పేరు చెప్పుకుని అరాచకాలు సృష్టిస్తున్నారని, ప్రజల్ని అష్టకష్టాలు గురిచేస్తున్నారని మండి పడ్డారు. తాను ఎక్కడకు వెళ్లినా, త్వరితగతిన ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని కేడర్ విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. వారి ఆశ కొన్ని రోజుల్లో సాకారం కాబోతున్నదని వ్యాఖ్యానించారు.
మంత్రి తంగమణి మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్ తీవ్రంగానే కష్టపడుతున్నట్టున్నాడని మండిపడ్డారు. వారికి అనుకూలంగా ఏ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోరనే ధీమాను వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment