
మోదీ కూడా ఆ పార్టీని కాపాడలేరు
చెన్నై : తమిళనాడులో పాలక ఏఐఏడీఎంకేను ప్రధాని నరేంద్ర మోదీయే కాదు ఆయన తండ్రి కూడా కాపాడలేరని ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీయే తండ్రి తరహాలో ఆ పార్టీకి మార్గదర్శకత్వం వహిస్తున్నారని ఆరోపించారు.
కాగా దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 17 మందిపై తమిళనాడు స్పీకర్ తీసుకున్న వేటు నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్ధించడంతో ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 18న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలు పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ 17 నియోజకవర్గాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు దారుణ పరాజయం ఎదురైతే ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని ఏఎంఎంకే పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసిన దినకరన్ పేర్కొన్నారు. మరోవైపు డీఎంకే దిగ్గజ నేత ఎం కరుణానిధి మరణంతో ఖాళీ అయిన తిరువూర్ అసెంబ్లీ స్ధానంలోనూ 18న పోలింగ్ నిర్వహిస్తారు.